Monday, January 31, 2022

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 1

     షడ్రసములు అనగా 6 రకాల రుచులు . ఈ ఆరురకాల రుచులు మన ఆహారములో భాగములై ఉన్నవి . ఇప్పుడు మీకు ఒక్కోరసము యొక్క ప్రాధాన్యత వాటి గుణాలు మరియు అతిసేవనం వలన కలుగు దుష్ప్రభావాల గురించి సంపూర్ణముగా వివరించెదను . 

 *  మధుర రసము గుణము - 

       మానవశరీరమునకు పుట్టుక నుండి మధురరసము కలగలసిపోయినది . ముందుగా తల్లిపాలు మధురంగా ఉండి త్వరగా జీర్ణం అగును . అదియే పుట్టిన బిడ్డకు ప్రాధమిక ఆహారము . ఇది ఓజోవర్ధకము అనగా రోగనిరోధకశక్తిని పెంచునది అని అర్ధము . మధురరసము సర్వ ధాతువృద్ధిని కలిగించును . శరీరముకు బలము మరియు మంచి రంగును ప్రసాదించును .దీర్గాయువుని ఇచ్చును . మనస్సుతో పాటు పంచేంద్రియాలకు ఆనందాన్ని కలిగించును . వాతాన్ని మరియు పిత్తాన్ని హరించును . విషాన్ని హరించును . దప్పికను పోగొట్టును . చర్మమును స్నిగ్ధపరుచును . వెంట్రుకలను పెంచును . కంఠస్వరం బాగు చేయును . అభిఘాతము ( దెబ్బలు ) నందు , శరీరము శుష్కించినప్పుడు ఇది మంచి రసాయనంగా పనిచేయును . 

        దీనిని అతిగా ఉపయోగించిన అతిస్నిగ్థత ( శరీరం జిడ్డు పట్టుట ) , సోమరితనం , శరీరము బరువు పెరుగుట , అతినిద్ర , శ్వాసము , కాసము మొదలైన వాటిని కలిగించి గ్రంథి , బోధ మున్నగు కఫవ్యాధులను కలిగించును . 

 *  ఆమ్ల రసము గుణము - 

      ఆమ్లరసము నాలుకకు తగిలిన వెంటనే నోటివెంట అధికంగా నీరుకారి దంతములు పీకునట్లు అగును . ఇది ఆకలిని వృద్ధిచేయును . ధాతువృద్ది చేసి మనస్సుకు ఉత్సాహం ఇచ్చును . ఇంద్రియాలకు బలమును ఇచ్చును . తృప్తిని కలిగించును . ఆహారమునకు స్నిగ్ధత కలిగించి జీర్ణం అగుటకు సహాయం చేయును . 

         దీనిని మితిమీరి ఉపయోగించిన పిత్తమును వృద్ధిచేసి రక్తమును దోషము చెందించి  విద్రది , వ్రణములను పక్వము చేయును . శరీర అవయవాలను శైధిల్యం చెందించి శోధము , కంఠము నందు మంట , రొమ్ము , హృదయము ల యందు ఇబ్బందులను కలుగచేయును . 

 *  లవణ రసము గుణము - 

      ఇది రుచిని కలుగచేయును . ఆకలిని పుట్టించును . జీర్ణమగును . వాతాన్ని నిరోధిచుటను పోగొట్టును . ఉష్ణతత్వము కలిగి ఉండును . 

        దీనిని అధికంగా సేవించిన పిత్తము ప్రకోపించి దప్పిక , మంట , కన్నీటిని కలిగించుటయే కాక శరీర మాంసం చెడగొట్టి కుష్ఠు వ్యాధి కలిగించును . ఇది శరీరము నందు విషమును వృద్దిచేయును . వ్రణములను పగులునట్లు చేయును . దంతములు కదులున్నట్లు చేయును . పుంసత్వము పోగొట్టును . ఇంద్రియశక్తిని తగ్గించును . శరీరకాంతిని పోగొట్టును . వెంట్రుకలు నెరియుట , బట్టతల , చర్మము నందు ముడతలు , రక్తపిత్తము , చర్మముపైన పొక్కులు వంటి సమస్యలు కలుగచేయును . 

         

Friday, January 28, 2022

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు .

రోగములు - ఏకమూలికా ప్రయోగాలు . 

     
      ఆయుర్వేద వైద్యము నందు ఒక రోగమునకు ఎన్నో రకాల వైద్యయోగాలు ఉంటాయి . కొన్నిసార్లు అనేక రకాల మూలికలను ఒక మొతాదులో కలిపి ఆయా రోగాలకు ఔషధాలను తయారుచేయడం జరుగును . కాని కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి . అవి ఒక్క మూలికా ఉన్నను చాలు రామబాణం వలే ఆ రోగము మీద ప్రయోగించి ఆ రోగాన్ని నయం చేయవచ్చు . 

     ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఏకమూలికా యోగాలు నేను అనేక పురాతన గ్రంథ పఠనం మరియు నా పరిశోధనలో తెలుసుకొనినవి మీకు దాచుకోకుండా అందచేస్తున్నాను . 

  ఏకమూలికా ప్రయోగాలు  - 

 *  తుంగముస్తలు , పర్పాటకం - జ్వరం నందు శ్రేష్టం . 

 *  నీటియందు సన్నని ఇసుక , పెంకులు వేసి కాచి వడబోసి చలార్చి ఇచ్చిన జలం అతిదాహం నివారించును . 

 *  పేలాలు ఛర్ధిరోగము ( వాంతుల ) యందు శ్రేష్టం . 

 *  శిలజిత్ మూత్రసంభంధ రోగముల యందు శ్రేష్టం . 

 *  ఉసిరి , పసుపు ప్రమేహము నందు శ్రేష్టం . 

 *  లోహచూర్ణం పాండురోగము నందు శ్రేష్టం . 

 *  కరక్కాయ వాత, కఫ రోగముల యందు శ్రేష్టం . 

 *  పిప్పలి ప్లీహ ( Spleen ) రోగము నందు శ్రేష్టం  . 

 *  లక్క ఎముకల సంధానము ( అతుక్కొనుట ) నందు శ్రేష్టం . 

