Sunday, July 14, 2024

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ -

ఉప్పు గురించి సంపూర్ణ వివరణ - 

       ఆయుర్వేదం నందు లవణమును ( ఉప్పు ) 6 రకాలుగా వర్గీకరించారు. అవి 

  * సైన్ధవ లవణము . 

  * సాముద్ర లవణము.

  * బిడా లవణము . 

  * సౌవర్చ లవణము . 

  * రోమక లవణము . 

  * ఔద్బిద లవణము . 

           లవణములు అన్నియు లవణ రసమును కలిగి ఉండి వేడిచేయు గుణమును కలిగి ఉండును. ఆహారంలో ఉపయోగించుటకు అన్ని లవణముల కంటే సైన్ధవ లవణము మంచిది . 

 * సైన్ధవ లవణము - 

      హృద్రోగము నందు , వాపుల యందు , రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ఉప్పు నిషిద్ధమైనప్పటికీ సైన్ధవ లవణమును కొద్దిమోతాదులో వాడవచ్చు . సింధుపర్వత ప్రాంతమున భూగర్భగనుల నుండి సేకరించుట చేత దీనికి సైన్ధవ లవణం అని పేరువచ్చింది. ఇది సహజముగా పరిశుద్ధం అయినది. ఆకలిని పుట్టించును . ఆహారమును జీర్ణం చేయును . చలువ చేయును . నేత్రములకు మంచిది . వాత, పిత్త, కఫ దోషముల యందు పనిచేయును . 

              వ్రణములను శోధించి మాన్పును . నేత్రరోగులకు మంచిది . దాహమును అణుచును . విరేచనం చేయును . శ్లేష్మాన్ని కరిగించును. పాలతో కలిపి పుచ్చుకొనవచ్చు. దీనిని అమితముగా పుచ్చుకొనిన పైత్యమును చేయును . అతిసార రోగమును పుట్టించును . 

 * సాముద్ర లవణము - 

         ఈ లవణమును సముద్రపు నీరు ఎండబెట్టి చేయుదురు . ప్రతిరోజు మనం వాడుకునే ఉప్పు ఈకోవలోకే వచ్చును. ఇది విరేచనకారి , ఆకలిని పెంపొందించును. శ్లేష్మాన్ని వృద్ధిచెందించును . వాతాన్ని అణుచును. కఫవాతము , గుల్మము , విషము , శ్వాసకాస వీనిని హరించును . నేతిలో ఉప్పు వేసి పుచ్చుకొనిన శూలలు ( నొప్పులు ) తగ్గును. పరిణామ శూలతో అనగా ఆహారం అరుగు సమయములో నొప్పితో ఇబ్బందిపడేవారు భోజనం చేసే సమయములో మొదటిముద్దలో కొంచం ఉప్పు కలుపుకుని తినుచున్న పరిణామశూల నయం అగును. 5 గ్రాముల సాముద్ర లవణమును చల్లని నీటితో కలిపి ఇచ్చిన రక్తముతో కూడిన వాంతులు నయం అగును.  

                      తేలు కుట్టినప్పుడు 5 గ్రాముల ఉప్పు నీటితో కలిపి కరిగిన తరువాత ఇచ్చిన తేలు విషం వెంటనే తగ్గును. వేడినీటితో పుచ్చుకొనిన వాంతి చేయును . కడుపులో నొప్పి , గుండెల్లో నొప్పి వచ్చు సమయమున ఉప్పును ఒక కడాయిలో వేసి వేయించి ఒక గుడ్డలో పోసి మూటకట్టి నొప్పి భాగములో కాపడం పెట్టిన తగ్గును. వాతము , శ్లేష్మములను హరించి శరీరానికి వేడిపుట్టించును. 

         ఉప్పును అధికంగా తీసుకోవడం వలన కొన్నిరకాల దుర్గుణాలు కలుగును. ఎముకలు మరియు వీర్యము యొక్క బలాన్ని తగ్గించును . నేత్రవ్యాధులు , రక్తస్రావము , కుష్ఠు , విసర్పి , వెంట్రుకలు రాలిపోవుట , తెల్లబడుట వంటి దుర్గుణాలు కలుగును. 

       మిగిలిన లవణాలు అయిన సౌవర్చలవణము , బిడా లవణము , ఔద్బధ లవణము , రోమక లవణము వంటివి సురేకారముతో తయారుచేయును . వాటిని ఔషధముల యందు మాత్రమే ఉపయోగిస్తారు . ఆహారం నందు వాడుటకు పనిచేయవు . 

               

No comments:

Post a Comment