Friday, September 12, 2025

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -

ఆయుర్వేద వైద్యం నందు జలగలు ఉపయోగించే విధానం -
     
. జలము ఆయువుగా కలవి కావున జలాయుకములు అనియు , జలము నివాసస్థానం కలవి కావున జలౌకలని మరియు జలగలు అని పిలవబడుతున్నవి. ఇవి 12 విధములు గా ఆయుర్వేదం విభజించింది. ఇందు విషము కలిగినవి నల్లటి రంగులోని బేధము వలన 6 విధములు . అందు కృష్ణ అనునది కాటుక రంగు పెద్ద శిరస్సు గలది. కర్బూర అనునది బొమ్మిడ అను చేప వంటి ఆకృతి కలిగి ఒకచోట చిన్నగా , మరొకచోట పెద్దగా ఉండు పొట్ట కలిగి ఉండును. కలగర్ద అనునది ముడుతలతో కూడి ఉండి పెద్ద పార్శ్వములతో కలిగిన ముఖం 
ఉండును. ఇంద్రాయుధ అనునది ఇంద్రధనస్సులోని నానారంగులు గల నీలపు చారలతో కూడుకుని ఉండును. సాముద్రిక అనునది కొద్దిగా నలుపు , పసుపు రంగులతో ఉండి అనేక ఆకృతులుగల తెల్లని మచ్చలతో కూడుకుని ఉండును. గోచందనం అనునది ఆంబోతు బుడ్డ వలే పొట్ట యందు ఒక గీత కలిగి సన్నని ముఖం కలిగి ఉండును.
          
. పైనచెప్పిన 6 రకాల జలగలు విషము కలిగి ఉంటాయి. ఇవి కరిచినచో కాటునందు వాపు , మిక్కిలి దురద, మూర్చ, జ్వరం, తాపము , వాంతి కలుగును. 
     
 *. విషము లేని జలగలు గురించి వివరణ. - 

 విషములేని జలగలు మొత్తం 6 రకాలు . అందులో కపిల అనునది ప్రక్కల యందు మనశ్శిలతో రంగు వేసినట్లు ఉండి వీపున నిగనిగలాడుచూ పెసలవలే ఆకుపచ్చ రంగు కలిగి ఉండును. పింగళి అనునది కొంచం ఎరుపు రంగు గుండ్రని శరీరం పచ్చని రంగు ఉండి వేగముగా కదులును. శంఖముఖి అనునది యకృత్ వలే ఎరుపు నలుపు రంగులు కలిగి శీఘ్రముగా రక్తమును తాగే స్వభావం పొడవైన వాడి అయిన ముఖం కలిగి ఉంటుంది. మూషిక అనునది ఎలుక వంటి ఆకారం , రంగు , దుర్వాసన కలిగి ఉంటుంది. పుండరీకం అనునది పెసల వలే పచ్చని రంగు , పద్మముల వలే విశాలమైన ముఖం కలిగి ఉండును. సావరిక అనునది నిగనిగలాడుచూ తామరాకు వంటి రంగు కలిగి 18 అంగుళముల పొడవు కలిగి ఉండును. ఇది ఏనుగులు, గుఱ్ఱములకు చికిత్స చేయుటలో మాత్రమే వాడవలెను .మనుష్యులకు పనికిరాదు. వీటిని నిర్విష జలగలు అందురు.
             
. ఈ విషము లేనటువంటి జలగలు లభించు ప్రదేశాలు ముఖ్యంగా ఢిల్లీకి పశ్చిమ దిశలోను , సహ్యాద్రి పర్వతాలు అనగా నర్మదా నది ప్రవహించు పర్వత ప్రాంతాలలోను, మధురా ప్రాంతంలోనూ ఈ విషము లేనటువంటి జలగలు ఉండును. ఈ ప్రదేశాలలో లభించు జలగలు పెద్ద శరీరం కలిగి మంచి బలముతో ఉండి శీఘ్రముగా రక్తమును పీల్చెడి స్వభావం ఎక్కువుగా ఉండి విషము లేకుండా ఉండును.
        
. విషముతో కూడిన చేపలు , పురుగులు , కప్పలు , మూత్రపురీషములు క్రుళ్ళుట చేత పుట్టిన జలగలు మరియు కలుషిత జలము నందు పుట్టిన జలగలు, నీటిలోని పద్మములు కుళ్లుటచేత పుట్టిన జలగలు విషపూరితంగా ఉండును. శుద్ధజలము నందు పుట్టిన జలగలు విషం లేకుండా ఉండును.
           
*. ఇప్పుడు జలగలను పట్టే విధానం వాటిని పోషించే విధానం - 
    
. రక్తముతో కూడిన తోలు , జంతుమాంసం , వెన్న , నెయ్యి, పాలు మొదలగు వాటితో కూడిన అన్నమును జలగలు ఉన్న ప్రదేశంలో వేసినచో అవి పైకి వచ్చును. అప్పుడు వాటిని పట్టుకొని మంచి కుండలో చెరువునీటిని , బురదని పోసి అందులో ఉంచవలెను. వాటికి తిండి కొరకు నాచు, ఎండిన మాంసము , నీటిలో పుట్టే దుంపల చూర్ణం ఇవ్వవలెను. అవి నిద్రించుటకు గడ్డి, నీటి యందు పుట్టే పచ్చి ఆకులను ఆ కుండ నందు వేయవలెను . రెండు మూడు రోజులకు ఒకసారి ఆ కుండ యందలి నీటిని తీసివేసి కొత్తనీటిని పోసి ఆహారం కూడా కొత్తదానిని వేయవలెను . ప్రతి ఏడు రోజులకు ఒకసారి కుండను మార్చవలెను . ఈ జలగలను శరత్కాలం పట్టుకొనుట మంచిది .
      
 *. జలగలను వైద్యంలో ఎలా ఉపయోగించే విధానం -. 
            
. జలగలచే పోగొట్ట తగిన రోగము కలిగిన వానిని కూర్చుండబెట్టి కాని , పడుకోపెట్టి కాని జలగ పట్టించవలసిన ప్రదేశములో వ్రణము లేనిచో ఆ ప్రదేశంలో ఎండించిన ఆవుపేడ చూర్ణం , మన్ను కలిపి మర్దన చేయవలెను . ఆ తరువాత జలగలను తీసుకుని ఆవాలు , పసుపు కలిపి నూరి కలిపిన నీటిలో ముంచి వేరొక మంచినీటి పాత్రలో ముంచి వాటిని రోగమున్న ప్రదేశములో పట్టించవలెను. ఆ తరువాత ఆ జలగకు మంచి కాటన్ గుడ్డ ముక్కతో ముఖము విడిచి శరీరం అంతయు కప్పవలెను. అప్పుడు ఆ జలగ రోగ స్థానమును పట్టును . అలా పట్టనిచో ఆ రోగస్థానం పైన పాలచుక్క గాని రక్తపుచుక్క గాని వేయుట లేక కత్తితో గీయుట చేసినచో జలగ వెంటనే రోగస్థానమును పట్టును . అప్పుడు కూడా జలగ పట్టనిచో దానిని వదిలి వేరొక జలగ పట్టించవలెను .
                  
. జలగ ఎప్పుడూ తన ముఖమును గుర్రపుడెక్క వలే విస్తరించి స్కంధమును పైకెత్తి రోగస్థానమును తగులుకొనునో అప్పుడు అది రక్తమును పీల్చుతుంది అని అర్ధంచేసుకొనవలెను వెంటనే దానిని తడిగుడ్డతో కప్పి మధ్యమధ్యలో తడుపుచుండవలెను . అలా చేస్తున్నచో రక్తం బాగుగా పీల్చును. ఆ పీల్చుటలో ముందుగా దుష్టరక్తమునే పీల్చును .
            
. జలగ రక్తం పీల్చుతూ ఉన్నప్పుడు కొంత సమయం తరువాత పోటు , దురద మొదలగుచున్న అప్పటివరకు అది దుష్టరక్తం పీల్చి ఆ తరువాత మంచిరక్తం పీల్చడం మొదలు అయినది అని అర్థం . ఆ తరువాత వెంటనే జలగను తీసివేయవలెను . రక్తం యొక్క రుచి మరిగి ఆ జలగ రానిచో దాని ముఖము పైన సైన్ధవ లవణము వేసినచో విడిచివేయును .

