Saturday, August 26, 2023

ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ -

ప్రాచీన భారతీయ పురాణాలలో వివరించినటువంటి "బ్రహ్మస్త్రం" గురించి సంపూర్ణ వివరణ -

           మన భారతీయ పురాణాలు చదివినవారికి "బ్రహ్మస్త్రం " అనే పేరు అత్యంత సుపరిచితం అయినదే ముఖ్యంగా రామాయణ , మహాభారతాలలో ఎక్కువుగా వినిపిస్తుంది. ఈ బ్రహ్మస్త్ర ప్రయోగం మరియు దాని వివరాలు గురించి భారతీయులమైన మనకంటే పాశ్చాత్య శాస్త్రజ్ఞులకు ఈ విషయాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్నది. దీనికి ప్రధాన కారణం మనం నిర్లక్ష్యం చేసి వదిలివేసిన ఎన్నో అద్భుతగ్రంధాలు మరియు విజ్ఞానాన్ని వారు అర్థం చేసుకుని ఆదరించడమే . అలాంటి కొన్ని విజ్ఞానదాయకమైన విషయాలు మరుగునపడిపోయిన ఎన్నో విషయాలను మీకు తెలియచేయడానికి నావంతు ప్రయత్నం చేస్తున్నాను . ఇప్పుడు మీకు ప్రాచీన భారతీయ యుద్ధాలలో ఉపయోగించిన "బ్రహ్మస్త్రం" అనే ఒక భయంకర ఆయుధం గురించి వివరిస్తాను. దీనినే మనం ఈ ఆధునిక యుగంలో "ఆటంబాంబు " అని పిలుచుకుంటున్నాం.

                1945 వ సంవత్సరం జులై 16 వ సంవత్సరం తెల్లవారుజామున 5:30 సమయములో న్యూమెక్సికో ఎడారిలో ఒక బాంబు పరీక్షించారు. ఈ ప్రయోగం సరిగ్గా హిరోషిమా నగరం పైన అణుబాంబు ప్రయోగించడానికి నెలరోజుల ముందు జరిగింది. ఈ ప్రయోగం జరిగిన తరువాత ఓపెన్ హమీర్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త రోచస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక విద్యార్థి "మీ ప్రయోగం ప్రపంచంలో మొదటిసారే కదా ?" అని అడిగినాడు . అందుకు హమీర్ అవును ఇది ఈ ఆధునిక కాలంలో మాత్రం మొదటిది అని భారతదేశంలో జరిగిన పురాతన యుద్ధగాథలు , మహాభారతం గురించి వివరించాడు.

          ప్రాచీన భారతీయ పురాణాలలో బ్రహ్మస్త్రం గురించి ఈ విధముగా ఉన్నది. "అది ఒక్కటే బాణం కాని ఈ విశ్వశక్తి మొత్తం దానిలో ఇమిడి ఉన్నది. పదివేల సూర్యులు పగిలినట్లు మంటలు లేచి గగనాన్ని దేదీప్యమానం చేశాయి. ఒక ఇనుప పిడి లాంటి దానితో బిగించిన ఆయుధం ఇది. అజేయమైన మృత్యుసందేశాన్ని తెచ్చిన పిడుగు అది . సమస్త భవనాలను , కందకాలను బూడిద చేసివేసింది. కాలిపోయిన మనుష్యులెవరో గుర్తుపట్టటానికి వీలుకాలేదు . వెంట్రుకలు , గోళ్లు , కండ్లు , పండ్లు ఊడిపడిపోయాయి . పక్షులు , పశువులు , వృక్షాలు చచ్చి తెల్లగా మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారధాన్యాలు , వాతావరణం విషతుల్యం అయిపోయాయి. సైనికులు బావులలో , నదులలో దూకి మంటలు ఆర్చుకున్నారు" అని చెప్పబడినది. దీని గురించి మరిన్ని విషయాలు " with out trace " అను గ్రంధమున ఉదహరించారు. ఈ హమీర్ అనే శాస్త్రవేత్త సంస్కృతంలో మంచి పండితుడు . ఈయన న్యూ మెక్సికోలో అటామిక్ బాంబు పరిశోధనాలయా డైరెక్టర్ గా వ్యవహరించారు.

