Tuesday, January 23, 2024

హార్ట్ఎటాక్', పక్షవాతము ఎలా వస్తుంది ? దానికి నివారణ మార్గాలు ఏమిటి?*

✍️ *'హార్ట్ఎటాక్', పక్షవాతము ఎలా వస్తుంది ? దానికి నివారణ మార్గాలు ఏమిటి?*

విన్నపం: పోస్టు చూడగానే అమ్మో... ఏంటి ఇంత ఉంది.. ఇంత మ్యాటర్ ని చదివే అంత ఓపిక మాకెక్కడ ఉంది అని పక్కన పడేయకండి. కొంచెం ఓపిక ఉంచి మొత్తం చదవండి. మీ ఆరోగ్యం కోసమే కదా.. అందులో ఈ సమస్యలు చిన్నవి కాదు కదా. ప్రాణాంతకమైనవి కాబట్టి మొత్తం తెలుసుకోవాలి.

✍️ *వివరణ:*

 👉మన దేహములోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరాచేయ డానికి సహకరించేది గుండె! 

👉ఈ గుండె పనిచేసే విధానము- పంప్ (నీళ్ళు మొదలగు ద్రవాలను తోడే యంత్రము) లాగా వుంటుంది. 

👉పంపింగ్ మిషన్ వలెనే- గుండెలో కవాటాలు (Valves) వుంటాయి.

👉 అశుద్ధ రక్తాన్ని- శరీర భాగాల నుండి గుండెకు చేర్చే నాళాలను "శిరలు (Veins)"అనీ, గుండెనుండి శరీర భాగాలకు మంచిరక్తాన్ని చేర్చే గొట్టాలను-"ధమనులు(Arteries)" అనీ అంటారు.

👉 రక్తము ద్వారా.... ప్రాణవాయువు(ఆక్సిజన్)ను శరీర భాగాలకు అందించడమూ; అదే విధముగా కార్బన్ డై ఆక్సైడ్ (బొగ్గు పులుసు వాయువు)ను, ఇంకా మిగతా మలినాలను ఊపిరితిత్తు (Lungs)లకూ, మూత్రపిండా(కిడ్నీస్)లకూ చేర వేయడములో ప్రముఖ పాత్ర వహించేవి- ఈ ధమనులు, శిరలే!

👉మానవ దేహము సక్రమముగా పనిచేయడానికి రక్తమెంత అవసరమో.... గుండె సక్రమముగా పని చేయాలన్నా కూడా అంతే రక్తము అవసరమౌతుంది.

👉 గుండె కండరాలకి రక్తాన్ని సరఫరా చేసే నాళాలని "కొరొనరి ఆర్టెరీస్ (Coronary Arteries)” అని అంటారు. 

👉ఏ కారణముచేతనైనా సరే గుండె కండరాలకు రక్తము సరఫరా కాకపోతే.... గుండెలో ఆ ప్రాంతములోని కండరాలు మృతి జెందుతాయి. దీనినే- "గుండెపోటు (హార్ఎటాక్)" అని అంటారు.

👉 ఈ పరిస్థితిలో గుండెలోని.... రక్తము అందని కండరము ఏదైతే వుందో అది పని చేయడం ఆగుతుంది.

👉 గుండె కండరాలకు రక్తాన్ని అందించే పెద్ద నాళానికి ఏ గడ్డ కట్టిన ర క్తమో అడ్డుపడితే.... గుండెలోని కండరాలలో అధిక భాగము చెడిపోతాయి. ఈ విధానాన్నే- "మాసివ్ ఎటాక్ (Massive Attack=అధిక గుండెపోటు)" అంటారు.

👉 ఇదే విధముగా చిన్న ర క్తనాళాలకు గడ్డ కట్టిన రక్తము అడ్డుపడితే- గుండెలో కొద్ది కండరాలు మాత్రమే పనిచేయవు. మిగతా కండరాలు పనిచేస్తాయి కాబట్టి మనిషి బ్రతకడానికి అవకాశం ఏర్పడుతుంది.

