ఆరోగ్య సూత్రాలు - వివరణ .
* ఎదురుగాలి , ఎదురు ఎండ , దూళి రేగుచుండు ప్రదేశమున తిరుగుట , మంచు అధికంగా ఉండు స్థలముల యందు తిరుగుట , ఈదురుగాలి వీచు స్థలమున తిరుగుట నిషిద్దం . దీనివలన వాత పిత్త శ్లేష్మములు వికృతిని పొంది రోగమునకు కారణములు అగును . అందువలనే ప్రయాణములలో " విప్రత్య వాయుజనకముగాన అపశకునం " అనగా ఎదురు గాలికి ప్రయాణించకూడదు అని ఉదయము తూర్పునకు , సాయంకాలం పడమరకు ప్రయాణం చేయరాదు అని పెద్దలు నియమం పెట్టడం జరిగింది .
* తుమ్ము , త్రేపు , దగ్గు , నిద్ర , భోజనం , మైధునం వీనిని నిర్వర్తించు సమయము నందు శరీరంను వంకరటింకరగా తిప్పుకొని చేయరాదు . కారణమేమనగా పైన చెప్పిన పనులు అన్నింటికీ మనశరీరము యందలి వివిధ భాగములకు సంబంధం కలదు . కావున ఆ సమయములో శరీరము వంకరగా తిప్పుట వలన మెలిపడినట్లు తటస్థించి సక్రమముగా ఆ పనులు జరగకపోవడం వలన ఇతర అంగములకు చెడు జరుగును .
* నీటిగట్ల ఒడ్డున ఉండు నీడన విశ్రమించుట , శత్రువగు వానితో తిరుగుట , క్రూరజంతువులు , పాములు , కోరలు , కొమ్ములు కలిగిన జంతువులకు సమీపమునకు పోయి కవ్వించుట , తనకంటే ఎక్కువ తెలివి , బలం కలిగినవానితో పోట్లాడుట వంటివి మనకి చెడుచేయును కావున దూరముగా ఉండటం మంచిది .
నీటివొడ్డున గట్టుకింద కూర్చున్న లేదా పడుకున్న జలప్రవాహము వలన గట్టు తెగుట లేక గట్టు కూలుట వీనివలన తనకు హాని కలుగును . మనకంటే బలవంతుడు అయిన రాజుతో వైరం పెట్టుకున్న రాజగ్రహమునకు గురై చెడును . క్రూరమృగములతో , బలవంతుడు మరియు నేర్పరి అయినవానితో పొట్లాడిన శరీరనాశనము కు మూలము కాగలదు .
* సూర్యోదయానికి ముందు 2 ఘడియలు , సూర్యాస్తమయం అయిన 2 ఘడియలు వరకు "ప్రాతస్సంధ్య " అనియు , సూర్యాస్తమయం పూర్వం 2 ఘడియలు మొదలు సూర్యాస్తమయం అయిన తరువాత 2 ఘడియలు వరకు " సాయంసంధ్య " అని అందురు. ఈ సమయాలలో భోజనం చేయరాదు . స్త్రీసంభోగం నిషిద్దం . నిద్రించుట , చదువుట , ఆలోచించుట చేయరాదు . ఆ సమయము నందు స్వాభావికంగా దేహస్థితి మరియు దేశ కాలమాన పరిస్థితి మార్పుచెందుచుండును . కావున ఆ సమయము నందు పైన చెప్పిన పనులు చేసిన వికృతములుగా మారి శరీరముకు అనారోగ్యం కలుగచేయును .
* శత్రువుల ఇంటి యందు , సత్రముల యందు , సంఘముల యందు , వ్యభిచారి ఇంటి యందు , అన్నమును విక్రయించు శాల యందు గాని భుజించరాదు .
శత్రువుల ఇంటి యందు భుజించిన విషాహారం పెట్టు ప్రమాదం కలదు. సత్రముల యందు అనేక మంది చేరు స్థలముల యందు తినునప్పుడు అనేకవిధములు అయిన సాంక్రమిక రోగములు కలవారు ఉన్నచో వారివలన నానారోగములు కలుగును . సాని ఇంట తినకూడదు అని చెప్పుటకు ప్రధాన కారణం . వారు వశం చేసుకోవడానికి ఆహారం నందు గరవిషము ( పెట్టుడు మందులు ) పెట్టుటకు ఆస్కారం ఉంది . అన్నవిక్రయశాల నందు వారి లోభత్వము వలన నాశిరకం మరియు శుభ్రత లేనటువంటివి వండుతున్న వాటిని భుజించిన మనకి కూడా అనారోగ్యం కలుగును .
ఈ కారణము చేతనే కొందరు నియమవంతులు ఇప్పటికీ ఇల్లు దాటినచో స్వంతముగా వంట చేసుకుందురు .
* శరీర అవయవాలను ఉపయోగించి ధ్వనులు చేయకూడదు . నోటితో మద్దెల ధ్వని చేయుట చేతిగోళ్ళతో నేలపైన మరే స్థలముల యందు కొట్టుట చేత ఆయా శరీరభాగముల యందు అభిఘాతాలు కలిగి సహజమగు స్థితికి భంగము వాటిల్లను . కాబట్టి అట్టిపనులు చేయరాదు .
అదేవిధముగా ఖాళీగా ఉన్నప్పుడు చేతులు విదిల్చడం , జుట్టును గట్టిగా దులుపుకోవడం వంటివి చేయకూడదు . అలా చేయుట వలన బాహుసంధులు శిధిలం అగుటయే కాక కేశముల మొదళ్ళు వదులుగా అగును.
* నీటి ప్రవాహములో ఎదురు ఇదరాదు . నిప్పులమధ్యలో నుంచి , పండితుల మధ్య నుంచి వెళ్ళరాదు .
* శవదహనం చేయునప్పుడు అగ్ని నుండి బయటకి వెడలు పొగను పీల్చుట మరియు శరీరానికి తగలనివ్వరాదు . దీనివలన శవము నందు ఉండు దుష్టపదార్థముల యందు ఇమిడి ఉండే చెడు ఆవిరి శరీరంలోకి పోయి శరీరములోని నిర్మల ధాత్వాదులను మలినపరచి అనారోగ్యానికి కారణం అగును. ఒక్కోసారి మరణహేతువగును .