           సుప్రసిద్ద సోవియట్ పండితుడు అయిన A .A . గోర్బోవిస్కీ తన గ్రంథం "book of హైపోథెసిస్ " లో కూడా చాలా వివరణలు ఇచ్చారు . మన ప్రాచీన భారతీయులకు అణ్వస్త్ర విషయాల గురించి సంపూర్ణంగా తెలుసు. హరప్పా, మొహంజదారో నాగరికతలు విరాజిల్లిన కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరిపినప్పుడు అక్కడి వీధుల్లో నల్లగా కాలిపోయిన ముద్దల వంటి పదార్థం దొరికింది . మొదట శాస్త్రవేత్తలకు అది ఎలాంటి పదార్థమో అంతుబట్టలేదు . దానిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు అది మట్టితో చేసిన కుండపెంకులుగా నిర్దారించబడినవి . ఆ పదార్థం తీవ్రమైన వేడికి కరిగిపోయినదిగా నిర్దారించబడినది. అంతేకాదు ఆ పదార్థం తీవ్రమైన రేడియేషన్ కి గురిఅయ్యినది. ఉండవలసిన రేడియేషన్ స్థాయి కంటే కొన్ని వందల రెట్ల రేడియేషన్ ప్రభావం కనిపించింది.

                 4000 సంవత్సరాల క్రితం మరణించిన ఒక వ్యక్తి అస్థిపంజరంలో మామూలు ప్రమాణం కంటే ఎన్నో వందలరెట్ల రేడియోధార్మికత కనిపించింది. ఈ బ్రహ్మస్త్రాన్ని గురించి దక్షిణ అమెరికాలో కొన్ని పురాతన గ్రంథాలలో కూడా వివరణ ఉన్నది. అక్కడి గ్రంథాలలో దానిని "మాష్ మాకి " అనే పేరుతో పిలుస్తారు . భారతీయ ప్రాచీన వైమానిక శాస్త్రం అయినటువంటి "సమరాంగణ సూత్రధార " లో కూడా ఈ విషయాల గురించి వివరణ ఉన్నది.

          ఇలాంటి ఎన్నో రహస్యమైన భయంకర ఆయుధాలు మరియు పుష్పక విమానాలు వంటి వాటిని మరియు ఎన్నో రహస్య విద్యలకు సంబంధించిన సమస్త సమచారాన్ని కొన్ని రహస్య ప్రదేశాల్లో మన పూర్వీకులు దాచి ఉంచారు .

   

Tuesday, August 22, 2023

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు -

అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 

    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది. ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 

 స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 

      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 

 మోతాదు - 

     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 

       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 

  ఔషధోపయోగాలు - 

 * శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 

 * నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 

 * క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 

 * విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 

 * స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 

 * రక్తము నందలి దోషములను పోగొట్టును . 

 * కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 

 * నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 

 * పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 

 * మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 

 * అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .

 * బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 

 * శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 

 * కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 

 * గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 

 * గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 

 * కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 

 * వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 

 * స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 

 * మూర్చరోగులకు ఇది వరం వంటిది . 

 * స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 

 * స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 

      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి. ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 

         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 

      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 

  

Saturday, August 19, 2023

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు

ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు - 

 * ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.

 * నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.

 * రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.

 * వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.

 * ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .

 * ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.

 * నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .

 * రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.

 * నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.

 * కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .

            

Monday, August 14, 2023

శిరా వేధ పద్ధతి - ప్రాచీన చికిత్సా పద్దతి

శిరా వేధ పద్ధతి - ప్రాచీన చికిత్సా పద్దతి . 

      ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు .
 శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు.ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 

              మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. "ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం " శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను . 

    మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు .మర్మలు మరియు మర్మస్థానములు అనగా శరీరము నందు వాయుప్రసరణ జరుగు నాడీ జంక్షనులు .ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 

                      శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను . 

      
      ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను . 

  * పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను . 

 * క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను . 

 * గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను . 

 * గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును. 

 * ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను . 

 * కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను . 

 * పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను . 

 * అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను . 

 * అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను . 

 * అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను . 

             ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . నేను అటువంటి గ్రంథాలను నా పరిశోధన నిమిత్తం అధ్యయనం చేయుచుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోగలిగాను . ఆ విజ్ఞానాన్ని మీకు అందించాలన్న సదుద్దేశముతో మీకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేను రాసిన రెండు గ్రంథాలలో మరింత విపులంగా సమాచారాన్ని ఇచ్చాను. 

         మరొక విలువైన సమచారాన్ని మీకు త్వరలో అందిస్తాను. 

            సమాప్తం 


    

Sunday, August 13, 2023

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -

శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు -

 * శుక్రము నీటి గుణము కలిగి ఉంటుంది. స్త్రీ యొక్క ఆర్థవం తేజోగుణం కలిగి ఉంటుంది. 

 * ఈ శుక్రశోణితములు యందు పంచభూతాలు సూక్ష్మ రూపము కలిగి ఉండును. 