 *. చెడు రక్తం పీల్చిన జలగను శుద్దిచేయు విధానం - 
     
         పైన చెప్పినట్టు రోగస్థానమును విడిచిన జలగకు శరీరం పైన బియ్యపు పిండిని పూసి ముఖం నందు నూనె, ఉప్పు కలిపి రాసి ఎడమచేతితో తోకను పట్టుకొని కుడిచేతితో ముఖము వరకు ఆవుపాలు పితికినట్లు చేయవలెను . ఈ విధంగా చేస్తూ తాగిన రక్తమును బయటకి కక్కునట్టు చేయవలెను . ఆ తరువాత ఆ జలగను శుభ్రపరచి మంచినీటితో కూడిన పాత్ర యందు ఉంచవలెను. అప్పుడు అది ఉత్సాహముగా సంచరించును. అలా సంచరించకుండా కదలక మొద్దుగా ఉన్నచో చెడురక్తం దాని శరీరం నుంచి పూర్తిగా బయటకి పోలేదు అని గ్రహించి మరలా కక్కించు ప్రయత్నం చేయవలెను . కక్కించాక మరలా కుండ నందు భద్రపరచవలెను.
       
* జలగతో రోగనివారణ క్రియ చేశాక చేయవలసిన విధి -.
         
 జలగ ద్వారా చెడు రక్తం తీసాక ఆ గాయమునకు ఔషదాలు కలిపిన ఆవునెయ్యి పూయవలేను . కొందరికి తేనె కూడా పూయవచ్చు.
    
. పైన చెప్పిన జలగతో చెడు రక్తాన్ని తీయు విధానాన్ని రక్తమోక్షణం అంటారు. ఈ క్రియను రోగి యెక్క బలం, రోగం యొక్క బలాన్ని అంచనా వేసుకొని మాత్రమే అంచనా వేసుకొని చేయవలెను .
     

. ********** సంపూర్ణం ************
 
          

Thursday, September 11, 2025

యోగ_లో_సూర్య_నమస్కారాలు

*యోగ_లో_సూర్య_నమస్కారాలు ................!!* 

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

# *మరెన్నో లాభాలు* :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7. *సర్పాసనం* ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8. *పర్వతాసనం* ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9. *ఆంజనేయాసనం* ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10. *పాదహస్తాసనం* ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11. *హస్త ఉత్తానాసనం* ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.
.

Monday, September 8, 2025

ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*ఆశీర్వచనం ఎందుకు చేస్తారు?*
              ➖➖➖✍️

*ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం.....*

*పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి.....*
```
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. 

విద్యార్ధులను ‘విద్యా ప్రాప్తిరస్తు’ అని, 
పెళ్ళయిన ఆడవారిని 
‘దీర్ఘ సుమంగళీభవ’ అని, పురుషులని ‘దీర్ఘాయుష్మాన్ భవ’ వగైరా సమయానికి తగ్గట్లు వుంటాయి ఆ దీవెనలు.

యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభంభవతు, లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అనే ఆశీర్వచనంతో దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా వుండాలనీ, పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనీ, వున్నవారికి వంశాభివృద్ధి చేసే మనవలు కలగాలనీ, ధనం లేని వారికి సంపదలు కలగాలనీ, వగైరా సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు.```

*అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం వుందా ? అవి ఫలిస్తాయా ?*```

తప్పకుండా ఫలిస్తాయి...

సత్పధంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి. ఈ ఆశీర్వచనాల వల్ల జాతకంలో వుండే దోషాలు తొలుగుతాయి, అకాల మృత్యు దోషాలు తొలుగుతాయి. అంతేకాదు, పూర్వ జన్మ పాపాలు కూడా నాశనమవుతాయంటారు.

గురువులు, సిద్ధులు, యోగులు, వేద పండితులు, మనకన్నా చిన్నవారైనా వారి కాళ్ళకి నమస్కరించి వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు. అక్కడ మనం నమస్కరించేది వారి వయసుకి కాదు, వారి విద్వత్తుకు, వారిలోని సరస్వతికి!

అక్షింతల సంకేతం.....

సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజునుంచీ ప్రతి శుభసందర్బం లోనూ ఆశీర్వదించినప్పుడు తలమీద అక్షింతలు జల్లుతారు. ```

*ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఏమిటి సంబంధం ?* ```

అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా ? ```

*మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?*
```
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమన్నమాట. 

బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. 

మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారంనుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది. క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు. ఆలాంటి ఆశీర్వచనానికి శక్తి వుంటుంది.

మన పూజలు, శుభ సందర్భాల్లో అక్షింతలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్షింతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు. ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షింతలు ఉంచి మధ్యమధ్యలో ‘అక్షతాన్ సమర్పయామి’ అంటూ భక్తిగా అక్షతలు జల్లడం హిందూ సంప్రదాయం. పెళ్ళిళ్ళు, పేరంటాలలో వధూవరులపై అక్షతలు జల్లి ఆశీర్వదిస్తారు. ఉయ్యాల, పుట్టినరోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షింతలు తలపై జల్లి ఆశీర్వచనాలు పలుకుతారు.