 *  దిరిసెన విషము నందు శ్రేష్టం . 

 *  గుగ్గిలము మేడీ ఆమ్రయమయిన వాయవు నందు శ్రేష్టం . 

 *  అడ్డసరం రక్తపిత్తము నందు శ్రేష్టం . 

 *  కోడిశెపాల అతిసారం నందు శ్రేష్టం . 

 *  నల్లజీడి మొలల రోగము నందు శ్రేష్టం . 

 *  స్వర్ణభస్మం పెట్టుడు మందు నివారణకు శ్రేష్టం . 

 *  రసాంజనము శరీర అధికబరువు నివారణలో శ్రేష్టం . 

 *  వాయువిడంగములు క్రిమిరోగము నందు శ్రేష్టం . 

 *  మద్యము , మేకపాలు , మేక మాంసం క్షయరోగము నందు శ్రేష్టం . 

 *  త్రిఫల నేత్రరోగముల యందు శ్రేష్టం  . 

 *  తిప్పతీగ వాతరక్తం నందు శ్రేష్టం . 

 *  మజ్జిగ గ్రహణి రోగము నందు శ్రేష్టం . 

 *  ఖదిర కుష్ఠు నందు శ్రేష్టం . 

 *  గోమూత్ర శిలజిత్ అనేక రోగముల యందు శ్రేష్టం . 

 *  పురాణ ఘృతం ( పాత నెయ్యి ) ఉన్మాదము నందు శ్రేష్టం . 

 *  మద్యము శోకము నందు శ్రేష్టం . 

 *  బ్రాహ్మి అపస్మారము నందు ప్రశస్తము . 

 *  పాలు నిద్రానాశనము నందు శ్రేష్టం . 

 *  రసాలము ( పెరుగు నుండి తయారు చేయబడును ) ప్రతిశ్యాయము నందు శ్రేష్టం . 

 *  మాంసము కార్శ్యము ( Liver ) నందు శ్రేష్టం . 

 *  వెల్లుల్లి వాతము నందు శ్రేష్టము . 

 *  స్వేదకర్మ స్తంబము ( బిగదీసుకొని పోయిన అవయవాలు ) నందు శ్రేష్టం . 

 *  బూరుగ బంక నశ్యము రూపమున చేతులు , భుజములు , భుజశిరస్సు శూల యందు శ్రేష్టం . 

 *  వెన్న , పంచదార ఆర్ధిత వాతము నందు శ్రేష్టం . 

 *  ఒంటె మూత్రము , ఒంటె పాలు ఉదరరోగము నందు శ్రేష్టం . 

 *  నస్యము శిరోగములకు ప్రశస్తం . 

 *  రక్తమొక్షము నూతనముగా వచ్చిన విద్రది ( కురుపు ) నందు శ్రేష్టం . 

 *  నస్యము , ఔషధద్రవ్యమును పుక్కిలించుట ముఖరోగముల యందు శ్రేష్టం . 

 *  నస్యము ( ఔషధ చూర్ణము ముక్కు ద్వారా లోపలికి పీల్చుట , అంజనం ( ఔషధద్రవ్యమును కాటుకలా కంటికి పెట్టటం ) , తర్పణం ( శుభ్రపరచుట ) నేత్రరోగముల యందు శ్రేష్టం . 

 *  పాలు , నెయ్యి వృద్దాప్యము ఆపుట యందు శ్రేష్టం . 

 *  చల్లనినీరు , చల్లనిగాలి , నీడ మూర్చ యందు ప్రశస్తము . 

 *  మద్యము , స్నానము శ్రమ యందు శ్రేష్టం . 

 *  పల్లేరు మూత్రకృచ్చము నందు ప్రశస్తం . 

 *  వాకుడు కాసరోగము నందు శ్రేష్టం . 

 *  పుష్కరమూలము పార్శ్వశూల ( ఒకవైపు వచ్చు తలనొప్పికి ) శ్రేష్టం . 

 * ఉసిరిక రసాయనముల యందు శ్రేష్టం . 

 *  త్రిఫల , గుగ్గిలం వ్రణముల యందు శ్రేష్టం . 

 *  వస్తి ప్రయోగము వాతరోగముల యందు ప్రశస్తం . 

 *  విరేచనము పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 *  వమనము శ్లేష్మరోగముల యందు ప్రశస్తం . 

 *  తేనె కఫరోగముల యందు ప్రశస్తం . 

 *  నెయ్యి పిత్తరోగముల యందు ప్రశస్తం . 

 *  తైలము వాతరోగముల యందు ప్రశస్తం . 

       పైన చెప్పిన వాటిలో కొన్ని దేశ కాల , బలములను అనుసరించి కలపడం కాని తీయటం కాని వైద్యుని విచక్షణ పైన ఆధారపడి ఉండును. 

       

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు. 

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు . 

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు - 

 *  పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 *  పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 *  పెరుగుతో అరటిపండు భుజించరాదు . 

 *  పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 *  పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 *  తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 *  ఉసిరిక పచ్చడి - పెరుగు =  శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును . 

 *  నెయ్యి - చక్కెర - పెరుగు =   వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  చక్కెర -  పెరుగు =   దప్పిక, తాపాన్ని హరించును . 

 *  పెసరపప్పు - పెరుగు  =  రక్తంలోని వాతాన్ని హరించును . 

  మజ్జిగ ఉపయోగాలు - 

  
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు.  బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని  మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను . 

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు. 

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు  - 

  *  పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 *  పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.

 
  వెన్న ఉపయోగాలు - 

    
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును . 

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను. 

     
   
               

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు -

వ్యాధుల చికిత్సలో ఉపయోగించవలసిన పచ్చి కూరగాయల రసాలు  - 

 ప్రియమితృలకు నమస్కారం ,

      ఇప్పుడు నేను  చెప్పబోయే    పచ్చికూరగాయలు మరియు ఆకుకూరల పచ్చి రసాలు మీరు వ్యాధి నివారణ కొరకు తీసుకునే ఔషదాలు కు అనుబంధంగా తీసుకుంటూ ఉంటే మరింత తొందరగా మీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 

 *  ఉబ్బసం , తీవ్ర జ్వరాల కొరకు  - 

      పచ్చి క్యారెట్ , తొటకూర , కూరాకు ( endive ) రసాలను కలిపి తీసుకొనిన చాలా బాగా పనిచేస్తుంది .

 *  మొటిమలు మరియు కాలిన బొబ్బలకు - 

        క్యారెట్ మరియు బీట్ రూటు రసాలను కలిపి వాడవలెను. ( పచ్చిరసం మాత్రమే ).

 *  గాస్ట్రిక్ సమస్య కొరకు  - 

        తోటకూర మరియు క్యారెట్ పచ్చిరసాలను రెండు పూటలా రెండు గ్లాసుల 
మోతాదుగా తాగవలెను .

 *  గొంతు మీద వచ్చు కాయ ( goiter) కొరకు 

         క్యారెట్ మరియు వాటర్ క్రెస్ రసములను వాడవలెను .

 *  గుండె సమస్యల కొరకు  - 

         క్యారెట్ మరియు బీట్ రూట్ రసమును వాడవలెను.

 *  మూలవ్యాది కొరకు  - 

         క్యారెట్ మరియు కొత్తిమీర ఆకు కూర రసంని తాగించవలెను . 

 *   అజీర్ణ వ్యాధి కొరకు  - 

         క్యారెట్ మరియు తోటకూర రసం తాగవలెను .

 *  ఎక్కువుగా ఉన్న రక్తపోటు కొరకు  - 

         తోటకూర మరియు బీట్రూట్ మరియు క్యారెట్ రసంని వాడవలెను .

 *  నిద్రసరిగ్గా పట్టనందుకు  - 

          పడుకునే ముందు తోటకూర రసంని తాగవలెను .

 *   మూత్రపిండాల బాధల కొరకు  - 

           క్యారెట్ మరియు parsly అని కొత్తిమీర వంటి ఆకురసం తాగవలెను . జలోదరం అనగా పొట్ట నిండా నీరు చేరు రోగం కు కూడా ఇదే రసాల్ని వాడవలెను .

 *   కాలేయ సమస్యల కొరకు  - 

        క్యారెట్ , బీట్ రూట్ మరియు దోసకాయ   
రసాలని వాడవలెను .గాల్ బ్లాడర్ సమస్యలకు కూడా ఈ రసాలని తాగవలెను .

 *   నరాల బాధల కొరకు  - 

        తోటకూర మరియు లెట్యూస్  పచ్చి రసాలని తాగవలెను .

 *   అధిక బరువు తగ్గించుట కొరకు  - 

        తోటకూర , క్యారెట్ మరియు క్యాబేజ్ రసాలని తాగవలెను .

 *   హృదయంకి నల్ల రక్తం తీసుకుని పోవు సిరలని బాగు చేయుట కొరకు  - 

          క్యారెట్ , బీట్ రూట్ మరియు తోటకూర రసంలని తాగవలెను .

 *   క్షయ వ్యాధి నివారణ కొరకు  - 

          పచ్చి బంగాళా దుంపలు రసం పిండి ఒక గిన్నెలొ పోసి దానిలో పిండిపదార్థాలు అడుగుకు పేరుకొనునట్లు చేసి పైన రసముని ఒక గ్లాసుడు , అంతే పరిమాణంలో మరొక గ్లాసుడు బీట్రూట్ రసంని కలిపి దానిలో ఒక చెంచాడు ( tea spoon ) ఆలివ్ ఆయిల్ చేర్చి నురుగు వచ్చేవరకు చిలికి ఆ రసంని రోజుకి రెండు మూడు సార్లు ఇచ్చుచుండవలెను .

 *   అల్సర్ , పెద్ద పేగుల్లో వాపు ( colitis) సమస్య నివారణ కొరకు  - 

       క్యారెట్ లేదా క్యాబిజి రసం తీసికొనవలెను 

 *   సిరలకు సంబందించిన వ్యాధి కొరకు  - 

        క్యారెట్ , స్పినాచ్ మరియు turnip tops రసమును తీసుకొనుచుండవలెను .

 *  ఎడినోయిడ్స్ , టాన్సిల్స్ వ్యాధుల కొరకు 

         టమోటా మరియు బీట్రూట్ రసాలు లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలు కలిపి తాగవలెను .

 *  రక్తహీనత కొరకు  - 

          క్యారెట్ మరియు తోటకూర మరియు పాలకూర లేక క్యారెట్ మరియు బీట్రూట్ రసాలని కలిపి తాగవలెను .

 *  సంధివాతం  - 

          తోటకూర మరియు క్యారెట్ రసాలు తాగవలెను . 

 *  ఉబ్బసం , రొమ్ము పడిశం , జలుబు నివారణ  కొరకు  - 

      ఒక ఔన్స్ ముల్లంగి తురుము , ఒక ఔన్సు నిమ్మరసం తో కలిపి రోజుకి రెండు సార్లు అరచెంచా చొప్పున తీసుకుంటూ క్యారెట్ , ముల్లంగి రసాలు తీసుకోవాలి . 

        మీగడ, ఐస్క్రీమ్ , గుడ్లు, పిండిపదార్థాలు చక్కెర బుజించరాదు . 

 *  కాన్సర్ , శరీరం పైన కలిగెడి కాయలు , ఉబ్బు , వాపులు , శరీరంలో నీరు చేరుట , ఉపిరితుత్తులలో సమస్యల కొరకు  - 

      క్యారెట్ , లెట్యుస్ , తోటకూర రసాలను సేవించాలి . 

 *  రక్తప్రవాహంలోని దోషాల కొరకు  - 

      క్యారెట్ , బీట్రూట్ రసాలను కలిపి సేవించాలి . 

 *  మలబద్దకం సమస్య నివారణ కొరకు  - 

        క్యాబేజి , తోటకూర , పాలకూర రసాలు కలిపి కాని లేక తోటకూర రసంని నిమ్మరసం కలిపికాని సేవించవలెను . 

 *  మధుమేహము కొరకు  - 

        తోటకూర , క్యారెట్ , తీగ చిక్కుడు రసాలని సేవించాలి . 

