ప్రాచీన భారతీయ వాస్తు శాస్త్ర రహస్యాలు -
నేను భారతీయుడిగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను . ఎందుకంటే ప్రపంచంలో మరే దేశానికి , మరే సంస్కృతికి లేనంత గొప్ప ప్రాచీన విజ్ఞానం మన భారతీయులకు మన దేశానికే సోoతం . అటువంటి ప్రాచీన అద్బుతమైన విజ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం . ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు అయినా మరలా మీకు తెలియచేయాలి అనే ఈ చిన్న ప్రయత్నం .
మన ప్రాచీన శాస్త్రాలలో వాస్తుశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దానిలోని కొన్ని రహస్యాలు మీకు తెలియచేస్తాను.
* ప్రప్రధముగా గృహనిర్మాణం కావించునప్పుడు భూమిని పరీక్షించవలెను . అలాచేయనిచో ఆ గృహనిర్మాణం వ్యర్థం అగును.
* గృహనిర్మాణం కావించు భూమి యందు చిల్లపెంకులు ఉన్నచో అది అశుభప్రదము . ఎముక యొక్క బూడిద ఉన్నచో అది నష్టప్రదము , బొగ్గులు మరియు చౌడు ఉన్నచో జీవహాని .
* గృహనిర్మాణం చేయు భూమి తెల్లని రంగు కలిగి ఉన్నచో శ్రేష్టము . ఎర్రని రంగు గల భూమి మధ్యమము , పచ్చని రంగు కలిగిన భూమి అధమము , నల్లనిరంగు కలిగిన భూమి విడువవలెను .
* భూమిని త్రవ్వినప్పుడు దానిలోని మృత్తిక నాలుకపై వేసుకొనినచో తియ్యగా ఉన్న శ్రేష్టం , మిశ్రమం అయినది మధ్యమం , పుల్లనిరుచి అధమం , చేదు రుచి కలిగినది మరింత అధమం.
* తవ్విన మన్ను వాసన చూడగా తామరపద్మం వాసన వచ్చినచో శ్రేష్టం , గుర్రం మరియు ఏనుగు మదం వాసన వచ్చినచో మధ్యమం , పశువు మరియు ధాన్యం వాసన వచ్చినచో అది అధమం , ఇతర వాసనలు వచ్చినచో విడువవలెను .
* నాలుగు దిక్కులు సమ చతురస్రం కలిగి గంధపు వర్ణం కలిగిన భూమి గృహనిర్మాణానికి అత్యంత అనుకూలం .
* గృహనిర్మాణ స్థలం నందు ఒక మూర చతురస్రాకారంగా గొయ్యి తవ్వి దాని యందు రాత్రి సమయం లో నిండా నీరుపోసి పొద్దున్న లేచి చూడగా నీరు పూర్తిగా ఇంకిపోకుండా నిలిచి యున్నచో శుభప్రదం . ఇదే పద్ధతిని కొన్ని ప్రాచీన వాస్తుగ్రంధాలలో నీటిజాడని కనుక్కోవడానికి వాడేవారు. అదే గుంటలో నీరు ఇంకి బురదగా ఉన్నచో మధ్యస్తంగా నీరు పడును. నీరు పూర్తిగా ఇంకి భూమి నెర్రెలు కొట్టి ఉంటే ఎంత ప్రయత్నించినను నీరు పడదు.
* దేవాలయములకు శంఖువు శిలతో చేయవలెను . గృహములకు శంఖువు కర్రతో చేయవలెను .
* బ్రాహ్మణులకు పదహారు అంగుళములు , రాజులకు పదిహేను అంగుళములు , వైశ్యులకు పదునాలుగు అంగుళములు , శూద్రులకు పదమూడు అంగుళములు ఉన్న శంఖములను గృహగర్భము నందు వాడవలెను . ఆయా ప్రమాణాలలో సగం వర్తులాకారంలో ఉండవలెను . ఇది మగధదేశ నియమం .
* శంఖువు ఎనిమిది అంగుళాల లావు వుండవలెను .
* వృత్తాకారం గల స్థలం నందు గృహనిర్మాణం చేసి అందు నివసించేవారు దరిద్రులు అగును. విషమ కోణములు గల భూమి యందు నివసించేవారు దుఃఖితులు అగుదురు. ముక్కోణం గల స్థలం నందు ఇండ్లు కట్టి నివసించేవారు సివిల్ మరియు కేసులు సంప్రాప్తినుంచి ఇబ్బందులు పడును. చేట వంటి ఆకారం గల భూమి యందు గృహం నిర్మించి ఉండువారు ఎంతటి ధనవంతులు అయినను క్రమంగా రుణగ్రస్తులు అయ్యి దరిద్రులు అగును. కావున యోగ్యమైన భూమి యందే గృహనిర్మాణం చేయవలెను .
* వాయువ్యమునకు గాని , ఆగ్నేయమునకు ముఖం కలిగి ఆ దిక్కుగా కట్టిన గృహము అగ్నిచే దహించబడును అని భృగుమహర్షి తెలియచేసెను . ఈశాన్య నైరుతి దిశలకు అభిముఖము కలిగి దిశతిరిగినట్టు కట్టిన గృహము నాశనం పొందును. కలహములచే ఎల్లప్పుడూ పీడించబడును.
