Monday, July 8, 2024

జగన్నాథస్వామీ! నయనపథగామీ భవతు మే

జగన్నాథస్వామీ! నయనపథగామీ భవతు మే 

ఈ క్షేత్రం మహోదధి అనే సముద్ర తీరంలో 5 క్రోసుల విస్తీర్ణం గల క్షేత్రం. ఈ దేవాలయాన్ని తొలిసారిగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించగా బ్రహ్మదేవుడు నారదాది మహర్షులతో వేంచేసి భరద్వాజుని ఆధ్వర్యవంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు.

సప్తమోక్ష పురాలలో ఒకటిగా, 'చార్ధాం' గా పిలువబడే నాలుగు మహాక్షేత్రాలలో ప్రధానమైనదిగా కీర్తింపబడుతున్నది 'పురుషోత్తమ క్షేత్రం' (పూరి). దీని గురించి ఋగ్వేద, అథర్వణ వేదాలు మొదలుకొని స్కంద, బ్రహ్మ, పద్మ పురాణాలలోనూ, వామదేవ సంహిత, కపిల సంహితలలోనూ చాలా వివరంగా ఉంది.

ఈ క్షేత్రం మహోదధి అనే సముద్ర తీరంలో 5 క్రోసుల విస్తీర్ణం గల క్షేత్రం. ఈ దేవాలయాన్ని తొలిసారిగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించగా బ్రహ్మదేవుడు నారదాది మహర్షులతో వేంచేసి భరద్వాజుని ఆధ్వర్యవంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. వారి సూచనలు అనుసరించే రథాలు కూడా ప్రథమంగా తయారు చేయబడ్డాయి. 

ఈ దేవాలయానికి ముందు అరుణస్తంభం దర్శనం ఇస్తుంది. ప్రధాన ఆలయంలో 'రత్నవేది' అని పిలబడే పెద్ద వేదికపై ప్రధానంగా ఉండే దేవతా విగ్రహాలు.... 

1) జగన్నాథుడు, 
2) బలభద్రుడు, 
3) సుభద్రాదేవి, 
4) సుదర్శనుడు అనే దారు బ్రహ్మమూర్తులు, 

ఇవి కాక (a) మాధవుడు, (b) శ్రీదేవి, (c) భూదేవి విగ్రహాలు అష్టధాతు మూర్తులుగా కొలువై ఉంటారు.

జగన్నాథ, బలభద్ర, సుదర్శన విగ్రహాలు సుమారుగా 6 అడుగుల ఎత్తులో ఉంటాయి. సుభద్రాదేవి విగ్రహం 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇవి వేప చెట్టు దారువుతో తయారైనవి. 

బృహత్ సంహిత, విష్ణు సంహితల ప్రకారం చూస్తే వేప దారువులతో చేసిన విష్ణువును పూజిస్తే ఆయువు, శ్రీ (సంపద), బలము, విజయము కలుగుతాయి. జగన్నాథ బలభద్రుల చేతులు సమాంతరంగా ఉండి నమ్మిన భక్తులకు ఆలింగన భాగ్యాన్ని కలిగించడానికి సిద్ధంగా ఉంటాయి ఇది అత్యంత భక్త వాత్సల్యానికి పరాకాష్ఠ. చక్రాల వంటి కళ్ళతో కంటికి రెప్పలు కూడా (లేకుండా) వేయకుండా కనిపెట్టుకుని ఉంటాడు.
నీలచక్రము: 

ప్రధాన దేవాలయంలో స్తంభాకారంగా ఉన్న సుదర్శనుడు 214 అడుగుల ఎత్తుగల ప్రధాన దేవాలయ శిఖరముపై అష్టధాతు నిర్మిత చక్రముగా "నీలచక్రము" అనే పేరుతో కొలువై ఉంటాడు.

ఇది 2200 కిలోల బరువుతో సుమారు 12 అడుగుల పొడవు కలిగి 36 అడుగుల వ్యాసంతో ఉంటుంది. ప్రతి ఏకాదశినాడు గోపురంపై ఈ నీలచక్రం వద్ద దీపాన్ని వెలిగిస్తారు. ఆ చక్రముపై విశాలమైన ధ్వజము ఉంటుంది. ఆ ధ్వజము గాలికి వ్వతిరేక దిశలో కదలడం ఇక్కడి మరో ఆశ్చర్యకరమైన విషయం. ప్రతిరోజూ నూతన ధ్వజాన్ని కడతారు. ప్రధాన ధ్వజమే కాక భక్తులు ధ్వజము మొక్కుబడిగా కొని కట్టించడం ఉంది. ఆ ధ్వజములు ఒక అడుగు నుండి 25 అడుగుల వరకు వారి వారి శక్తిమేరకు సమర్పించుకుంటారు. ఈ ధ్వజములు కాషాయము లేదా పసుపు రంగులలో ఉండి అర్థచంద్ర, సూర్యబింబములు కలిగి ఉంటాయి.