 *  చర్మవ్యాధులు కొరకు  - 

         క్యారెట్ , బీట్రూట్, తోటకూర రసాలని కలిపి సేవించాలి . 

 *  కంటిజబ్బులు  - 

         క్యారెట్ మరియు parsly అనగా కొత్తిమీర వలే ఉండు ఆకుకూర రసాలని సేవించవలెను . 

 *  మూత్రావయవాలలో రాళ్లు , పిత్తాశయంలో రాళ్లు కరుగుట కొరకు  - 

       క్యారెట్ , బీట్రూట్ , దోసకాయ రసాలను సేవించవలెను . 

 గమనిక  - 

           పైన చెప్పిన సమస్యలకు ఔషదాలు వాడుకుంటూ పచ్చి కూరగాయలు , ఆకు కూరల రసాలని సేవించాలి . ఫలితం తొందరగా వస్తుంది.

            మంచి ఫలితాలు పొందవలెను అనుకుంటే రోజుకి కనీసం 180ml రసాన్ని లొపలికి తీసుకోవాలి . శీఘ్రంగా ఫలితం రావాలి అనుకునే వారు రోజుకి రెండు లేదా మూడుసార్లు సేవించవచ్చు . అయితే బీట్రూట్ రసం , parsly రసం మరియు water  kres రసములను మరియు మితముగా తీసికొనవలెను . 6 ఔన్సుల మించి వాడరాదు. పైన చెప్పిన రసాల్లో ఏవైనా ఎక్కువ తీసుకోవాలి అంటే 180 ml వరకు తీసుకోవచ్చు . ఎక్కువ మోతాదులో తీసుకోవలసిన అవసరం వస్తే క్యారెట్ రసం గాని , తొటకూర రసంతో గాని తీసుకోవలెను . 

    

పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు.

పదార్థాలకు విషం కలిసినప్పుడు ఆయా పదార్థాల           
సేవన వలన కలుగు విపరీతాలు - పదార్థ లక్షణాలు. 

  *  విషము కలిసిన అన్నమును అగ్ని యందు వేసిన ఛటఛటమను ధ్వని కలుగును. నెమలి కంఠము నందలి రంగు వలే పొగ వెలువడును. ఆ పొగని భరించుట చాలా కష్టం అగును. మంటలు కలిసి ఉండక విడివిడిగా వెలువడును. చకోర పక్షి విషము కలిసిన అన్నమును చూసిన వెంటనే ఎర్రగా ఉండు దాని నేత్రములు తెల్లబడును. కోకిలకు స్వరము చెడిపొవును.

 *  విషము కలిసిన ఆహారము నుండి వెలువడు ఆవిరి తగిలినచో హృదయము నందు బాధ , కనులు తిరుగుట, తలనొప్పి తగ్గును. ఇటువంటి సమయంలో చెంగల్వకోష్టు , ఇంగువ, వట్టివేర్లు , తేనె చేర్చి నశ్యము చేయించవలెను . 

 *  విషము జీర్ణాశయం నందు చేరినపుడు ఒళ్లంతా మంటలు , అతిసారం, కడుపులో గూడ గూడ మనుట , శరీరం తెల్లబడుట జరుగును.

 *  మద్యము నందు , జలము విషము కలిసిన ద్రవం నందు గీతలు , నురుగు, బుడగలు కలుగును. విషము కలిసిన ద్రవము నందు మన శరీరఛాయ కనపడదు. ఒక వేళ కనిపించిన జంట నీడలుగా , రంధ్రములతో కూడినట్టుగా , పలుచగా , వికృతాకారముగా కనపడును.

 *  కూరలు , పప్పులు , అన్నము, మాంసము అను వాటి యందు విషము కలిసిన చితచితలాడుచూ రుచిని కోల్పోయి చద్దివానివలే దుర్గన్ధమును కలిగి ఉండును. అన్ని పండ్ల యందు కూడా విషపూరితం అయినపుడు వాటికి ఉండు సహజసిద్ధ రుచి , సువాసన కోల్పోవును. పచ్చికాయలకు విషము తగిలిన వెంటనే పండును. పండిన వానికి విషము తగిలిన వెంటనే కుళ్లిపోవును.

 *  దంతములకు తగిలిన దంతములు విరిగిపోవును. నాలుక , పండ్లచిగుళ్ళు , పెదవులు వాచును .

 *  తలకు పూయు నూనె యందు విషము కలిసిన ఆ నూనె జిగటలుగా సాగును. నూనె చిక్కబడి రంగు మారును . అది శరీరముకు తగిలిన పొక్కులు పుట్టి బాధ కలుగును. పొక్కుల నుంచి స్రావం కలుగును. చర్మం పుండు అగును. చెమటలు పుట్టును . జ్వరం కలుగును. మాంసం విడిపోవును.  నలుగుపిండి , స్నానం చేయు జలము , తలస్నానం చేయు కుంకుడు రసం నందు కూడా విషం కలిసిన పైన చెప్పిన లక్షణాలు కలుగును.

 *  విషము కలిసిన లేపము తలకు పూసిన జుట్టు ఊడిపోవును. తలయంతయు బాధ కలుగును. కన్ను , ముక్కు, చెవి మొదలగు రంధ్రముల నుంచి రక్తం కారును . శిరస్సు నందు గడ్డలు లేచును .

 *  ముఖమునకు పూసుకోను ముఖలేపనం నందు విషము కలిసిన ముఖం కమిలినట్లు అగును. తామర కాడపైన ఉండే విధంగా సన్నని ముళ్ళు వంటివి ముఖంపైన లేచును .

 *  ముక్కుతో పీల్చే వాటి యందు విషము కలిసిన శరీర రంధ్రముల నుంచి రక్తం బయటకి వచ్చును. శిరోభాధ , కఫం బయటకి కారుట జరుగును.

 *  పువ్వులకు విషము తగిలినచో వాటి సువాసన కోల్పోవును . వర్ణం మారును , వాడిపోవును . విషము సోకిన పువ్వుల వాసన చూసిన శిరోభాధ కలిగి నేత్రముల యందు నీరు చేరును .

