Wednesday, January 10, 2024

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు -

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు - 

     "అన్నం పరబ్రహ్మ స్వరూపం" కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .

  భోజన నియమాలు - 

 * భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను 
ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .

 * తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు . 

 * ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.

 * ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .

 * ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు . 

 * పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.

 * భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను . 

 * ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను . 

 * రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా 
ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .

 * భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . " నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి " అన్నది నీతిశాస్తం వివరించింది.

 * మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .

 * ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .

 * ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం "ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి " అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది. 

 * రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును 

 * చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు . 

 * మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు. 

 * మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు 
అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.

 * ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా 
భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం . 

 * భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .

 * ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం . 

 * ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .

 * ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను . 

 * బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.

 * వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది . 

 * కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.

  * స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును . 

 * అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును. 

 * గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు . 

 * అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును . 

 * మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.

 * మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.

 * రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.

 * పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .

 * తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు . 

  
  

No comments:

Post a Comment