Thursday, January 2, 2025

సన్మార్గం

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

                      *సన్మార్గం*
                    ➖➖➖✍️

*జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటుపడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడమే దుర్మార్గం.*

*సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటాడు. ఆత్మవిమర్శ చేసుకొంటూ ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తాడు.*

*ఈ సమాజం ఎలా అయినా ఉండనీ గాక, మనమెలా ఉన్నామన్నదే ముఖ్యం. ఏం చేస్తామన్నదే ముఖ్యం. కమలం బురద మధ్యలో జీవిస్తున్నా తన తేజస్సు కోల్పోదు. కోమలత్వాన్ని వీడదు. మనిషి కూడా కమలం లాగే బతకాలి.*

*సన్మార్గంలో సాగడం వల్లే మనిషి ఈ సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందుతాడు. మానవత్వం వల్లే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మ ద్వారా అందరికీ సహాయం చేసే స్థాయికి మనిషి ఎదగాలి.*

*మరుజన్మ ఉన్నదో లేదో మనకు తెలియదు. గత జన్మ ఎలాంటిదో కూడా తెలియదు. ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను ప్రతి మనిషీ సార్థకం చేసుకోవాలి. పదిమందినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి.*

*ఒకసారి సన్మార్గం వైపు ప్రయాణించిన మనిషి చెడుమార్గం వైపు మరి కన్నెత్తి చూడడు.*

*సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగుతాడు. దారి దోపిడులు చేసే రత్నాకరుడనే బోయవాడు నారద మహాముని ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ప్రసిద్ధి పొందాడు. ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు.*

*బుద్ధుడు సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు. ఆ సిద్ధార్థుడే అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి జ్ఞానోదయం పొందాడు. మహా బోధకుడిగా మారి అమరుడయ్యాడు.*

*శ్రేష్ఠులైనవారు దేన్ని ధర్మంగా భావించి ఆచరిస్తారో సజ్జనులూ దాన్నే ఆచరిస్తారని బోధించాడు శ్రీకృష్ణుడు.*

*జ్ఞానులు, మహాత్ములు సన్మార్గాన్ని అనుసరించారు, చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించాలి. కీర్తి శిఖరాలు చేరుకోవాలి.*

*రావణాసురుడు గొప్ప శివభక్తుడు. స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి నాశనమయ్యాడు.*

*వివేకం కోల్పోయి బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల కౌరవ నాశనానికి కారకుడయ్యాడు దుర్యోధనుడు. *

*ఏ మనిషైనా దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం పట్టదు. మంచివాడిగా, మానవోత్తముడిగా గుర్తింపు పొందడానికి చాలా కాలం పడుతుంది. తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది.*

*సన్మార్గమే మనిషికి సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి సంపదలు ఉన్నా అవి లేనట్లేనన్నది నీతికోవిదుల మాట.*

*చూసిన ప్రతిదాన్ని ఆశించడం, ఆశించినదానికోసం పాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం... ఇవన్నీ మనిషి అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపిస్తాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుని స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి.*

*#సన్మార్గం మనిషికి సుఖశాంతులు ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనసులు కడిగిన ముత్యాల్లా నిర్మలంగా ఉంటాయి. వారు ఎవరితోనైనా మృదుమధురంగా మాట్లాడతారు. కలిమిలోను, లేమిలోను నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించిన మనిషి,మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచిన మనిషికి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment