పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల
సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు.
* విషము కలిసిన అన్నమును అగ్ని యందు వేసిన ఛటఛటమను ధ్వని కలుగును. నెమలి కంఠము నందలి రంగు వలే పొగ వెలువడును. ఆ పొగని భరించుట చాలా కష్టం అగును. మంటలు కలిసి ఉండక విడివిడిగా వెలువడును. చకోర పక్షి విషము కలిసిన అన్నమును చూసిన వెంటనే ఎర్రగా ఉండు దాని నేత్రములు తెల్లబడును. కోకిలకు స్వరము చెడిపొవును.
* విషము కలిసిన ఆహారము నుండి వెలువడు ఆవిరి తగిలినచో హృదయము నందు బాధ , కనులు తిరుగుట, తలనొప్పి తగ్గును. ఇటువంటి సమయంలో చెంగల్వకోష్టు , ఇంగువ, వట్టివేర్లు , తేనె చేర్చి నశ్యము చేయించవలెను .
* విషము జీర్ణాశయం నందు చేరినపుడు ఒళ్లంతా మంటలు , అతిసారం, కడుపులో గూడ గూడ మనుట , శరీరం తెల్లబడుట జరుగును.
* మద్యము నందు , జలము విషము కలిసిన ద్రవం నందు గీతలు , నురుగు, బుడగలు కలుగును. విషము కలిసిన ద్రవము నందు మన శరీరఛాయ కనపడదు. ఒక వేళ కనిపించిన జంట నీడలుగా , రంధ్రములతో కూడినట్టుగా , పలుచగా , వికృతాకారముగా కనపడును.
* కూరలు , పప్పులు , అన్నము, మాంసము అను వాటి యందు విషము కలిసిన చితచితలాడుచూ రుచిని కోల్పోయి చద్దివానివలే దుర్గన్ధమును కలిగి ఉండును. అన్ని పండ్ల యందు కూడా విషపూరితం అయినపుడు వాటికి ఉండు సహజసిద్ధ రుచి , సువాసన కోల్పోవును. పచ్చికాయలకు విషము తగిలిన వెంటనే పండును. పండిన వానికి విషము తగిలిన వెంటనే కుళ్లిపోవును.
* దంతములకు తగిలిన దంతములు విరిగిపోవును. నాలుక , పండ్లచిగుళ్ళు , పెదవులు వాచును .
* తలకు పూయు నూనె యందు విషము కలిసిన ఆ నూనె జిగటలుగా సాగును. నూనె చిక్కబడి రంగు మారును . అది శరీరముకు తగిలిన పొక్కులు పుట్టి బాధ కలుగును. పొక్కుల నుంచి స్రావం కలుగును. చర్మం పుండు అగును. చెమటలు పుట్టును . జ్వరం కలుగును. మాంసం విడిపోవును. నలుగుపిండి , స్నానం చేయు జలము , తలస్నానం చేయు కుంకుడు రసం నందు కూడా విషం కలిసిన పైన చెప్పిన లక్షణాలు కలుగును.
* విషము కలిసిన లేపము తలకు పూసిన జుట్టు ఊడిపోవును. తలయంతయు బాధ కలుగును. కన్ను , ముక్కు, చెవి మొదలగు రంధ్రముల నుంచి రక్తం కారును . శిరస్సు నందు గడ్డలు లేచును .
* ముఖమునకు పూసుకోను ముఖలేపనం నందు విషము కలిసిన ముఖం కమిలినట్లు అగును. తామర కాడపైన ఉండే విధంగా సన్నని ముళ్ళు వంటివి ముఖంపైన లేచును .
* ముక్కుతో పీల్చే వాటి యందు విషము కలిసిన శరీర రంధ్రముల నుంచి రక్తం బయటకి వచ్చును. శిరోభాధ , కఫం బయటకి కారుట జరుగును.
* పువ్వులకు విషము తగిలినచో వాటి సువాసన కోల్పోవును . వర్ణం మారును , వాడిపోవును . విషము సోకిన పువ్వుల వాసన చూసిన శిరోభాధ కలిగి నేత్రముల యందు నీరు చేరును .
* చెవిలో వేసుకోను తైలం నందు విషము కలిసిన వికృతి కలిగి ధ్వని గ్రహించు శక్తి తగ్గును. చెవి యందు వాపు , పోట్లు , రసి కారుట కలుగును.
* కంటికి పెట్టుకొను కాటుక యందు విషము కలిసినచో కన్నీరు జిగురుగా మారును , కనులు మండును . గుడ్డితనం కూడా కలుగును.
* పాదుకలు యందు విషం ఉన్నచో పాదముల యందు వాపు , రసికారుట, పాదములు మొద్దుబారుట, పొక్కులు కలుగుట అను లక్షణములు సంభంవించును.
* నగల యందు విషము కలిసిన అవి మాములుగా ప్రకాశించవు . కాంతి తగ్గి ఉండును. ధరించిన శరీరభాగాలను హింసించును. వొళ్ళంతా మంటలు కలుగచేయును . చర్మం, మాంసం ఊడిపడును.
No comments:
Post a Comment