👉పై విధముగానే- మెదడుకు రక్తము చేరుటలో అవరోధ మేర్పడి, ఏ కొద్ది క్షణాలు ఆలస్యమైనా- మెదడులోని నాడీ కణాలు కొన్ని చనిపోయి, పక్షవాతము వస్తుంది.

👉 అంటే- గడ్డకట్టిన రక్తము రక్తనాళాలలో ప్రయాణిస్తూ మెదడుకు చేరు రక్తనాళాలకి అడ్డుపడితే పక్షవాతము మరియూ గుండెను చేరే రక్తనాళాలకి అడ్డుపడితే- గుండెపోటు వస్తుంది.

✍️ *గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?*

👉ప్రతిరోజూ.. క్రమము తప్పకుండా కొంతమేరకు అలసిపోయే దాకా- శారీరక వ్యాయామాలు చేస్తూ వుంటే.... గుండెపోటు, పక్ష వాతములకు దూరముగా వుండవచ్చును. 

👉వ్యాయామము వలన రక్తప్రసరణ విస్తారముగా జరగడమే గాక గుండె కండరాలు, శారీరక కండరాలు గట్టిపడతాయి.

👉 అంతేగాక గుండె కండరాలకు కూడా రక్తప్రసారము ఎక్కువగా ఉండటమువలన- గుండె చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకొంటుంది. 

👉ఈ విధముగానే రక్తప్రసారము మెదడుకు అధికముగా ఉండటము వలన- ప్రాణవాయువు తగినంతగా లభిస్తుంది. 

✍️ *వ్యాయామము చేయుటవలన ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.*

👉 వ్యాయామ సమయములో.... కండరాలు కుదించుకుపోయి నపుడు (సంకోచించడము)- కండరాలలోని రక్తమంతా శిరల ద్వారా గుండెను చేరి పరిశుభ్రపడుతుంది. 

👉ఇలా శుభ్రపడిన రక్తమంతా- కండరాలు విస్తరించినపుడు (వ్యాకోచించినపుడు) ఆ కండరాలకు చేరుతుంది. 

👉ఈ విధముగా జరుగుటవలన రక్తములో ఆక్సిజన్ అధికముగా జేరి, శారీరక ఆరోగ్యము మరింత మెరుగుపడుతుంది.

👉క్రమము తప్పకుండా శారీరక వ్యాయామాలు చేసేవారిలో అధిక సంఖ్యాకులు- హృద్రోగ నిపుణులేనని చెప్పాలి. ఎందుకంటే వీరికి తెలిసినంతగా- "వ్యాయామము విలువ" ఇంకెవరికీ తెలియక పోవడమే!

👉వ్యాయామము చేయడమువలన అధిక రక్తప్రసరణ అవసరమౌతుంది. కాబట్టి- రక్తనాళాలు కొద్దిగా సాగి, వాటి చుట్టు కొలత కూడా కొంచెము పెరుగుతుంది. ఈ పరిణామము వలన మామూలుకంటే అధిక స్థాయిలో రక్తము - నాళాలగుండా కండరాలకు సరఫరా ఔతుంది. 

👉శరీరము అలసిపోకుండా- 2 గంటలసేపు వ్యాయామము చేసినా, శరీరము అలసిపోయేటట్లుగా అరగంట సేపు చేసినా ఒకే విధమైన ఫలితము లభిస్తుంది. కాబట్టి- బాగా శ్రమతో కూడిన ఈత, టెన్నిస్, నాట్యములాటి ఆటలు గానీ ఆసనాలు, బాడీ బిల్డింగ్టి వ్యాయామాలుగానీ చేస్తే- గుండె, రక్తనాళాలకు మంచి ప్రయోజనము చేకూరుతుంది.

👉ప్రతిరోజూ క్రమము తప్పకుండా వ్యాయామము చేసే వారి గుండె- వ్యాయామము చేయనివారి గుండెకంటే.... తక్కువ సార్లు కొట్టుకొంటుంది. ఈ విధముగా రోజులో తక్కువ సార్లు గుండె కొట్టుకొనడమంటే.... మంచి కండీషన్ లో గుండె పని చేస్తుందని అర్థము! గుండె ఇలా తక్కువసార్లు కొట్టుకొన్నప్పటికీ.. రక్తము శరీర భాగాలకు సమృద్ధిగానే సరఫరా చేయగలుగుతుంది.