 * స్త్రీపురుష సంయోగ కాలం నందు శుక్రం అధికంగా ఉండిన యొడల పురుష సంతానం , స్త్రీ యొక్క ఆర్థవం పురుషుడి యొక్క శుక్రం కన్నా ఎక్కువుగా ఉన్నయెడల స్త్రీ సంతానం జనించును. శుక్రం మరియు స్త్రీ యొక్క ఆర్థవం సమాన స్థాయిలో ఉన్న నపుంసకుడు జనించును.

 * స్త్రీ ఋతు స్నానం చేసినది మొదలు 12 దినములు వరకు స్త్రీ యందు ఆర్థవం ఉత్పత్తి అగును. అందుకనే ఆ 12 దినములను ఋతు కాలం అనెదరు . కొన్ని గ్రంధములలో ఋతుకాలమును 16 దినములుగా పేర్కొన్నారు . అనగా స్త్రీ ఋతువు అయిన 3 దినములు వదిలివేసి మిగిలిన 12 దినముల కాలం ను గర్భాదారణ కు మంచి సమయం అని అర్థం . 

 * స్త్రీ ఋతుసమయం 3 దినములు అయిపోయిన వరసగా 4 - 6 - 8 - 10 - 12 దినముల యందు స్త్రీ , పురుష సంయోగం వలన పుత్రుడు , 5 - 7 - 9 - 11 దినముల యందు స్త్రీ పురుష సంయోగం వలన కన్యక జనియించును

 * ఆయాసం , బడలిక, దప్పి , తొడల యందు బలం లేకుండా ఉండటం , యోని యందు వణుకు అను లక్షణాలు స్త్రీ యందు కనిపించినచో ఆ స్త్రీ గర్బం ధరించినది అని తెలుసుకొనవలెను . ఇవి ప్రాధమిక లక్షణాలు .

 * చనుమొనలు నలుపురంగుకు మారు ట , కనురెప్పలు ఒకదానికొకటి కలియిచుండుట , కారణం లేకుండానే వాంతి అగుట. మంచి సువాసన గిట్టకుండా ఉండటం. నోటి యందు నీరు ఎక్కువ వూరుట , శరీరం సడులు ట ఇట్టి లక్షణములు గల స్త్రీ గర్భిణి అని తెలియవలెను . 

 * గర్భిణి అని తెలుసుకున్న మొదలు శ్రమకరమైన పనులు , మైథునం , పూర్తిగా కడుపు నిండగా భుజించరాదు , రాత్రి యందు ఎక్కువుగా మేలుకొని ఉండరాదు. ఎక్కువ లంఖణం అనగా ఉపవాసం చేయరాదు , దుఃఖం చెందరాదు, బండి , గుఱ్ఱము మొదలుగు వాహనములు ఎక్కరాదు , భయంకరమైన పనులు చూడరాదు, కాళ్లు , చేతులు ముడుచుకుని కూర్చోరాదు , ఎత్తుపల్లాలు గల ప్రదేశంలో కూర్చోరాదు , మలమూత్ర వేగములను నిరోధించరాదు . 

 * వాతాదిదోషములు వలన గాని , కర్రదెబ్బల వలన గాని గర్భిణి ఏయే అవయముల యందు వేదన పొందునో గర్భము నందు శిశువు కూడా ఆయా అవయముల యందు వేదన పొందును.

 * గర్బము ను ధరించిన ప్రథమ మాసం నందు జిగట వలే ఉండును. ద్వితీయ మాసం నందు కఫవాతపిత్తం వలన పరిపాకమును చెంది పంచభూతాత్మము అయ్యి స్వల్పంగా ఘనీభవం చెందును . అట్టి గర్భం స్పర్శం వలన పిండాకారంగా ఉండిన పురుష గర్బం , పొడుగుగా ఉండిన స్త్రీ గర్బం అనియు , ఒక ముద్దవలే ఉండిన నపుంసక గర్బం అవును. స్త్రీ గర్భం ఇటుక రాయి ఆకారం వలే ఉండును అనియు , పురుష గర్బం అనునది గుండ్రముగా కఠినముగా ఉండునని , నపుంసక గర్భం అనునది గుండ్రని ఫలం యొక్క అర్ధభాగం వలే ఉండును . భోజుడు తన వైద్య గ్రంథం నందు వివరించాడు.