 *  చెవిలో వేసుకోను తైలం నందు విషము కలిసిన వికృతి కలిగి ధ్వని గ్రహించు శక్తి తగ్గును. చెవి యందు వాపు , పోట్లు , రసి కారుట కలుగును.

 *  కంటికి పెట్టుకొను కాటుక యందు విషము కలిసినచో కన్నీరు జిగురుగా మారును , కనులు మండును . గుడ్డితనం కూడా కలుగును.

 *  పాదుకలు యందు విషం ఉన్నచో పాదముల యందు వాపు , రసికారుట, పాదములు మొద్దుబారుట, పొక్కులు కలుగుట అను లక్షణములు సంభంవించును.

 *  నగల యందు విషము కలిసిన అవి మాములుగా ప్రకాశించవు . కాంతి తగ్గి ఉండును. ధరించిన శరీరభాగాలను హింసించును. వొళ్ళంతా మంటలు కలుగచేయును . చర్మం, మాంసం ఊడిపడును.  

            

కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ -

కరక్కాయ గురించి సంపూర్ణ వివరణ - 

 తెలుగు  - కరక్కాయ . 

 సంస్కృతం  -  హరీతకి . 

 హింది - హరడ్ . 

 లాటిన్  - TERMINALIA CHIBULA . 

 కుటుంబము  - COMBRETACEAE . 

 గుణగణాలు  - 

     కరక్కాయ లవణరస వర్జితముగా , అయిదు రసములు గలదిగా , రూక్షముగా , వేడిగా , జఠరదీపనముగా , బుద్ధిబలమును ఇచ్చునదిగా , మధురపక్వముగా , ఆయురారోగ్యాలను ఇచ్చునదిగా , నేత్రములకు హితవుగా , తేలికగా , ఆయువును పెంపొందించునదిగా , ధాతువృద్ధిగా , వాయువును కిందకి వెడలించునదిగా ఉండును. మరియు శ్వాసను , దగ్గును , ప్రమేహమును , మొలలను , కుష్టును , నంజును , ఉదరమును , క్రిమిని , స్వరభంగమును , గ్రహిణిని , మలబద్ధకమును , విషజ్వరమును , గుల్మమును , కడుపుబ్బరం , దాహము , వాంతిని , ఎక్కిళ్ళను , దురదను , హృదయరోగమును , కామెర్లను , శూలను , ప్లీహారోగమును , అనాహమును , కాలేయవ్యాధిని , శిలామేహమును , మూత్రకృచ్చ రోగమును , మూత్రఘాత రోగమును నాశనం చేయును . 

           కరక్కాయ పులుసు రసం కలిగి ఉండుటచే వాతాన్ని హరించును . తీపి , చేదురసం కలిగి ఉండటం చేత పిత్తాన్ని హరించును . రూక్షత్వం ,వగరు రసం కలదగుట చేత కఫాన్ని హరించును . ఈ విధముగా కరక్కాయ త్రిదోషహరమైనది. 

        కరక్కాయను వర్షఋతువు నందు సైన్ధవ లవణము చేర్చి , శరదృతువు యందు పంచదార చేర్చి  , హేమంత ఋతువు నందు శొంఠిని చేర్చి శిశిర ఋతువు నందు పిప్పలిని చేర్చి , వసంత ఋతువు నందు తేనెని చేర్చి , గ్రీష్మఋతువు నందు బెల్లమును చేర్చి భక్షించవలెను. కరక్కాయను భోజనానంతరం భక్షించినను పథ్యకరమైనది . మరియు భోజనం జీర్ణం అయిన తరువాతను , అజీర్ణసమస్య ఉన్నప్పుడును పుచ్చుకోవచ్చు. 

  రూప లక్షణాలు  - 

     కరక్కాయ మొత్తం 7 రకాలుగా కలదు. అవి 

             *  విజయా . 

             *  రోహిణీ . 

             *  పూతన . 

             *  అమృతా . 

             *  అభయా . 

             *  జీవంతి . 

             *  చేతకీ . 

      అని మొత్తం 7 జాతులుగా ఉండును. ఇప్పుడు మీకు వీటి గురించి సంపూర్ణముగ వివరిస్తాను. 

        విజయా కరక్కాయ వింధ్య పర్వతం పైన పుడుతుంది. చేతకీ కరక్కాయ హిమాలయ పర్వతాలపైన పుట్టుచున్నది. పూతన కరక్కాయ సింధూనది ప్రాంతము నందు పుట్టుచున్నది . అమృత కరక్కాయ , అభయ కరక్కాయ చంపారణ్యం నందు పుట్టుచున్నది. రోహిణీ కరక్కాయ అన్ని స్థలముల యందు పుట్టుచున్నది. జీవంతి కరక్కాయ సౌరాష్ట్ర దేశము నందు పుట్టుచున్నది. 

                  సొరకాయ వలే పొడవుగా , గుండ్రముగా ఉండునది విజయా కరక్కాయ , కేవలం గుండ్రముగా ఉండునది రోహిణి కరక్కాయ , బీజము పెద్దదిగా ఉండి పై చర్మము పలుచగా ఉండునది పూతన కరక్కాయ , బీజములు చిన్నవిగా ఉండి పేడు మందముగా ఉండునది అమృత కరక్కాయ , అయిదు రేఖలు కలిగినది అభయ కరక్కాయ. బంగారు రంగుతో ఉండునది జీవంతి కరక్కాయ , మూడు రేఖలు కలిగినది చేతకీ కరక్కాయ . 

     విజయ కరక్కాయను సర్వరోగముల యందు ఉపయోగించదగినది. రోహిణి కరక్కాయను వ్రణము హరించుటకు ఉపయోగించదగినది . పూతన కరక్కాయ లేపనమందును , పైన పట్టు వేయుటకు ఉపయోగించతగినది. అమృత కరక్కాయ శోధనార్థం , విరేచనములు మొదలగు వానికి ఉపయోగించతగినది. అభయ కరక్కాయ నేత్రరోగములకు ఉపయోగించతగినది. , జీవంతి కరక్కాయ సర్వరోగములను హరించును . చేతకీ కరక్కాయ చూర్ణములకు ప్రశస్తమైనది. 