👉వ్యాయామము చేయనివారికి గుండెజబ్బులు రావడము సర్వసాధారణం అయింది.

👉 అంతేగాక పొగ త్రాగడము, మద్యపానము, స్థూలకాయములకంటే- వ్యాయామము చేయక పోవడము వల్లనే.... గుండెజబ్బులు అధికముగా వస్తున్నాయని అనేక పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది.

👉వ్యాయామము చేయడము వలన రక్తములో వుండే గుండెజబ్బులకు కారణభూతమయ్యే- "ట్రై గ్లిసరైడ్స్ (Triglycerides)” మరియు "కొలెస్టరాల్ (Cholesterol)" అనునవి అధిక శాతము తగ్గిపోతాయి.

👉ఒకసారి గుండెపోటు వచ్చి ప్రాణాపాయమునుండి తప్పు కున్నవారు కూడా క్రమము తప్పకుండా వ్యాయామము చేస్తూ వుంటే.... తిరిగి వచ్చే గుండెపోటునుండి రక్షణ ఏర్పరుచుకున్న వారు కాగలరు.

✍️ *గుండెజబ్బులు రాకుండా ఎలాంటి ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి.?*

👉రక్తములో ట్రై గ్లిసరైడ్స్, కొలెస్టరాల్ లు అధికమైనపుడు.... రక్తనాళాలయొక్క లోపలి రంధ్రాలు సన్నబడిపోయి, గుండె కండ రాలకు కావలసినంత రక్తాన్ని సరఫరా చేయలేవు. 

👉అంటే- ఈ పరిస్థితిలో గుండె అధికముగా పనిచేయవలసిన అవసరము వున్నదన్న మాట! ఈ విధముగానే చిన్న రక్తనాళాలలో కూడా రంధ్రాలు సన్నబడి, రక్తప్రవాహానికి ఆటంకము ఏర్పడవచ్చును. ఇటువంటి పరిస్థితులలోనే- హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా వుంటాయని చెప్పాలి. 

✍️ *ఈ క్రింది కొన్ని అంశాలను గమనించండి:*

👉 మనము నిత్యజీవితములో పాలు, వెన్న, నెయ్యిలాటి జంతు సంబంధమైన క్రొవ్వులలోనూ, కార్బోహైడ్రేట్స్(పిండి పదా ర్థాలు)లోనూ, కొలెస్టరాల్, టైగ్లిసరైడ్స్ అధికశాతము వుంటాయి.

👉 గుండెజబ్బులకు జాగ్రత్తపడువారూ మరియూ గుండెజబ్బులు రాకుండా ముందు జాగ్రత్త కొరకూ వీటి వాడకము బాగా తగ్గించాలి. అంటే.... అధికశక్తి (కాలరీలు) నిచ్చే పదార్థాలకు ప్రతివారూ దూరంగా ఉండాలి.

👉సాధారణముగా చాలామంది "కొంచెము నీరసముగా వుందండీ! అందుకే.... కొద్దిగా 'తేనె'ను- 'గ్లూకోస్'లో కలిపి త్రాగుతున్నాను!" అని అంటూ వుంటారు. వాస్తవానికి ఈ రెండు కూడా గుండెజబ్బుల వారికి నిషేధమే! కారణమేమిటంటే- ఇవి అధిక కాలరీల నిచ్చే పదార్థాలు!

👉కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ లాంటివి శరీరములో అధికముగా తయారైనప్పుడు "ఆర్టీరియో స్క్లెరోసిస్ (Arterio sclerosis=రక్తనాళ కాఠిన్యము)"వస్తుంది. కాబట్టి- మనము జీవితములో క్రొవ్వు పదార్థాలు, పిండిపదార్థాలు తక్కువగా వున్న ఆహారాలను తీసికోవాలి.