                  తృతీయ మాసం నందు గర్భమునకు పాదములు , హస్తములు, శిరస్సు అనునవి పుట్టును. మరియు ఆ మాసం నందే చెంపలు , ముక్కు, పెదవులు, నేత్రములు , చెవులు , వ్రేళ్లు మొదలగు ప్రత్యంగములు సూక్ష్మ రూపంలో జనించును.నాలుగోవ మాసం నందు అన్ని అంగములు సూక్ష్మరూపంగా జనించును. ఆ మాసం నందే గర్బం నందు హృదయం ఆత్మకు స్థానం అగుట వలన దానికి ఆత్మకు సంభందం ఏర్పడును . 

                 అయిదోవ మాసం నందు మనస్సు , ఆరోవమాసం నందు బుద్ది, ఎడొవ మాసం నందు హస్తములు , పాదములు , నాసిక , వ్రేళ్లు , కేశములు పూర్తిగా ఏర్పడును . ఎనిమిదో మాసం నందు హృదయం నందు ఓజస్సు సర్వ ధాతువులు ఓజస్సు రూపం నొంది అస్థిరంగా ఉండును. ఎనిమిదో మాసం నందు గర్భిణి ప్రసవించినచో దోషం కలిగి ఉండును. కావున కుమార తంత్రం నందు చెప్పబడిన బలి విధానం ఆచరించవలెను . తొమ్మిదో మాసం నందు సర్వ అంగములు పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గర్భిణి పరిపూర్ణ శిశువుని ప్రసవించును.

                గర్బముకు మాంసం , రక్తం , మేథస్సు , మజ్జ లేదా మూలుగ , హృదయం , నాభి , లివరు , ప్లీహం , ఆంత్రములు , గుదము మొదలగు మృదు అంగములు తల్లి నుంచి ఏర్పడును . 

        మొదట దక్షిణ స్థనం నందు పాల ఉత్పత్తి అగును. కుడికన్ను పెద్దదిగా కనపడును. తొలుత కుడితోడ గర్భభారము చేత ఉబ్బి ఉండునట్లు అగుపడును. స్వప్నం నందు కమలములు కనపడుట, మరియు నల్ల కలువలు కనపడును , తెల్ల కలువలు , మామిడిపండ్లు మొదలగునవి కనపడును. మొఖం ఎప్పుడూ ప్రశాంతంగా కనపడును ఇటువంటి లక్షణములు కల గర్భిణి స్త్రీ పుతృనిని కనును. దీనికి వ్యతిరేక లక్షణాలు కలిగిన గర్బిణి పుత్రికను కనును. రెండు తొడలు పెద్దగా కనిపిస్తూ కడుపు ముందుకు వచ్చి పైన చెప్పిన రెండు రకాల లక్షణాలు కలిగిన స్త్రీ నపుంసకుడుకి జన్మనిచ్చును. 

           ఏ గర్భిణి స్త్రీ కడుపు మధ్య భాగం పల్లంగా కనిపించుచుండునో అట్టి స్త్రీ కవలపిల్లలను జన్మనిచ్చును.


    

Thursday, August 10, 2023

గురువు లలో rakalu

*ఎంతమంది - గురువులు...???*
🌻🌻🌻🌻🌻🌻🌻❤️

*1. సూచక గురువు :*

బాల్యం నుండి నీకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు నీకు బ్రతుకు తెరువు కోసం భోదన చేసే గురువులు ఎందరో. 
నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు. 
వీరిని సూచక గురువు అంటారు, వీరి ద్వారా భుక్తి మార్గం తెలుసుకుంటావు.

*2. వాచక గురువు :* 

ధర్మా ధర్మ విచక్షణ, మంచి చెడు విశ్లేషణ, చతురాశ్రామాలు వాటి ధర్మాలు గురించి చెపుతారు.
(భ్రహ్మచర్యము, గృహస్త్దము, వానప్రస్దానం, సన్యాసం). 
వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహనతో వసిస్తావు.

*3. భోధక గురువు :* 

మహా మంత్రాలను ఉపదేశిస్తారు. 
లౌకికంగా కోర్కెలు తీర్చే వాటిని, అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని. 
వీరిని భోధక గురువు అంటారు, లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేస్తావు...

*4. నిషిద్ద గురువులు :* 
మారణ ప్రయోగాలు, వశికరణాలు, వినాశనాలు ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువు అంటారు.
ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళక పోవడం చాలా మంచిది.
చిత్తాన్ని శుద్ధి చేయరు, విత్తాన్ని హరిస్తారు. 
పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి.

*5. విహిత గురువు :*

మన హితము కోరి సూచనలు సలహాలు ఇస్తారు, నశించి పోయే విషయ భోగాలు
పై ఆశక్తి తగ్గించి, సత్యమైన శాస్వితమైన విషయాల పై అంతర్ముఖం చేస్తాడు. 
ఏది సత్యం ఏది అసత్యం అని విచక్షణ తో జివింపచేస్తారు.