                కరక్కాయ మనుష్యులకు తల్లివలె హితము చేయును . తల్లికి ఒకప్పుడైనను కోపము కలిగి దండించును. కాని కడుపులో ప్రవేశించిన కరక్కాయ ( తినిన ) ఎప్పటికి హానిచేయదు . ఎల్లప్పుడూ మంచిచేయు గుణము కలిగినది . 

     చేతకీ కరక్కాయ తెలుపు రంగు , నలుపు రంగు బేధము వలన రెండు విధములుగా ఉండును. తెల్ల చేతకీ కరక్కాయ 6 అంగుళముల పొడవుగాను , నల్ల చేతకీ కరక్కాయ ఒక అంగుళము పొడవుగా ఉండును.  

           ఒక జాతి కరక్కాయ తినుట చేతను , ఇంకో జాతి కరక్కాయ వాసన చూసిన మాత్రం చేతను , మరొక జాతి కరక్కాయ ముట్టుకొనిన మాత్రమున , వేరొక జాతి కరక్కాయ చూచిన మాత్రమునే విరేచనం కలిగించును. ఈ ప్రకారం నాలుగు బేధముల విరేచన గుణములు కరక్కాయల యందు కలవు. 

              చేతకీ కరక్కాయ చెట్టు కింద ఏ మనుష్యులు కాని లేక పశు , పక్షి , మృగాదులు కాని తిరిగిన తక్షణం విరేచనములు అగును. చేతకీ కరక్కాయను హస్తము నందు ఎంతసేపు ఉంచుకొనునో అంతవరకు ఆ కరక్కాయ ప్రభావం వలన నిశ్చయముగా విరేచనములు అగుచుండును. చేతకీ కరక్కాయను సుకుమారులు , బలహీనులు , ఔషధము నందు ద్వేషము కలిగినవారు చేతిలో పట్టకూడదు. చేతకీ కరక్కాయ అత్యంత ప్రశస్తమైనది. సుఖవిరేచనం కలిగించుటకు హితకరం అయినది. 

             పైన చెప్పిన 7 జాతులలో విజయ కరక్కాయ ప్రధానం అయినది. ప్రయోగము నందు సుఖవిరేచనం ఇచ్చునది. సర్వరోగముల యందు ఉపయోగించతగినది. ఏ కరక్కాయ నూతనమైనది , జిగట కలిగినది . గొప్పది , గుండ్రనిది , బరువు కలిగినది . నీటిలో మునుగునదిగా ఉండునో ఆ కరక్కాయ ప్రశస్తమైనది. తూనిక నందు 2 తులములు తూగినది ప్రశస్తమైన కరక్కాయ . 

 ఔషధోపయొగాలు  - 

 *  కామెర్ల నివారణ కొరకు  - 

        కరక్కాయ , తేనె , బెల్లం కలిపి తినిన కామెర్లు తగ్గును. 

 *  కీళ్ళవాతము నివారణ కొరకు - 

        కరక్కాయ చూర్ణమును , ఆముదముతో కలిపి ప్రతినిత్యం వాడిన కీళ్లవాతం , గృదసీవాతం ( సయాటికా ) తగ్గును. 

 *  క్రిమిరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో కలిపి వాడిన క్రిమిరోగాలు తొలగును . ఇది చక్కని విరేచనాన్ని కలుగచేయును . అర్శమొలల సమస్యతో ఇబ్బంది పడువారికి ఇది చాలా మంచిది . 

 *  కడుపునొప్పి నివారణ కొరకు 

         కరక్కాయ చూర్ణము నందు బెబులిన్ కలదు. ఇది కడుపునొప్పిని తగ్గించును . 

 *  చర్మరోగముల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణమును , గోమూత్రము నందు కలిపి తాగిన పామా , దద్రు మొదలగు చర్మరోగాలు తగ్గును. కరక్కాయను కాల్చి చూర్ణము చేసి ఆ చూర్ణముకు నువ్వులనూనె కలిపి రాసిన పురాణ వ్రణములు తగ్గును. 

 *  విషమ జ్వరాల నివారణ కొరకు  - 

         కరక్కాయను తేనెతో కలిపి వాడిన విషమ జ్వరాలు తొందరగా నయం అగును. 

 *  ఆమ్ల పిత్తము నివారణ కొరకు  - 

         కరక్కాయను ద్రాక్షతో కలిపి సేవించిన ఆమ్లపిత్తము నయం అగును. 

 *  అర్శమొలల నివారణ కొరకు  - 

          కరక్కాయ చూర్ణమును బెల్లముతో కలిపి ప్రతిరోజు సేవించిన అర్శమొలలు , మలబద్ధకం , వాత్తరక్తం శమించును . 

 *  బరువు తగ్గుట కొరకు - 

         కరక్కాయ ప్రతినిత్యం వాడుచున్న బరువు తగ్గును. 

 *  గోరుచుట్టు నివారణ కొరకు  - 

        పసుపు రసమునకి కరక్కాయలను చేర్చి వాటిని బాగా దంచి మెత్తగా నూరి పైపూతగా రాయుచున్న గోరుచుట్టు తగ్గును. 

 *  నీళ్ల విరేచనాల నివారణ కొరకు  - 

         కరక్కాయ చూర్ణాన్ని వేడినీటితో తాగుచున్న నీళ్ళవిరేచనాలు తగ్గును. 

 *  రక్తస్రావ నివారణ కొరకు  - 

        కరక్కాయ చూర్ణాన్ని అడ్డసరం రసంతో భావన చేసి ఎండబెట్టి ఆ చూర్ణమునకు పిప్పళ్లు , తేనె చేర్చి సేవించిన ఎంతపెద్ద రక్తస్రావం అయినను తగ్గును. 

 *  శరీర బలం పెరుగుట కొరకు  - 

         కరక్కాయలను నేతిలో వేయించుకుని తినుచున్న శరీరానికి మంచి బలం కలుగును. 