👉లావుగా వున్నవారిలోనే కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ లాటివి ఉంటాయనే ఒక అభిప్రాయము వున్నది. ఇది చాలాభాగము యథార్థమైనప్పటికీ- సన్నగా వున్నవారిలో ఈ పదార్థాలు వుండ వనుకోవడము చాలా పొరపాటు. కాబట్టి- ప్రతివారూ తరుచుగా రక్తపరీక్షలు చేసికొంటూ కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎంత శాతము వున్నదో తెలిసికోవడము చాలా మంచిది. 

👉ఇవి ఎక్కువగా వున్నప్పుడు వైద్య సలహాల ననుసరించి- ఆహారములో తగు జాగ్రత్తలను పాటిస్తూ వుంటే.... రక్తములో అధికముగా వున్న కొలెస్ట రాల్, ట్రైగ్లిసరైడ్స్ ను తగ్గించుకొనవచ్చును.

👉ఆహార నియమాలను సక్రమముగా ఆచరించినా, కొలెస్టరాల్, ట్రైగ్లిసరైడ్స్ శాతము తగ్గనపుడు.... వైద్య సలహాల ప్రకారము- వారి పర్యవేక్షణలో .... మందులను తప్పనిసరిగా ఉపయోగించాలి.

✍️ *స్థూలకాయము వల్ల గుండెపై ఎలాంటి ప్రభావము చూపుతుంది:*

👉 మామూలుగా వున్నవారికంటే, లావుగా వున్నవారికి గుండె పోటు, పక్షవాతము లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు హెచ్చుగా వుంటాయి.

👉స్థూలకాయుల శరీరభాగాలన్నిటికీ రక్తప్రసారము సక్రమముగా జరగడానికి గుండె అధికముగా శ్రమపడవలసి వుంటుంది. దీని మూలముగా వీరిలో రక్తపోటు (B.P.) పెరిగే అవకాశాలు మెండుగా వుంటాయి. B.P. అధికమైనా గుండెపోటు, పక్షవాతము లాటివి వచ్చే అవకాశమున్నది.

👉 స్థూలకాయము వలన.... సన్నటివారు చేసినంత బాగా వీరు వ్యాయామము చేయలేరు. అంటే లావుగా వుండటమనేది వ్యాయామానికి కూడా.... శత్రువే నన్నమాట! అందువల్లనే వ్యాయామము వలన- గుండెకు, రక్తనాళాలకు జరిగే ఉపయోగము వీరిలో తక్కువగా కనిపిస్తుంది.

✍️ *B.P. గుండెకు కలిగించే హాని:*

👉రక్తములో వున్న కొలెస్టరాల్ మరియు ట్రైగ్లిసరైడ్ అధికమైనపుడు- రక్తనాళ రంధ్రాల లోపలి గోడలకు ఇవి అంటుకొని మందమైపోయి, రంధ్రాలు సన్నబడతాయి. ఇలా సన్నబడిన రంధ్రాలనుండీ రక్తాన్ని గ్రహించడానికి గాని, పంపడానికి గాని, గుండె అధిక శ్రమ చేయవలసి వుంటుంది. రక్తము ఎంత బలము (Force)గా నెట్టబడుతుందో అనే విషయాన్ని రక్తపోటు (Blood Pressure)ను కొలిచే "స్ఫిగ్మొమానొమీటర్ (Sphygmomano meter)" ద్వారా తెలిసికొంటారు. రక్తనాళాల రంధ్రాలు ఎంత సన్నబడితే- గుండెకు అంత శ్రమ అధికమౌతూ వుంటుంది.

👉 రక్తపోటును మామూలువారు "B.P."అని అంటుంటారు. దీనినే వైద్య పరిభాషలో "హైపర్ టెన్షన్ (Hyper tention)” అంటారు.

👉 వంశపారంపర్యముగా కూడా రక్తపోటు వచ్చే అవకాశమున్నదని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.

👉'బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అంటే.... రక్తపోటు పెరగడము (హైపర్ టెన్షన్) వున్నపుడు కలిగే బాధలు.... బ్లడ్ ప్రషర్ తగ్గడము అంటే... "హైపోటెన్షన్ (Hypotension - Low Blood Pressure)” వున్నపుడు వుండవు. 