*6. కారణ గురువు :*

ఇతను మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు. 
ఎన్ని సుఖాలు అనుభవించినా అంతిమ లక్ష్యం ముక్తి ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు.
నిత్యం ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోతూ ఉంటారు.

*7. పరమ గురువు :* 

ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు, శిష్యునికి సన్మార్గం భోధించి ‘’ఈ చరా చర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెంద గలిగే స్దితికి తీసుకు వెళ్ళే వారు ఈ పరమ గురువులు. 
వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. 
నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారస పడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. 
నువ్వు వచ్చిన పని నీకు తెలియచేసి నీ విడుదల కు మార్గం చూపేవారు పరమ గురువు...

                *_🪻శుభమస్తు🪻_*
   🙏

*సర్వేజనా సుఖినోభవంతు*🙏

పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు -

పాలుతో ఔషదాలు తీసుకొనడం వలన ఉపయోగాలు - 

 * లంఘనం ( ఉపవాసం ) చేత బలహీనుడు అయినవాడు క్షీరం పానం చేయడం వలన బలవంతుడు అగును. అట్టివానికి జ్వరం నశించును. 

 * కాగి చల్లారిన పాలు , కొంచం ఉష్ణంగా ఉన్న పాలు కాలమునెఱిగి జ్వరపీడితుడు సేవించవలెను 
కాచబడినదియు , గోరువెచ్చగా ఉండని పాలను జ్వరపీడితుడు సేవించిన మృత్యుడు అగును.

 * పాలయందు శొంటి , ఖర్జురపు కాయ , ద్రాక్ష వీటిలో ఏదైనను కాచి అందు చెక్కర కాని , నెయ్యి గాని , తెనే కాని వేసి చల్లార్చి అనుపానంగా సేవించిన యెడల దప్పిక , తాపము వీటిని నివర్తింప చేయును . 

 * పాల యందు ద్రాక్ష , చిట్టాముదపు వేరు , యష్టిమధూకం , సుఘంద పాల వేరు , పిప్పిలి , చందనం వీటిచే కాచబడిన పాలు సేవించిన లేక పాలకు నాలుగింతలు నీరు పోసి పిప్పిలి వేసి నీరంతా ఇగురునటుల కాచి తగినంత వేడిగా ఉన్నప్పుడు లొపలికి తీసుకున్న జ్వరం నశించును. 

 * జ్వరం గలవాడు పంచమూలములు పాలల్లో వేసి కాచి అనుపానంగా సేవించిన యొడల చిరకాల జ్వరం నశించుటయే కాక కాసాశ్వాస , తలనొప్పి , పార్శ్వపునొప్పి కూడా నశించును.

 * పాలయందు ఆముదపు వేరు గాని లేక బిల్వపత్రములు గాని వేచి కాచి అనుపానంగా సేవించిన జ్వరం , మలబద్దకం నశించును. 

 * పాల యందు శొంటి , చిట్టాముదపు వేరు , వాకుడు , పల్లేరు , బెల్లము వీటిని వేసి కాచి అనుపానంగా సేవించిన రక్తపిత్తము , అతిసారం , దప్పికతో కూడిన నొప్పులు అన్ని నివర్తించును.

  
    

Wednesday, August 9, 2023

తిప్పసత్తు తయారీ విధానము -

తిప్పసత్తు తయారీ విధానము - 

   ముదిరిన తిప్పతీగ వ్రేళ్ళను తెచ్చి కత్తితో పైన పొట్టు తీసి సన్నని ముక్కలుగా కొట్టి దంచి నీటిలో కడగవలెను . జిగురు వచ్చు వరకు దంచి కడగవలెను. కడిగిన నీళ్లు ప్రత్యేకముగా ఉంచవలెను. జిగురు రాకపోయినా దంచి కడుగుటను మాని మొదట కడిగిన నీళ్లను వెడల్పాటి పళ్ళెములో పోయవలెను. సత్తు అంతా తెల్లగా అడుగున పేరి నీరు పైకి తేలును. ఆ నీటిని వంచివేయవలెను . ఈ విధముగా రెండోసారి , మూడోసారి తిప్పతీగని కడిగిన నీటిని పళ్ళెము లొ పొసి ఉంచవలెను. ఇందులొ తయారు అగు సత్తు మొదటి దాని అంత తెల్లగా ఉండదు. పైకి తేలిన నీటిని ఎప్పటికప్పుడు వంచివేయచుండవలెను . ఇటుల చేరిన సత్తుని బాగుగా ఎండు వరకు ఉంచిన అవి ముక్కలు అగును. ఇది రెండు రొజులలొ తయారు అగును . 