* గృహారంభం పగటిపూట మధ్యాహ్నానికి పూర్వమే చేయవలెను . మధ్యాహ్నం నందు మరణప్రదం . సంధ్యాసమయం , రాత్రికాలం నందు ఐశ్వర్యం కోరువారు చేయకూడదు .
* రాత్రియందు శంఖుస్థాపన చేసినచో గృహహాని .
* రాత్రిని నాలుగు భాగములు చేసి అందు నాలుగోవ బాగం యందు ఘడియలలో గృహారంభ ప్రతిష్ట చేయవచ్చు అని విశ్వకర్మ తన వాస్తుశాస్త్రం నందు తెలియచేశారు.
* భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహారంభాలు చేయకూడదు . అలా చేసినచో గర్భహాని మరియు గృహహాని జరుగును. అలా చేయవలసివచ్చించో 5 మాసాల తరువాత చేసుకోవచ్చు.
* గర్బము ధరించిన స్త్రీ యొక్క భర్త సింధు స్నానం , చెట్లు నరకుట , క్షౌరము , శవమును మోయుట , విదేశీయానం నిషిద్దం .
* నూతన గృహములు నిర్మించుకొనువారు నిర్మాణానికి కొత్త కలపనే వాడవలెను . పాత గృహం కలప , కాలిన కలప వాడరాదు.
* విష్ణు ఆలయములకు వెనక భాగం , ఈశ్వరాలయంకు ఎదుటను , శక్తి ఆలయములకు పక్క భాగములలో , వీధి శూలల యందు గృహం నిర్మించరాదు.
* గృహము నందు మూడు ద్వారములు , మూడు మంచములు , మూడు దీపములు , 3 కిటికీలు ఉన్నచో ఆ గృహము దుఃఖప్రధమం అగును.
* గృహము యొక్క గోడ దళసరి 12 భాగములు చేయగా లోపలి వైపు 7 భాగములు వెలుపలి వైపు 5 భాగములు ఉంచి మధ్య యందు ద్వారం ఉంచవలెను .
* ద్వారము లేనిది కూపం అనియు , ఒక ద్వారం కలిగినదానిని దిగుడు బావి అనియు నాలుగువైపులా మెట్లు ఉన్నదానిని పుష్కరణి అని అంటారు. అదేవిదంగా పొడవుగా ఉన్నదానిని దీర్గికా అనియు , ఎల్లప్పుడూ నీరు ఉండేదాన్ని కుల్యం అని కూడా అంటారు.
* లోగిలి యందు నీరు తూర్పుదిశకు వెళ్ళుట వృద్ధికరం . ఉత్తరదిశగా వెళ్లుట ధనప్రదం , పడమట దిశ యందుట ప్రవహించుట ధనక్షయం , దక్షిణదిశకు నీరుపోవుట మృత్యుపదం .
* గృహనిర్మాణం చేయు భూమి దక్షిణ , పశ్చిమాలు ఎత్తుగా ఉండటం శుభపరిణాము . తూర్పు , ఉత్తరములు పల్లముగా వుండవలెను .
* తిధి వృద్ది క్షయముల యందు , రోగగ్రస్తులగా ఉన్నప్పుడు , భయంతో కూడిన పరిస్థితులు ఉన్నప్పుడు , రాజాటంకం కలిగినప్పుడు , భార్య గర్భిణిగా ఉన్నప్పుడు, తనకు గ్రహస్థితి బాగాలేనప్పుడు , దుస్వప్నములు , దుశ్శకునాలు కనిపించినప్పుడు , ఇంట్లో మైల ఉన్నప్పుడు , అమావాస్య దగ్గర్లో , వర్జ్య ఘడియల్లో శంఖుస్థాపన నిషిద్దం .
* గృహం అతిఎత్తైనది అయితే చోరభయం , అతికూరచ అవుటవల్ల దరిద్రం , అతి వెడల్పు వలన మరణం సంభంవించును.
* ఆయష్షు కోరుకునే వారు తూర్పుముఖంగా , కీర్తికాముకులు దక్షిణముఖముగా , ఐశ్వర్యకాముకులు పడమటి ముఖంగా కూర్చుని భోజనం చేయవలెను . శార్ధకర్మలు యందు కాక మరే సమయంలోను ఉత్తరాభిముఖంగా భోజనం చేయరాదు . తల్లితండ్రులు జీవించి ఉన్నవాడు , తల్లి కాని తండ్రి కాని జీవించి ఉన్నవాడు కూడా దక్షిణ ముఖంగా తిరిగి భోజనం చేయరాదు . ఇదియే గృహము నందు భోజన నియమము .
* స్వగృహము నందు తూర్పు తలగడ , అత్తవారింట దక్షిణ తలగడ , ఇతరచోట్ల పడమర తలగడ పెట్టుకుని పడుకోవలెను . ఉత్తర తలగడగా ఎప్పుడూ పడుకోగూడదు .
* గడ్డియందు , దేవాలయం , పాషాణం , పల్లపు ప్రదేశం , మార్గము, ద్వారం, గృహమధ్య ప్రదేశం , ఒంటరిగా , స్మశానం , నాలుగు దార్లు కలిసేచోట , ఇంటి దూలం క్రింద , తన మరియు పర స్త్రీల సమీపం నందు పడుకోరాదు.
* గృహమధ్యమం నందు వృక్షాలు ఉండరాదు.తులసి ఉండవచ్చు.
No comments:
Post a Comment