Sunday, September 15, 2024

మంచి ప్రశ్నలు

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.
700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల ఈ పోస్ట్ లో పరిచయం తెలుసుకోండి.
 
భగవద్గీతాశ్లోకం-ప్రశ్నోత్తరములు

పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?

జ. మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.

2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?

జ. గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?

జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?

జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?

జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది. 

6. గీత ఎందుకు చెప్పబడినది?

జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?

జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?

జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.

9. గీత ధృతరాష్ట్రునికి ఎవరు చెప్పారు?

జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.

10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?

జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.

11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?

జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము  

12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను? 

జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు.   

13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు. అవి ఏవి? వాని భావమేమి? 

జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
    2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
        యొక్క పుత్రుడు అంటే ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు.  
    3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
    4) అనసూయ - అసూయ లేనివాడు.
    5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
    6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
    7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
    8) గుడాకేశ - యింద్రియ నిగ్రహం గలవాడు.
    9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
    10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు . 

14. భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?

     బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
            బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధిన

    అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
   ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్ 

ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది, పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.    

15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?

జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.    

16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?

జ. "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
        మామకాకి పాండవాశ్చైవ కీమ కుర్వత సంజయ: "
 శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
       "యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
        శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
 చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.

17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?

జ. ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని 
        1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు.  
        2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
            ప్రార్దించువారు అర్దార్దులు.
        3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,    
            సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును.       
        4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును. 

18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?

జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట 4. దానము 5. ఇంద్రియనిగ్రహం
    6. యజ్ఞము 7. అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము  
   12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ 
   17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును  
   వీడకుండుట 21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము 
   24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట      
   26.తంతుల స్వభావము లేకుండుట    
   అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక 
   జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస. 
              ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను. 

19. యోగమనగా నేమి?

జ. యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట 
                  యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము 
                  యోగమనగా ఆనందం 
                  సమత్వమే యోగము 
                  చిత్త వృత్తిని విరోధించునదే యోగము 

20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?

జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.

21. స్వధర్మమంటే ఏమిటి? పర ధర్మమంటే ఏమిటి?

జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.

22. అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?

జ. గురువు వద్ద నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా తెలుసుకోగలము.

23. "యోగం" అంటే అర్థం ఏమిటి?

జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .

24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?

జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా , శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. "యోగ: చిత్త వృత్తి నిరోద:" అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి - బుద్దిని,మనస్సును నిలిపి వుంచేదే యోగం. 'సమత్వం యోగముచ్యతే" - అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం.   

25. భగవద్గీతలో ప్రధానమైన యోగములు ఏవి?

జ. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము , రాజ యోగము.

26. కర్మ యోగము అంటే ఏమిటి?

జ. కర్మ యోగము అంటే ప్రతి వ్యక్తీ తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థముగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్దిగా చేయుట.  

27. కర్మ, వికర్మ , అకర్మలను స్వామి ఏవిదంగా విశదీకరించారు?

జ. స్వామి కర్మ, వికర్మ, అకర్మల గూర్చి చెపుతూ " దీపం వుంది. అది నిలకడగా వెలుగుతుంది - ఇది కర్మ. వికర్మ అంటే - ఆ దీపం నిలకడగా వుండక పరిసర ప్రభావాలకు లోనై వూగిసలడటం. ఇకపోతే అకర్మ - నిలకడగా వున్నా, లేక పోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం .

28. "కర్మణ్యే వ్యాధి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ: మాతే సంగోస్త్వ కర్మణి" శ్లోకార్థాన్ని తెలుపుము?

జ. "కర్మలాచరించుటకు మాత్రమే స్వాతంత్ర్యము కలదు. కానీ ఆ కర్మలవల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుట యే నీధర్మం. ఫలము ఈశ్వరాధీనము ఫలాపేక్ష లేని వాడ వై కర్తవ్యమును ఆచరింపుము. 

29. భక్తియోగము అంటే ఏమిటి?

జ. భక్తి యోగము అంటే "భగవంతునితో తనను తాను నిశ్చల, అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల, నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా, వాచా, కర్మణా భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము. 

30. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములు ఏమిటి?

జ. నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగివుండటం మిత్రత్వము, దయార్ద్రహృదయము, అహంకార రహితము, సుఖ దుఖాలు యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి వుంటాడు. అంతే కాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై వుండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకొనువాడై నిజమైన భక్తుడు.

31. ఎట్టివాడు భగవత్ప్రేమకు పాత్రుడు కాగలడు ?

జ. అనా పేక్ష: శుచి: దక్ష: ఉదాసీనోగతవ్యధ:
సర్వా రమ్న పరిత్యాగి యోమద్భక్త: సమేప్రియ:
ఎట్టి ఆపేక్షలు (కోరికలు) లేనివాడు. అంతర్ , బహిర్ శుద్ది (పవిత్రత) కలవాడు. ఫలాపేక్ష రహితుడై కర్మల నాచరించేవాడు, గతమును గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రమూ విచారించనివాడు, ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచి పెట్టినవాడు నాకు యిష్టుడైన భక్తుడు" అని గీతాచార్యుడు పలికాడు.  

32. జ్ఞానయోగము అంటే ఏమిటి?

జ. జ్ఞానయోగమంటే "నేనెవరిని? నేనెక్కడ నుండి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? " అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం. 

33. జ్ఞానము ఎన్ని రకములు?

 జ. జ్ఞానము - లౌకికము (భౌతికము) , ఆధ్యాత్మికము (దైవిక సంబంధమైన) అని రెండు రకములు.

34. జ్ఞానము ఏవిధంగా పొందగలము?

జ. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలిసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మ విశ్వాసము.
అసక్తి, స్థిరత్వము , నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే.

35. "రాజ యోగ" మనగా ఏమిటి?

జ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది రాజయోగము.

36. కర్మ, భక్తి , జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏవిధంగా విశదీకరించారు?

జ. కర్మ అనేది చెట్టుకు పూచే పూవు వంటిదనీ, భక్తి ఆ పూవు నుండి ఉద్భవించే కాయవంటిదనీ , జ్ఞానము పండిన పండు వంటిదనీ స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి.

37. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ వుంటుంది?

జ. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించు కోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ వుంటుంది. 

38. మనస్సు అనగా ఏమిటి?

జ. సంకల్ప వికల్పములతో , కోరికలతో కూడినది మనస్సు.
39. మనస్సును ఎందుకు అదుపులో నుంచుకోవాలి?

జ. మనస్సు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి దీనిని అదుపులో వుంచుకోవలెను. 

40. మనస్సును ఎలా నియంత్రించగలం?

జ. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ది ఉండాలి. బుద్దిని అనుసరించాలి మనస్సు.

సేకరణ పోస్టు...

No comments:

Post a Comment