                 రాత్రుల యందు పాత్ర ను మూతతో కప్పి ఉంచవలెను. మూలికను దంచునప్పుడు రోలుకు కాని , రోకలికి కాని సున్నము తగలరాదు. సున్నము తగిలినచో సత్తు విరిగిపోవును. పళ్లెము కి కూడా సున్నము తగలనివ్వరాదు. 

             ఈ సత్తుని ప్రత్యేకంగా వాడుట యే కాక ఇతర ఔషదాలతో కూడా కలిపి ఇవ్వవచ్చు.

 దీని ఉపయోగాలు - 

 * దీనిని తేనెతో తీసుకుంటే కఫం పోవును .

 * బెల్లముతో తీసుకున్నచో మలబద్దకం పోవును . 

 * పంచదారతో ఇచ్చిన పైత్యమును , నేతితో ఇచ్చిన వాతమును హరించును. 

  * దీనిని అనుపానములతో ఇచ్చిన సర్వరోగములు పోగొట్టును . 

 * షుగర్ వ్యాధిగ్రస్తులు విడవకుండా వాడితే షుగర్ 
అదుపులో ఉండటానికి తోడ్పడుతుంది. 

 * ఎప్పుడు నోరు పూస్తుంది అనేవారు తిప్పసత్తుని కర్పూర శిలజిత్ ని పంచదారతో గాని నేతితో గాని కలిపి తీసుకుంటే శరీరంలో అతివేడి తగ్గును . 

 * పొడిదగ్గు కి కూడా ఇదే మిశ్రమాన్ని వాడవలెను.

 * వేడి శరీరం ఉన్నవారు ప్రతిరోజు తిప్పసత్తు వాడితే ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి.

 గమనిక - ఆయుర్వేద పచారి షాపుల్లో మీకు తిప్పసత్తు దొరకును. మీకు వీలుంటే సొంతంగా చేసుకోవచ్చు .

    

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు

మనుష్యుల రోగాలకు కారణం అయ్యే విరుద్ద ఆహారపదార్థాలు - 

 
     ఈ సకలసృష్టిలో ప్రతిప్రాణి జీవించుటకు ముఖ్యమయినది ఆహారం. ఒక్కొ ప్రాణి తన దేహాన్ని మరియు స్థితిని బట్టి ఆహారం తీసుకుంటుంది. ఈ సకల ప్రాణుల్లో మనుష్యజాతి ప్రధానం అయినది. మనిషికి రోగాలు ఎక్కడినుంచో ప్రత్యేకంగా రావు . సరైన అవగాహన లేకుండా మనం తీసుకునే విరుద్ద ఆహారపదార్థాలు మనకి రోగాన్ని కలుగచేస్తాయి. అటువంటి విరుద్ద ఆహారపదార్థాలను కొన్నింటిని మీకు తెలియచేస్తాను.

  విరుద్ద ఆహారపదార్థాలు - 

 * నీరు ఎక్కువుగా ఉండు పల్లపు ప్రాంతాలలో ఉండు జంతువుల లేక పక్షి మాంసాలు తినరాదు.

 * తేనె , బెల్లం, పాలు , నువ్వులు , ముల్లంగి, తామర గడ్డలు, మొలకెత్తిన ధాన్యము వీటిలో ఏ ఒక్కదాన్ని మరొకదానితో కలిపి భుజించరాదు . 

 * ఆవనూనెతో పావురం మాంసం వేయించుకొని తినరాదు. 

 * కోడి మాంసంతో పెరుగు కలిపి తినరాదు.

 * చేపలు వేయించగా మిగిలిన నూనెతో పిప్పిళ్లు వేయించరాదు.

 * చేపలు తిని పాలు , పాలపదార్థాలు ఏవి కూడా తీసుకోరాదు . 

 * పుల్లగా ఉండు పదార్థాలతో పాలు చేరిన విషమగును. కావున పులుపుతో చేసిన పదార్థాలు తినిన తరువాత పాల సంబంధమైన ఉత్పత్తులు అసలు సేవించరాదు . ముఖ్యంగా పుల్లని రుచి కలిగిన మామిడి, రేగు , నేరేడు , వెలగ , చింత, దానిమ్మ, కొబ్బరి వంటి వస్తువుల తీసుకున్నపుడు పాలు వాడరాదు. 

 * ఉలవలు, అరిగెలు , కొర్రలు, మినుములు , పెసలు పాలతో తీసుకోరాదు 

 * ముల్లంగి భుజించునప్పుడు పాలు వాడరాదు.