మంత్రించిన అక్షతలు తలపై జల్లి ఆశీర్వదించినట్లయితే, శుభం చేకూరుతుందని, చెడు ఫలితాలు, దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు. కేవలం పెళ్ళిళ్ళు, శుభకార్యాల్లోనే కాదు, అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది.

బియ్యంలో తగినంత పసుపు, నాలుగు చుక్కలు నెయ్యివేసి అక్షతలను తయారుచేస్తారు. ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలను వేసి తయారుచేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి.

ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు

ఉపవాసం చేయడం వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు - 

 * జీర్ణక్రియ - 

      జీర్ణావయవాలకు మంచి విశ్రాంతి లభించును . అజీర్ణము తొలగించి ఆకలి వృద్ది అగును. 

 * మలాశయం - 

       మలాశయంలోని మురికి బహిష్కరించబడి అజీర్ణం తొలగును . క్రిములను , బ్యాక్టీరియాలను నాశనం చేయును . 

 * మూత్రపిండములు - 

       మూత్రపిండములలోని విషపదార్ధములు , రాళ్లు బయటకి వెడలును . 

 * ఊపిరితిత్తులు - 

        ఉపిరితిత్తులోని నంజు , నీరు బహిష్కరించబడి ఆయాసము నివారించును . శ్వాసక్రియ చక్కగా జరుగును . 

 * గుండె - 

       గుండె చుట్టు , లోపల చేరిన కొవ్వు , నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకొనును . అధికంగా తినడం వలన రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువ అయ్యి గుండెజబ్బులు వచ్చును . 

  * లివర్ , స్ప్లీన్ - 

        ఆహారం జీర్ణం అగుటకు ఇవి ముఖ్యముగా పనిచేయవలెను . ఉపవాసం చేయుట వలన వీటికి విశ్రాంతి దొరుకును . వాటిలో మాలిన్యాలు తొలగించబడి జీర్ణక్రియ వృద్ధిచెందును . 

 * రక్తప్రసరణ - 

       రక్తదోషములు నివారణ జరుగును. ఉపవాసం వలన రక్తప్రసారం చురుకుగా జరుగును. కావున తిమ్మిర్లు , మంటలు , నొప్పులు నివారణ అగును. 

 * కీళ్లు - 

        కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు , నీరు , మాంసం , ఇతర మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ అగును. 

 * నాడి మండలము - 

        ఉపవాసం వలన నాడీ మండలం శుద్ది జరిగి వ్యాధి నివారణ జరుగును. 

 * జ్ఞానేంద్రియములు - 

        జ్ఞానేంద్రియాలలోని మాలిన్యములు కూడా నివారణ అగును. 

 * చర్మము -  

        చర్మము కాంతివంతం అగును. చర్మవ్యాధులు హరించును . శరీరానికి చక్కని రంగు వచ్చును . 

 * మనస్సు - 

        మనస్సు నిర్మలం అగును. కోపతాపములు నివారించును . ఆధ్యాత్మిక చింతనకు పునాదులు ఏర్పడును . 

        

  
      

Saturday, September 6, 2025

ఆహర విరుద్ధాలు -

ఆహర విరుద్ధాలు -

 మనం భుజించే ఆహరం వరసగా 

 1.రసం .

 2.రక్తం .
 
 3.మాంసం .

 4.మేధస్సు (కొవ్వు ) .

 5. ఎముక .

 6. మజ్జా .

 7. వీర్యము. (ఆర్థవము ).

అనే 7 ధాతువులు గా రూపాంతరం చెందుతుంది. ఆహారం మనిషి నిత్య నూతనం గా శక్తివంతం గా ఉండేవిధంగా తోడ్పడుతుంది. ఇదే రెండు విరుద్ధ భావాలు గల ఆహారం తీసుకున్నప్పుడు అవి విషతుల్యం అయ్యి తీవ్రమయిన అనారోగ్యాన్ని కలిగించవచ్చు .ఒక్కోసారి విషమై మనిషి మరణానికి కారణం కావొచ్చు.

