ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు .
శిరావేధ పద్ధతిని "రక్తమోక్షణం " అని కూడా అంటారు.ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను.
మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. "ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం " శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను .
మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు .మర్మలు మరియు మర్మస్థానములు అనగా శరీరము నందు వాయుప్రసరణ జరుగు నాడీ జంక్షనులు .ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను.
శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను .
ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గునో మీకు వివరిస్తాను .
* పాదదాహము , పాద హర్షము ( గుర్రం మూతి ) , చిప్పము , విసర్పి , వాతరక్తం ( గౌట్ ) , వాత కంటము , విచర్చికా , పాదదారి మొదలగు వ్యాధుల యందు హస్తపాదముల మధ్య ఉండు క్షిప్రమర్మములకు పైభాగమున రెండు అంగుళములలో విహ్రీ ముఖము ( సన్నటి పరికరం ) తో శిరకు రంధ్రం చేసి దుష్టరక్తమును తీయవలెను .
* క్రోష్టుక శీర్షము , ఖంజము , పంగు వంటి వాతవ్యాధులకు చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయవలెను .
* గృదసీవాతం ( సయాటికా ) నందు మోకాలు సంధికి నాలుగు అంగుళముల కింద గాని , పైన గాని శిరకు రంధ్రం చేయవలెను .
* గళ గండ రోగము నందు తొడ మొదట ఆశ్రయించి ఉండు శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండు గళగండ రోగము నివృత్తి అగును.
* ప్లీహ ( spleen ) రోగము నందు ఎడమచేయి మోచేతి సంధి యందు ఉండు శిరను గాని లేక చేతి యొక్క చిటికెనవ్రేలుకు , ఉంగరం వ్రేలుకు మధ్య యందు ఉండు శిరను వేధించవలెను .
* కాలేయరోగము నందు ప్లీహమునకు చెప్పినట్టు కుడివైపున చేయవలెను . శ్వాసకాసలకు కూడ కుడి పార్శ్వముల యందు ఉండు శిరలను వేధించవలెను .
* పరివర్తిక , ఉపదంశ , శుక్రదోషముల యందు , శుక్రవ్యాధుల యందు శిశ్నము మధ్యయందలి శిరను వేధించవలెను .
* అసాధ్యములగు అంతర్విద్రదుల యందు , పార్శ్వశూల ( ఒకవైపు తలనొప్పి ) కక్షా స్థనభాగముల మధ్యవుండు శిరను వేధించవలెను .
* అసాధ్యమగు తృతీయక జ్వరం నందు ముడ్దిపూసకు మధ్య వెన్నెముక క్రింద ఉన్న శిరను వేధించవలెను .
* అసాధ్యమగు చాతుర్ధికా జ్వరం నందు భుజశిరస్సులకు క్రిందగా రెండు పార్శ్వముల యందు ఉండు సిరలలో ఎదైనా ఒకదానిని వేధించవలెను .
ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతిరోగానికి ఏయే భాగములో శిరావేధ చేయవచ్చో అత్యంత ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో వివరణాత్మకంగా ఉన్నది . నేను అటువంటి గ్రంథాలను నా పరిశోధన నిమిత్తం అధ్యయనం చేయుచుండగా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోగలిగాను . ఆ విజ్ఞానాన్ని మీకు అందించాలన్న సదుద్దేశముతో మీకు సంపూర్ణ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేను రాసిన రెండు గ్రంథాలలో మరింత విపులంగా సమాచారాన్ని ఇచ్చాను.
మరొక విలువైన సమచారాన్ని మీకు త్వరలో అందిస్తాను.
సమాప్తం
No comments:
Post a Comment