 * మినపప్పు, బెల్లం, పాలు , పెరుగు , నెయ్యి, ఏ ఒక్కదానితోను నిమ్మపండు భుజించరాదు .

 * మద్యం, తేనె , పెరుగు ఈ మూడింటిని వేడిగా ఉండు వస్తువులచే తినరాదు.

 * ఉప్పు కలిపిన పాలు కాని , అన్నం కాని భుజించరాదు .

 * ఆకుకూరలు తిను సమయంలో వెన్న తినరాదు.

 * పాత బియ్యం , కొత్తబియ్యం కలిపి ఒకేసారి వండి తినరాదు.

 * పక్వముకాని వస్తువుని , పక్వము అయిన వస్తువుని కలిపి భుజించరాదు .

 * తేనె , నెయ్యి , జంతువుల కొవ్వు , నువ్వులనూనె , ఆవనూనె, ఆముదం వీటిలో ఏ రెండింటిని కాని , ఏ మూడింటిని కాని సమానంగా కలిపి వాడినచో విషమగును 

 * ప్రస్తుతం డాల్డాను నెయ్యితో కలిపి అమ్ముతున్నారు . దీనిని వాడినచో ఆరోగ్యపరంగా చాలా సమస్యలు వచ్చును.

 * నువ్వుపిండి , బచ్చలికూర కలిపి భుజించినచో అతిసారవ్యాధి కలుగును.

 * ముల్లంగి ఆకు, ఉల్లిగడ్డలు , మునగాకు , తెల్ల తులసి, అడవి తులసి , నల్ల తులసి మున్నగు ఆకు కూరలు తినిన వెంటనే పాలు తాగిన కుష్టువ్యాది కలుగును.

 * తుప్పు పట్టిన గంటె లు , పాత్రల యందు వొండిన భోజనం మరియు విషలక్షణాలు కలిగిన వంటచెరుకు చేత వండబడిన ఆహార పదార్థాలు ఆరోగ్యాన్ని నాశనం చేయును 

 * రాగిపాత్రలో చేపల కూర వండి తినిన మరణం తప్పదు.

 * బియ్యం వండినప్పుడు పూర్తిగా ఉడకకుండా , అధికంగా చిట్లినట్లు ఉండటం మరియు మాడిపోయిన అన్నం వీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు . 

 * అరటిపండు మరియు మజ్జిగ కలిపి తీసుకోరాదు . 

     పైన చెప్పిన విధంగా విరుద్ద ఆహార పదార్థాలను భుజించినచో శరీరం దారుణమగు రోగాలపాలు అగును.విస్పోటకం అనగా శరీరంపై పొక్కులు లేచే రోగం , గుల్మం, కడుపులో పుండు , క్షయ , రక్తపిత్తం, వాతరోగం, మూత్రాశయంలో రాయి, కుష్టు , భగంధరం ,గ్రహణి వంటి రోగాలు కలుగును.

 
    

Saturday, August 5, 2023

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .

     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 

           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.

 * "A" విటమిన్ -

       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .

              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.

 * "B" విటమిన్ -

         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.

           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.

 * "C" విటమిన్ -

          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.

 * "D" విటమిన్ - 

         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.

              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .

 * "E " విటమిన్ -

          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.

              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.

          

Friday, August 4, 2023

నిమ్మకాయతో చికిత్స

నిమ్మకాయతో చికిత్స - 

  అజీర్ణం ( Dyspepsia ) - 

   గుండెల్లో మంటకు , పులిత్రేపులకు నిమ్మపండు మంచి మందు. కొద్దినీటిలో ఒక చెక్క నిమ్మరసం కలిపి దానిని ఒక మోతాదుగా పుచ్చుకొనవలెను.దీనివలన జీర్ణాశయం గోడలు శుభ్రం అగును. ఉపవాసం ఉన్నప్పుడు కాని , జీర్ణకోశం ఖాళీగా ఉన్నప్పుడు కాని నిమ్మరసం సేవించవలెను. 

  మలాశయం బాధ ( Bowel Trouble ) - 

    నిమ్మరసం అతిసారం , అతివిరేచనమును కట్టును. నిమ్మపండు నిజరసమును గాని కొంచం నీటితో కాని ఆసన మార్గము ( Enema ) ద్వారా పంపించిన కలరా , ఆమపాతం ( Macocolitis ) , ఆంత్రభ్రంశము ( prolapse of the bowels ) మొదలుగా గల కఠినమగు పేగు బాధలు నివారణ అగును. ఇంతే కాకుండా ఆమపాతంతో కూడిన శీతబేది ( Dysentry with slonghing of the mucous membrens ) అనగా జిగట విరేచనాలు తీవ్రమయిన ఈ జబ్బుతో రోగికి 12 ఔన్సుల మోతాదు ఇవ్వవలెను.

