Tuesday, September 28, 2021

సూక్తులు

1. మాతా నాస్తి, పితా నాస్తి, 
నాస్తి బంధు సహోదరః| 
అర్థం నాస్తి, గృహం నాస్తి, 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 
జాయా దుఃఖం పునః పునః| 
సంసార సాగరం దుఃఖం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. 

కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 
దేహే తిష్ఠతి తస్కరాః| 
జ్ఞాన రత్నాపహారాయ 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

4. ఆశయా బధ్యతే జంతుః 
కర్మణా బహు చింతయా| 
ఆయుక్షీణం న జానాతి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు 
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న 
విషయాన్ని గమనించరు. 
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

5. సంపదః స్వప్న సంకాశాః 
యౌవనం కుసుమోపమ్| 
విధుఛ్చచంచల ఆయుషం 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 
క్షణం జీవితమావయోః| 
యమస్య కరుణా నాస్తి 
తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 

7. యావత్ కాలం భవేత్ కర్మ 
తావత్ తిష్ఠతి జంతవః| 
తస్మిన్ క్షీణే వినశ్యంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 

8. ఋణానుబంధ రూపేణ 
పశుపత్నిసుతాలయః| 
ఋణక్షయే క్షయం యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 

9. పక్వాని తరుపర్ణాని 
పతంతి క్రమశో యథా| 
తథైవ జంతవః కాలే 
తత్ర కా పరివేదన|| 

తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 

10. ఏక వృక్ష సమారూఢ 
నానాజాతి విహంగమాః| 
ప్రభతే క్రమశో యాంతి 
తత్ర కా పరివేదన|| 

తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం 
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు 
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు 
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన 
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని 
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ 
నవసరములేదు.

No comments:

Post a Comment