👉40, 50 సంవత్సరాలలోపు వయసున్న పురుషులలో 20 శాతము మంది రక్తపోటుతో బాధల ననుభవిస్తున్నట్లుగా వైద్య శాస్త్రవేత్తల విస్తృత పరిశోధనలలో తేలిన అంశము!

👉మామూలుగా ఏదైనా అతి ముఖ్యమైన పని చేసేటపుడు గానీ, కొన్ని ప్రమాదాలు జరిగినపుడు, జరుగుతాయని భావించి నపుడు.... నాడీ ప్రమాణము (Pulse Rate) మామూలుకంటే అధిక ముగా పెరుగుతుంది. 

👉50 సంవత్సరములు దాటిన స్త్రీ పురుషులలో- "డయాస్టాలిక్ ఫ్రషర్ (Diastolic Pressure- హృదయ స్ఫురణము)” నిమిషానికి 100 మించితే మాత్రము- వెంటనే వైద్య పర్యవేక్షణలో వుండి, తగిన మందులు వాడవలసి వుంటుంది.

👉ప్రతి చిన్న విషయానికి కోపము, విసుగు.. ప్రతి సంఘటనకు భయపడటము, ప్రతి చిన్నపనికి నిస్సత్తువతో అలసిపోవడము, పనిలో ఏకాగ్రత లోపించడము, తలనొప్పి, నిద్రలేమి లాటి లక్షణాలను రక్తపోటు పెరిగినవారు అనుభవిస్తూ వుంటారు. 

👉రక్త పోటు పెరిగిన ప్రతివారిలోనూ ఈ బాధలన్నీ కనిపించాలనే నియమమేమీ లేదు. వీటిలో ఏ ఒక్క లక్షణము కనిపించినా వెంటనే వెద్యుని పర్యవేక్షణలో రక్తపోటు ఎంత ప్రమాణములో వున్నదో చూపించుకోవటము మంచిది. 

👉రక్తపోటు పెరిగిందని తేలినపుడు వీరికి ముందుగా మందులు ఉపయోగించకుండా.... ఆహార విహారాలలో కొన్ని మార్పులను సూచించి పంపుతారు వైద్యులు ! ఈ మార్పులవలన- ఆశించిన ప్రయోజనము కలగకపోతే.... సంబంధిత ఔషధాలను వాడి, B.P.ని మామూలు ప్రమాణానికి తీసికొని రావడము జరుగుతుంది.

👉వైద్య సలహాలను ఆచరించుటలో అశ్రద్ధ చేసినా, వైద్య సలహాలు తీసికోకపోయినా అధిక రక్తపోటు వలన అనేక అనర్థాలు చవి చూడవలసి రావచ్చును.

 ఉదాహరణకు:- దీని ప్రభావము గుండెమీద- గుండెపోటు రూపములోనూ, మెదడుమీద పక్ష వాతము రూపములోనూ చూపించే ప్రమాదమున్నది. కొన్నిసార్లు వీటివలన హఠాత్మరణాలు సంభవించిన సంఘటనలుకూడా మనలో కొంతమందికి ప్రత్యక్షానుభవముండే వుంటుంది.

✍️ *ధూమపానము కారణంగా గుండెజబ్బులు:*

👉ధూమపానప్రియులకు, గుండెజబ్బులకు చాలా దగ్గర సంబంధాలున్నాయని చెప్పవచ్చును.

👉 ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్)తో మరణించేవారిలో అధిక సంఖ్యాకులు ధూమపాన ప్రియులే! అదే విధముగా గుండెజబ్బులతో మరణించేవారిలో.... అధిక సంఖ్యాకులు- ధూమపానము అలవాటున్న వారేనని చెప్పవచ్చును.

👉ధూమపానమువలన- చిన్న రక్తనాళాలలో రక్తము గడ్డ కట్టే అవకాశాలు అధికముగా వున్నాయి.