 స్థూలకాయం ( Obesity ) - 

    నిమ్మనీరు కాని , ఉడికించిన నిమ్మ పండ్లు కాని అతి స్థూలకాయమునకు మంచి మందు. మూడు నాలుగు గ్లాసుల తీపి కలపని నిమ్మనీరు కాని దానికి సరిపోవు పూర్తి పండ్ల పదార్ధం కాని దినదినము పుచ్చుకొనవలెను . దీనితో పాటు మితముగా భుజించుటయు , మధ్యాహ్నం రెండు గంటల తరువాత భోజనం చేయకుండా ఉండుట అభ్యాసం చేయవలెను . మధ్యాహ్నం 2 గంటల తరువాత తినిన ఆహారం అతిగా కొవ్వును పెంచును. అదే విధముగా శరీరం నందు నీరు , అంతర్మలములు ( Waste Poisons ) కూడా పెంచును. వీటన్నిటిని నిమ్మరసం తొలిగించును.

 ముఖ సౌందర్యం ( cosmetic ) - 

   సామాన్యంగా ముఖము పైన దీనిని వాడినప్పటి కంటే లొపలికి తీసుకున్నప్పుడు అద్భుతంగా పనిచేయును. నిమ్మకాయ చెక్కని తలపైన రుద్దిన చుండ్రు ( Dandruff ) పోవును . మొటిమలు ( acne spots ) , శరీర నిగారింపు ( oily skin ) కలవారు నిమ్మరసం వాడుట చాలా మంచిది. ముఖం పైన , చేతుల పైన మచ్చలు , వాపు , గజ్జి వంటివాటిని నిమ్మరసం పోగోట్టును . 

  చలి జ్వరం - ( Maleria ) 

     నిమ్మరసం పాలు కలపని కాఫీ లో ఇచ్చిన సమర్ధవంతంగా పనిచేయను. కాలిక వ్యాధులు ( Chronic Disorders ) అన్నింటిలో పండు పదార్థం వాడినంతను అద్భుతంగా పనిచేయను.నిమ్మ తొక్కలో క్రిమిసంహారకం అగు నూనె , నిమ్మ కాయ దూది యందు స్వాభావిక జీర్ణం అగు సారములు ఎన్నొ కలవు. చాలాకాలం నుంచి చలి జ్వరమునకు , రొంపలకు ముందుగా వాడుచున్న సింకోనా క్వయినా తయారగు చెట్టు బెరడును ఉండు గుణములు అన్నియు దీనియందు కలవు. 

   అపస్మారం వల్ల కలిగిన గుండెదడ కి 15 గ్రాములు నిమ్మరసం ఇచ్చిన నిమ్మళించును.

 రక్తస్రావం - 

    శ్వాసకోశములు ( Lungs ) , అన్నకోశం , ప్రేగులు మూత్రపిండములు మొదలగు వాటినుండి లోపల భాగాలలో రక్తస్రావం అవుతున్నప్పుడు నిమ్మరసం ఇవ్వవలెను. ఉప్పు కలిపి రోజుకి ఒక నిమ్మకాయ తినుచున్నచో ప్లీహవృద్ధి అనగా Enlargement of Spleen కడుపులో బల్ల పెరుగుట హరించును. 

    నిమ్మతైలము ని మర్దన కొరకు వాడవచ్చు. 

  దంతశుద్ధి - 

     దంతములు బలహీనంగా గాని , రంగుమారి కాని ఉన్నచో వాటిబాగుకై పేస్ట్ వాడరాదు. అవి హానిచేయును. అటువంటి సమయాలలో నిమ్మపండ్ల రసంలో తడిపిన కట్టెబొగ్గు లేదా నీళ్లతో పలుచన చేసిన నిమ్మపండ్ల రసం. కాని ఇది వాడిన తరువాత నీటితో నోరు బాగా పుక్కిలించవలెను. చిగుళ్ల వాపుకు , నోటి పూతకు నిమ్మకాయ రసమును నీటిని సమాన భాగాలుగా తీసుకుని పుక్కిటబట్టుట మంచిది.

          

Wednesday, August 2, 2023

కండ్ల కలక నివారణ మార్గాలు -

కండ్ల కలక నివారణ మార్గాలు - 

 * 30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 

 * పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 

 * పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 

 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 

 * కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 

    పైన చెప్పిన ఔషధ యోగాలలో మీకు సులభముగా ఉన్నది పాటించి సమస్య నుంచి బయటపడగలరు .