 *  పాండురోగం నివారణ కొరకు  - 

        కరక్కాయలను గోమూత్రము నందు వేసి మరిగించి తీసి పైపెచ్చు పొడిని చేసి దానిని 5 గ్రాముల మోతాదులో కొంచం ఆముదం కలిపి ప్రతినిత్యం ఉదయం సమయంలో పరగడుపున సేవించవలెను . దీనిని గోమూత్ర హరీతకీ అని అంటారు.  దీనిని వాడటం వలన పాండురోగం , అధిక బరువు , వరిబీజం తగ్గును. 

 *  చర్మ దళ కుష్టు నివారణ కొరకు  - 

       20ml గోమూత్రము నందు 3 గ్రాముల కరక్కాయ చూర్ణము కలిపి తాగితే చర్మ దళ కుష్ఠు , కిటిభకుష్టు  తగ్గును . ఇతర చర్మవ్యాధుల యందు కరక్కాయ పొడికి సమానం వేపాకు చూర్ణం కలిపి 1 స్పూన్ చొప్పున రెండుపూటలా తాగవలెను . 

 *  గొంతు బొంగురు నివారణ కొరకు  - 

       కరక్కాయ చూర్ణమునునకు పిప్పలి చూర్ణం లేదా శొంఠిచూర్ణం మరియు తేనె కలిపి లేహ్యముగా చేసి అరస్పూన్ చప్పరించి మింగుచున్న బొంగురుగొంతు , గొంతులో నస తగ్గును. 

 *  దగ్గు నివారణ కొరకు  - 

        కరక్కాయ పెచ్చును నోటిలో ఉంచుకుని రసము మింగుచున్న కొండనాలుక , దగ్గు , గొంతు వొరుచుకొనుట , పొడిదగ్గు తగ్గును. 

 *  తలనొప్పి నివారణ కొరకు  - 

        కరక్కాయ గింజలతో నుదుటి పైన పట్టువేసిన తలనొప్పి తగ్గును. 

 * కండ్ల ఎరుపు నివారణ కొరకు  - 

         కరక్కాయ , కాచు సమాన భాగాలుగా తీసుకుని నీటితో నూరి కండ్లపైన గుడ్డ వేయవలెను . కండ్ల ఎరుపులు తగ్గును. 

 *  ఎక్కిళ్లు నివారణ కొరకు  - 

       గోరువెచ్చని నీళ్లతో కరక్కాయ చూర్ణం కలిపి ఇచ్చిన ఎక్కిళ్ళు కట్టును . 

 *  ఉదరరోగ నివారణ కొరకు  - 

       ఉదయం మరియు సాయంత్రం ఒక్కొక్క కరక్కాయ చొప్పున 2 నెలలపాటు తినుచుండిన ఎటువంటి ఉదరరోగం అయినను తగ్గిపోవును. 

 *  ఆహారం జీర్ణం అగుటకు  - 

       వేడినీటితో కరక్కాయ చూర్ణం కలిపి తాగిన తినిన ఆహారం సరిగ్గా అరగకుండా ఉన్న సమస్యని తొలగించి ఆహారాన్ని జీర్ణం చేయును . 

 *  కఫజ్వర నివారణ కొరకు  - 

       గోమూత్రంలో కరక్కాయలు భావన చేసి తినిన కఫసంబంధ దోషం వలన వచ్చు జ్వరం నివారణ అగును. 

 *  వాంతుల నివారణ కొరకు  - 

        కరక చూర్ణం తేనెతో సేవించిన వాంతులు తగ్గును. 

 *  కఫ సంబంధ బోదకాలు నివారణ కొరకు  - 

       కరక్కాయ ముద్దను గోమూత్రముతో కలిపి తాగిన బోదకాలు నివారణ అగును. 

 *  గుల్మ నివారణ కొరకు  -  

        కరక్కాయ చూర్ణం బెల్లముతో కలిపి తినుచున్న గుల్మరోగం నివారణ అగును. 

 *  రక్తపిత్త రోగ నివారణ కొరకు  - 

        అడ్డసరం రసములో 7 సార్లు భావన చేసిన కరక్కాయను నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని కొంచం పిప్పలి చూర్ణం కలిపి తేనెతో సేవించిన అసాధ్యమగు రక్తపిత్తం తగ్గును. 

 *  ఉబ్బురోగం నివారణ కొరకు - 

     బెల్లం మరియు కరక్కాయ సమానంగా కలిపి తీసుకొనుచున్న ఉబ్బురోగములు తగ్గును. 

 *  వాతరక్త వ్యాధి నివారణ కొరకు  - 

     5 కరక్కాయలు బాగుగా నమిలి మింగి తిప్పతీగ కషాయం తాగిన వాతరక్తం తగ్గును.

 *  అండవృద్ధి నివారణ కొరకు  - 

        గోమూత్రము నందు భావన చేసిన కరక్కాయను ఆముదము నందు వేయించి వేడినీటి అనుపానంగా సేవించిన అండవృద్ధి హరించును . 

 *  నేత్రరోగ నివారణ కొరకు  - 

        కరక్కాయ ఆవునేతితో ఉడికించి అది కంటిపైన వేసి కట్టు కట్టుచున్న నేత్ర దోషాలు నివారణ అగును. 

 *  పిల్లల కోరింత దగ్గు నివారణ కొరకు  - 

       కరకపువ్వు 1 భాగము , వేయించిన పిప్పళ్లు 1/2 భాగము , ఎండిన ఉస్తిపండ్లు 1/4 భాగము తీసుకుని వీటన్నింటిని మెత్తగా చూర్ణం చేసి మూడు గురిగింజలంత చూర్ణము 2 గంటలకి ఒక పర్యాయము తేనెతో నాకించుచుండిన కోరింత దగ్గులు తగ్గును. కరకపువ్వు చూర్ణం కూడా వాడవచ్చును  . 

 

దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు .

దేవతార్చన కొరకు ఉపయోగించదగు పుష్ఫాలు - వాటి ఫలితాలు . 

 *  జాజిపువ్వుతో అర్చించిన భుక్తి , ముఖ్తి ఇచ్చును . చంపకము స్తంభనము , మొగిలి , మొల్ల , తెల్ల కలువ ఉచ్చాటన పద్దతిలో ఆయుధముగా పనిచేయును . 