తీర్థములు: 

సర్వ తీర్థ, నదీమయమైన మహోదధి పేరుతో ఉన్న సముద్రమే కాక, స్మరించినంత మాత్రానే పవిత్రులను చేసే తీర్థరాజాలు - 

(1) ఇంద్రద్యుమ్న తీర్ధము 
(2) శ్వేతగంగా తీర్థము, 
(3) రోహిణీ కుండము, మరియు 
(4) మార్కండేయ తీర్ధములు నెలకొని ఉన్నాయి.

ప్రణవములోని అకార, ఉకార, మకారాలే ఈ త్రిమూర్తులు కాగా తురీయమైన బిందురూపమే సుదర్శనుడు 

" జకారస్తు జగన్నాథః బలభద్రో గ కారకః! 
న కారో సుభద్ర రూపాచ త కారోపి సుదర్శనః!!" 

ఒకే జగన్నాథ పరబ్రహ్మం నాలుగుగా మారి ఈ రూపాలను దాల్చింది. ఈ త్రిమూర్తుల శిరసు పైభాగాలు త్రిభుజాకారంలో ఉండడం ఒకానొక యంత్ర విశేషం.

పూజా విధానం: 

ఇక్కడ పూజావిధానం వైదిక, తాంత్రిక, వైష్ణవ పద్ధతులలో జరుగుతుంది. 

బలభద్రుడు - తారా యంత్రముపై, 
సుభద్రాదేవి - భువనేశ్వరీ యంత్రముపైన, 
జగన్నాథుడు - కాళీ యంత్రముపైన 

విరాజిల్లుతుంటారని ప్రసిద్ధి. 

ప్రతిరోజూ వీటికి మూల మంత్ర, దేవతాన్యాస, పీఠవ్యాస, మంత్రన్యాస, మూర్తి పంజర న్యాసములు మొదలైనవి చేస్తారు. 

జగన్నాధునికి - గోపాలార్చన పూజా పద్ధతి, 
బలభద్రునికి - వాసుదేవ పూజా పద్ధతి, 
సుభద్రాదేవికి - భువనేశ్వరీ పూజా వద్ధతులతో పూజలు జరుగుతాయి. 
సుదర్శనునకు - సుదర్శన, నారసింహ మంత్రాదులతో పూజలు చేస్తారు.

రథయాత్ర:

 ప్రతి ఏడాది వైశాఖ శుక్ల తృతీయ (అక్షయ తృతీయ) వాడు విధి విధానంగా హోమాదులు చేసి మూడు రథాలు తయారు చేయడం ప్రారంభిస్తారు. ఆపాధ శుక్ల విదియనాడు ప్రపంచ ప్రసిద్ధమైన శ్రీ పూరీజగన్నాథ రథయాత్ర' ఆరంభం అవుతుంది. 'రత్నవేది' పై ఉన్న మూలవిరాట్టులే భక్తులకోసం రథాలపైకి వేంచేసి ప్రధాన ఆలయం నుండి గుండిచా మందిరం వరకు ఊరేగుతారు. 

రథాలలో మూర్తులు చేరాక గజపతి రాజు వచ్చి బంగారు పిడిగల చీపురుతో రథాలను తుడవడం ఆనవాయితీ. 

పూరీలో గల గోవర్ధనపీఠ శంకరాచార్యుల వారు ప్రథమంగా వేంచేసి రథస్థులైన మూర్తులను కొలుచుకున్న తరువాత భక్తుల సంకీర్తనలు, శంఖధ్వనులు, మేళతాళాలతో అంగరంగ వైభోగంగా రథయాత్ర ప్రారంభం అవుతుంది. గుండిచా మందిరంలో తొమ్మిది రోజులు దశావతారాలతో భక్తులకు దర్శనం లభిస్తుంది.
రథాలయందు పార్శ్వ దేవతలు, శిఖర దేవతలు ఇలా ఎన్నో శక్తులు నెలకొని ఉంటాయి. వాటి వివరాలు తెలుసుకుంటే దివ్యశక్తుల అనుగ్రహం లభిస్తుంది. 