 * చేపలు తిన్న వెంటనే పాలు , పెరుగు తాగరాదు.ఎందుకంటే చలువ చేసే స్వభావం గల పాలు , వేడి చేసే స్వభావం గల చేపలు కలిపి తినడం వలన పరస్పర విరుద్ద స్వభావాలు గల ఆహారాల వలన రక్తం లొ దొషం ఏర్పడి చర్మ వ్యాధులు కలగజేస్తుంది.

 * మాంసం తేనే గానీ , నువ్వులుగాని బెల్లం గానీ , పాలు గానీ , మినుములు గానీ , ముల్లంగి గానీ , మొలకెత్తిన ధాన్యాలు గానీ కలిపి వాడ కూడదు . ఒకవేళ పొరపాటున గానీ , గ్రహపాటున గానీ తింటే ఆ వ్యక్తికీ చెముడు, దృష్టి మాంద్యము, వణుకు, మొదలయిన వ్యాధులు కాలక్రమేణ రావడం జరుగుతుంది.

 * ఆవ నూనే లొ వేయించిన పావురం మాంసం గానీ , తేనే , నెయ్యి సమంగా కలిపి ఎట్టి పరిస్థితులో భుజింప గూడదు . ఈ విరుద్ద ఆహరం వలన రక్తము చెడి ధమనుల యందు గ్రంధులు ఏర్పడతాయి. అపస్మారము , కణతలు యందు పోటు సంభవిస్తుంది.

 * వెల్లుల్లి, మునగ, తులసి మొదలయిన పదార్దాలు తినిన వెంటనే పాలు తాగకూడదు. అలా తాగితే కుష్టు వ్యాధి సంభవిస్తుంది.

 * నిమ్మ పండును తేనే , నెయ్యి కలిపి గానీ మినపపప్పు బెల్లం నెయ్యి లొ కలిపి గానీ ఉపయోగించ కూడదు . అలా ఉపయోగించడం వలన నపుసకత్వం ఏర్పడుతుంది .

 * మామిడి , దానిమ్మ,, నిమ్మ , అరటి, పుల్ల దబ్బకాయ , రేగిపండ్లు, నేరేడు, వెలగ, చింతపండు , అక్రోటు, పనస, కొబ్బరి కాయ , ఉసిరి ఇటువంటి యే పుల్లటి పదార్ధం అయినా పచ్చిగా ఉన్నప్పుడు గానీ , ఎండిన పిమ్మట గానీ పాలతో కలిపి ఉపయొగించ కూడదు .

 * పెసలు మినుములు , అనుములు, ఉలవలు, కొర్రలు, వరిగలు.ఈ పదార్ధాలను కుడా పాలతో కలిపి భుజించకుడదు .అలా భుజిస్తే శరీరం లొ వాతము విపరీతం గా ప్రకోపించి వాత వ్యాదులుని కలిగిస్తుంది.

 * బచ్చలి కూరలో నువ్వుల పిండి కలిపి తింటె వెంటనే అతిసార వ్యాది కలుగుతుంది.

 * కొంగ మాంసం , పంది మాంసం కలిపితింటే తిన్న వెంటనే ప్రాణాంతక విషం అవుతుంది.

 * ఉష్ణ శరీర స్వభావం కలవారు తమ శరీరం లొ ఉష్ణం అదికం గా ఉన్నప్పుడు తేనెను వేడి చేసి గాని వేడి వస్తువులతో కానీ తింటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లతుంది.

 * తేనే , నెయ్యి సమాన భాగాలుగా కలిపి ఎప్పుడు భుజించకుడదు . తెనే లొ సగబాగం నెయ్యి కానీ , నెయ్యి లొ సగబాగం తేనే కానీ కలిపి మాత్రమే తీసుకొవాలి . లేకపొతే రెండు అమృతాలు కలిసి " "అమృతం అమృతేన విషం " అన్నట్లుగా విరుద్దమై ప్రాణాలు తీస్తాయి.

 * తేనే ను కొంచం గోరువెచ్చని నీటితో తప్ప భాగా వేడిగా ఉన్న నీటితో కలిపి సేవిస్తే అది విష తుల్యం అవుతుంది.

       ఈ విధంగా మనం తినే ఆహర పదార్దాలలోనే , ఒక దానితో ఒకటి పడని పదార్దాలు చాలా ఉన్నాయి వాటిని మన మహర్షులు పరిశోధించి విరుద్ద గుణాలు గల ఆహార పదార్దాలు వాడవద్దు అని తమ తమ గ్రంథాలలో విపులం గా పేర్కొన్నారు.