 *  బంగారు మల్లె లాభము , నల్ల గోరింట పువ్వుల అర్చన బలవర్ధనము , తెల్ల కలిగొట్టు గొప్ప కీర్తిని ఇచ్చును . 

 *  పద్మము శాంతి , పుష్టిని ఇచ్చును . కమలము సుపుత్రులను , దాసాని మరియు రక్తగన్నేరు వశీకరణము ఇచ్చును . 

 *  శాలి ( వరివెన్ను ) సౌభాగ్యమును , కడిమి , పొగడ , మొల్ల , వస , కుందము అను పుష్పములతో అర్చించిన పాపనాశనం చేయును . 

 *  కుసుమ వశీకరణము , మోదుగ ఆకర్షణము , పొన్న , నాగకేసరములు మహాలక్ష్మీప్రదములు . 

 *  ఎర్ర కలువ వశీకరణము , నీలము మరియు నల్ల కలువలు మారణ ప్రయోగము నందు , మందార పుష్పము శత్రువుకు భయము కలిగించుటకు ఉపయోగించదగినది . 

 *  వైశాఖము నందు పొగడ పువ్వులు , జైష్టమున నాగకేసర పుష్పములు , ఆషాడమున గన్నేరు పుష్పములు విరివిగా దొరకును కావున దేవతార్చనకు ఈ మాసములలో వీటిని వాడుట శ్రేష్టం . 

 *  శ్రావణమాసము నందు పద్మముల కన్నా సంపెంగలకు ప్రాముఖ్యం , భాద్రపదమున లొద్దుగ , అశ్వజమున దాసాని , కార్తీకము నందు అగిసే , మార్గశిరమున బిల్వములు , పుష్యమాసము నందు గరికె , మాఘ మాసము నందు కుంద పుష్పములు , ఫాల్గుణమున పూల గురివిందతో పూజించుట సర్వసిద్ధి ప్రదాయకము   చైత్రమాసమున అశోక మొగ్గలతో పూజించుట అత్యంత శ్రేష్టదాయకం . 

 *  తెల్లని సన్నజాజి ,అడవి గోరింట  , దవనం , రేల , పచ్చపూల గోరింట , ఎర్ర గోరింట , కలిగొట్టు , విరజాజి , జిల్లేడు , మాధవి , గొరింటా ఈ 11 రకాల పుష్పములతో జగదాంబకు అర్చన కొరకు సమర్పించవలెను . 

 *  సన్నజాజి పుష్పములతో పూజించిన వాక్శుద్ధి కలుగును . 

 *  చమేలీ పుష్పములతో అర్చించిన రాజవశీకరణము కలుగును . మరియు అధిక మేధాశక్తి లభించును . నాగకేసరములు రాజత్వమును ప్రసాదించును . 

 *  పూల గురువింద భూలాభము , సంపెంగ బంగారము , బండి గురువెంద బుద్ధివృద్ధి , మల్లె ధనాధిక్యతను కలిగించును . 

 *  మొల్ల పువ్వు కీర్తిని , దాసాని పువ్వులతో అర్చించిన శత్రువులు సంశయావస్థలో పడెదరు . 

 *  పద్మము వలన ఆయుర్వృద్ధి కలుగును . కలువ వలన కవిత్వము అబ్బును , కడిమి పుష్పములతో అర్చన ద్వారా వ్యాధి నాశనము , బ్రహ్మదండి వలన బుద్ధిశాలిత్వము సంభంవించును . 

 *  మరువము వలన విజయప్రాప్తి , పచ్చ గోరింట వలన గజలాభము , అపరాజితా పుష్పముల వలన సర్వాంగ సుందరత్వము అబ్బును . 

 *  వావిలి వలన పుత్రలాభము , అశోకము వలన దుఃఖరాహిత్యము , పొగడ వలన వంశ గౌరవము కలుగును . 

 *  గరిక వలన ధన ధాన్య సంపద , బూరుగు పువ్వుల వలన శత్రుక్షయము , తుమ్మి పువ్వుల వలన అన్నప్రాప్తి , పొగడ వలన ధనాధిక్యత లభించును . 

 *  పొన్న వలన రాజ్యలాభము , రేల వలన అధికోన్నతి , పోట్లపువ్వుల వలన దీర్గాయువు , గ్రంథితగరము వలన సర్వమాన్యత ప్రాప్తించును . 

 *  మోదుగపువ్వుల వలన అనేక గోవులు ,మేకలు లభ్యమగును . దిరిసెన పువ్వులతో సుందర యువతి , దేవకాంచనం వలన జయము , శ్రేయము లభ్యమగును . 

 *  గన్నేరు పువ్వుల వలన మంత్రసిద్ధి , మారేడు దళముల వలన పరమపదము ప్రాప్తించును . సాత్వికమైన కోరికలకు తెల్లని పువ్వులు ప్రశస్తమైనవి . 

 *  ఉచ్చాటనము , వశీకరణము , ప్రేమ , శత్రుజయము వంటి వాటికొరకు అర్చనలు చేయువారు పరిమళము గల ఎర్రని పుష్పములు వాడవలెను . 

 *  మోహనము , వశీకరణము నందు పసుపుపచ్చని పుష్పములు శ్రేష్టమైనవి , అభిచారము , చేతబడి , పగ , మరణ ప్రయోగాల యందు రెండు విధములైన నల్లని పువ్వులు వాడవలెను . 

 *  దాసాని పువ్వులను దానం ఇచ్చిన దివ్యవస్త్రదాన  ఫలము కలుగును . మరియు బ్రహ్మ హత్యాది పాపములు క్షణములో నశించును . 

 *  దింటెన పుష్పముల యందు తెల్లదాని కంటే నల్ల దింటెన పుష్పములు దానం ఇచ్చిన రెండింతల పుణ్యము వచ్చును . 

 *  అపరాజితా , కుందముల నడుమ మనోహరమైన స్థానం కలదు . గన్నేరు పుష్పముల యందు సాక్షత్తు సదాశివుడే ఉండును . 

 *  దేవిని మంకెన పుష్పములతో పూజించిన యెడల మేకను బలి ఇచ్చినంత తృప్తి చెందును . దేవికి నిత్యపూజ యందు అర్ఘ్యం ఇయ్యవలెను .