Tuesday, November 23, 2021

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు

ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు  - 1

   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 

      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 

 * స్వర్ణ భస్మం - 

    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 

 *  వెండి భస్మము - 

      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 

 *  తామ్ర భస్మం - 

      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 

 * లోహ భస్మము - 

      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను .  దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 

 * కాంత భస్మము - 

      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 

 *  మండూర భస్మము - 

    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 

    

No comments:

Post a Comment