. మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.
* ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.
* వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .
* వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.
* వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .
* ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .
* వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .
* వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.
* వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .
* వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.
* వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.
* వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.
* వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.
* చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .
* వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.
* వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.
* లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.
* వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .
* వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.
* ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .
* వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.
* పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.
* వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.
* వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.
* వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.
* నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.
* వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.