1) జగన్నాథ రథం విశేషాలు 

పేరు: నందిఘోష, 
పొడవు: 45'6", 
చక్రాలు: 16, 
రథముపైన పసుపు, ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంగా అమరుస్తారు. 

దానిపైనున్న ధ్వజముపై హనుమంతుడు, చంద్రుడు, శంఖము ఉంటాయి. 

శంఖ, వలాహక, శ్వేత, హరిదశ్వ అనబడే నాలుగు తెల్లగుర్రాలు అమర్చబడతాయి. 

రథపాలకుడు: గరుత్మంతుడు. 
సారథి: దారుకుడు. 

రథాన్ని లాగే త్రాడు యందు శంఖచూడుడు అనే దివ్య సర్పశక్తిని ఆవహింపచేస్తారు. 

రథము చుట్టూ తొమ్మిది మంది పార్శ్వదేవతలు దారు (కుర్ర) మూర్తులుగా దర్శనమిస్తారు. వారి పేర్లు: 

1) వరాహ, 
2) గోవర్ధన, 
3) కృష్ణ, 
4) నరసింహ, 
5) రామ, 
6) నారాయణ, 
7) త్రివిక్రమ, 
8) హనుమాన్ మరియు 
9)రుద్రుడు.
2) బలభద్రుని రథం విశేషాలు: 

పేరు - తాళధ్వజ, 
పొడవు - 45'. 
చక్రాలు - 14, 

రథము పైన ఆకుపచ్చ, ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంగా అమరుస్తారు. 

తాటిచెట్టు గుర్తుగా గల ధ్వజము పేరు "ఉన్మణి". 

తీవ్ర, ఘోర, దీర్ఘశ్రమ, స్వరార్ణవ అనబడే నాలుగు నల్ల గుర్రాలు అమర్చబడి ఉంటాయి.

రథ పాలకుడు - వసుదేవుడు. 
సారథి - మాతలి 

రథాన్నిలాగే త్రాడు యందు వాసుకి అనే దివ్య సర్పశక్తిని ఆవహింపజేస్తారు. 

రథము చుట్టూ తొమ్మిది మంది పార్శ్వదేవతలు దారు (కర్ర) మూర్తులుగా దర్శనమిస్తారు. వారి పేర్లు: 

1) గణేశ, 
2) కార్తికేయ, 
3) సర్వమంగళ, 
4) ప్రలంబరి, 
5) హలాయుధ, 
6) మృత్యుంజయ, 
7) నతాంవర, 
8) ముక్తేశ్వర మరియు 
9) శేషదేవులు.

3) సుభద్రాదేవి రథం విశేషాలు: 

పేరు - దేవదలన, దర్పదలన, 
పొడవు - 44'6", 
చక్రాలు - 12, 

సుదర్శనస్వామి వారు కూడా దీనియందే ఉంటారు. 

రథము పైన నలుపు, ఎరుపు రంగులతో ఉన్న వస్త్రాన్ని గోపురంగా అమరుస్తారు. 

ధ్వజము పేరు నాదాంబిక, 

రోచిక, మోచిక, జిత, అపరాజిత అనబడే నాలుగు ఎర్ర రంగులో గల గుర్రాలు అమర్చబడి ఉంటాయి, 

రథమునకు రక్షణశక్తిగా త్రిపురసుందరీ దేవి కమలమును, పద్మమును ధరించి ఉంటుంది.

రథపాలకురాలు - జయదుర్ల, 
సారథి - అర్జునుడు. 

రథాన్ని లాగే త్రాడుయందు స్వర్ణచూడుడు అనే దివ్య సర్పశక్తిని ఆవహింపజేస్తారు. 

రథము చుట్టూ తొమ్మిది మంది పార్శ్వ దేవతలు దారు (కధ) మూర్తులుగా దర్శనమిస్తారు. వారి పేర్లు: 

1) చండి, 
2) చాముండ, 
3) ఉగ్రతార, 
4) వనదుర్గ, 
5) శూలిదుర్గ, 
6) వారాహి, 
7) శ్యామాకాళి, 
8) మంగళ మరియు 
9) విమలాదేవి.
బాహుదా రథయాత్ర, సువర్ణ మేషము, అధరపానము

మరల ఆ రథాలు గుండిచా మందిరం నుండి ప్రధాన ఆలయానికి చేరడానికి యాత్ర జరుగుతుంది అది 'బాహుదా యాత్ర" అని ప్రసిద్ధి. తిరుగు రథయాత్రలో రథముపై ఉండగానే ఈ మూర్తులకు సుమారు 208 కిలోలకు పైగా గల బంగారు, రత్న అభరణములతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. దీనిని "సునావేష" అంటారు.

అధరపానం: ఇది చాలా ముఖ్య ఘట్టం. తిరుగు రథయాత్రలో ఏకాదశి రోజున త్రిమూర్తుల పెదాలవరకు వచ్చేటంతటి పొడవైన మట్టి పాత్రలలో పాలు, పంచదార, వెన్న, అరటిపళ్ళు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి కలిపిన సుమారు 100 లీటర్లకు పైగా ఉన్న పానీయాలను అందిస్తారు. తరువాత ఆ పాత్రలను పగలగొడతారు. ఆ పానీయాలు అంతవరకు ఆ రథాలకు రక్షకులుగా ఉన్న దేవగణ. రక్షోగణాలు సూక్ష్మరూపాలలో ప్రసాదంగా స్వీకరించి తృప్తిపడతాయి.

అన్న బ్రహ్మ: ప్రపంచంలోనే పెద్దదిగా పిలువబడే వంటశాలలో స్వామివార్ల నైవేద్యానికి ప్రసాదాలు తయారవుతాయి. సాధారణంగా రోజూ 56 రకాల వంటకాలు కాగా విశేష దినాలలో ఇంకా ఎక్కువ రకాలు తయారవుతాయి. ఎటువంటి యంత్ర పరికరాలు (గ్రైండర్ వంటివి) వాడకుండా అన్నీ స్వహస్తాలతోనే కర్ర పొయ్యిలపైన, మట్టికుండలలోనే చేయడం ఇక్కడ విశేషం, మిరపకాయలు, మసాలా దినుసులు కూడా వాడరు. నిత్యభోగం రోజుకి 5 సార్లు జరుగుతుంది. జగన్నాథునికి నివేదించిన తరువాత అక్కడి అమ్మవారైన "విమలాదేవి"కి నివేదిస్తారు. అప్పుడు అది మహా ప్రసాదం అవుతుంది. ఇక్కడి ప్రసాదం 'అన్న బ్రహ్మ'గా కీర్తింపబడుతుంది.

ప్రసాదం సాక్షాత్తూ జగన్నాథుని స్వరూపం. ఇక్కడి ప్రసాదానికి ఎంగిలి, అశౌచము మొదలైన దోషాలు లేవు.
''సర్వం శ్రీజగన్నాథం' అనే నానుడి అలా వచ్చినదే. ఈ అన్న ప్రసాదం ఎండిన తరువాత నిర్మాల్యముగా తెచ్చుకుని తినడం కూడా సంప్రదాయంగా వస్తోంది. భక్ష్యాభక్ష్య దోషాలు ఆ ప్రసాదం తినడం వల్ల పరిహారమవుతాయి. శ్రీరామకృష్ణ పరమహంస వారు కూడా ఆ నిర్మాల్య ప్రసాదాన్ని రోజూ సేవించేవారు.

జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు ధర్మప్రతిష్ఠాపనకు స్థాపించిన నాలుగు ధామాలలో తూర్పు దిక్కున ప్రసిద్ధి చెందిన గోవర్ధన ధామం ఇక్కడ నెలకొని ఉంది. వారు జగన్నాథునిపై భావించిన ఈ దిగువ భావనను మన హృదయాలలో స్థిరపరచుకుందాం.

రథారూడో గచ్ఛన్ పథిమిళిత భూదేవవటలైః 
స్తుతిః ప్రాదుర్భావో ప్రతిపదముపాకర్ణ్య సదయః 
దయాసింధుః బంధుః సకల జగతాం సింధు సుతయా 
జగన్నాథ స్వామీ! నయనపథగామీ భవతు మే!!

రథాలపైన పయనిస్తూ మార్గములో భక్తులచే చేయబడుచున్న స్తోత్రములలో ప్రతియొక్క పదాన్ని సముద్రతనయ అయిన సుభద్రాదేవితో కలసి ఎంతో ప్రేమగా వింటున్న సకల జగములకు బంధువైన జగన్నాథస్వామీ! నా కనులకు దర్శనమిచ్చి కరుణింపుము.

- సామవేదం షణ్ముఖ శర్మ గారు (ఋషిపీఠం ప్రచురణలు)

No comments:

Post a Comment