Monday, January 31, 2022

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

     షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను . 

 *  మధుర రసము గుణము - 

       మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును . 

        దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును . 

 *  ఆమ్ల రసము గుణము - 

      ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును . 

         దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి  విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును . 

 *  లవణ రసము గుణము - 

      ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును . 

        దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును . 

         

No comments:

Post a Comment