👉పొగాకు సంబంధమైన చుట్ట, బీడి, సిగరెట్ లాటి పొగలో.... "కార్బన్ మోనాక్సైడ్ (Carbon Monoxid)" అనే పదార్థము వుంటుంది. ఈ పదార్థము- రక్తములో కలసి, "కార్బాక్సి హెమోగ్లోబిన్ (Carboxyhemoglobin)' అనే రూపములో వుంటుంది. దీనివలన రక్తము గ్రహించవలసిన మేరకు ప్రాణవాయువును గ్రహించలేదు. ఈ పరిస్థితులలో- శరీరానికి ఆవసరమైన ప్రాణవాయువును అందించడానికి.... గుండె విపరీతమైన శ్రమ పడవలసి వుంటుంది.

👉సంపూర్ణ ఆరోగ్యాన్ని అభిలషించే ప్రతివారు - ధూమపాన వ్యసనాన్ని క్రమక్రమముగా దూరము చేసికోవలసిన అవసరం ఎంతైనా వున్నది. 

✍️ *మానసిక ఒత్తిడుల వలన గుండెపోటు:*

👉 గుండెజబ్బులకు కారణమైన అనేక అంశాలలో మానసిక ఒత్తిడులు కూడా చాలాభాగము కారణము వహిస్తాయని చెప్పవచ్చును. 

👉గుండెపోటు ఒక్క సారిగా రాదు. దీనికి 6 నెలల ముందు నుండి రక్తనాళాలలో విపరీత మార్పులు కనిపించి, ఆ తరువాతనే- గుండెకు సంబంధించిన కొన్ని అనర్థాలు కనిపిస్తాయి.

👉గుండెజబ్బులు రావడానికి- మానసిక ఒత్తిడులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి అని కొన్ని పరిశోధనల ద్వారా తెలిసింది.

👉మానసిక ఒత్తిడి అధికమైనపుడు- "ఎడ్రినల్ హార్మోన్లు" అధికముగా జనించి, రక్తములో కలుస్తాయి. వీటి ప్రభావముతో- "ఫాటీ యాసిడ్స్ (Fatty Acids= క్రొవ్వు ఆమ్లాలు)" అధికమై, రక్తనాళ రంధ్రాల లోపలి గోడలకు అంటుకొని.... రంధ్రాల వైశాల్యము తగ్గిపోయి, సన్నగా ఔతాయి. దీనితో- గుండెకు సరిపోయే రక్తము అందక.... గుండెపోటు వచ్చే ప్రమాదమున్నది.

👉మన జీవిత విధానాన్ని ఏమాత్రము మార్చుకోగలి గినా.... మానసిక ఒత్తిడులు, ఆందోళనల నుండి చాలావరకు తప్పుకోవచ్చు.

👉కొంతమంది- "నిన్న అలా జరిగినది! రేపు కూడా అదేవిధముగా జరగదని గ్యారంటీ ఏమిటి?" అని- ఊరకనే మానసిక ఆందోళనలను పొందుతూ వుంటారు. ప్రతివారు ఇలాటి ఆందోళనల నుండి దూరముగా వుండటము ఎంతో అవసరము.

👉 "నిన్న జరిగినట్లే- రేపు ఎందుకు జరగాలి? నిన్నటి అనుభవముతో- రేపు జాగ్రత్తగా వుండాలి!" అనే ఆత్మవిశ్వాసము పెంచుకొని, జీవితాన్ని వ్యథాభరితము కాకుండా చూసుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించిననాడు.... మానసిక ఒత్తిడులు, ఆందోళనలు లాంటివి దరి చేరవు.

✍️ *శవాసనముతో... మానసిక, శారీరక ఆరోగ్యము!*

👉మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము మొదలగు వాటిని పొందడానికి- "యోగాసనాలు" చాలావరకు సహకరిస్తాయని చెప్పవచ్చును.

👉 ముఖ్యముగా గుండె, రక్తనాళాలు, ఊపిరితిత్తులు సక్రమముగా పనిచేయడానికి- "శవాసనము" చక్కగా సహకరిస్తుంది. 

👉ఈ ఆసన సాధన వలన- శరీరానికి, గుండెకు కావలసినంతవరకు రక్త ప్రసరణ జరిగి, మానసికోత్సాహము అభివృద్ధి జెందుతుంది. ఇంకా- శారీరక విశ్రాంతి కూడా లభిస్తుందని చెప్పవచ్చును.


No comments:

Post a Comment