Wednesday, December 25, 2024

చక్కెర తీపీ చేదూ*

*చక్కెర తీపీ చేదూ* 

తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టముండదు? పరిణామక్రమంలో భాగంగానే మనకు వీటిని తినటం అలవాటైంది. ఆదిమ మానవుల దగ్గరి నుంచి ఆధునిక మానవుల వరకూ అంతా తీపికి దాసులే. దీనికి కారణం వీటిల్లోని చక్కెర. శరీరానికి అవసరమైన శక్తిని అందించటమే కాకుండా ఆనందాన్నీ ఇవ్వటం దీని ప్రత్యేకత. ఇది ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. చక్కెర అతిగా తింటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. అలాగని అతి తక్కువగా తింటే మెదడు, మనసుకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. ఇంత చిత్రమైన చక్కెర కథేంటో? అది మెదడు మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుందో? తెలుసుకుందాం.

చక్కెరకూ మనదేశానికీ అనాదిగా విడదీయరాని సంబంధముంది. దీని మీద మనకు గల ‘ప్రేమ’ అంతా ఇంతా కాదు. ఆ మాటకొస్తే- చెరకు రసాన్ని తొలిసారిగా పంచదార పలుకులుగా మార్చింది మనమే. అదీ 3,000 ఏళ్ల క్రితం. ప్రాచీన ఆయుర్వేద శాస్త్రాచార్యులైన శుశ్రుతుడు మొట్టమొదటిసారిగా మధుమేహంలో మూత్రం తీయగా ఉంటుందని వర్ణించారు. అధికబరువు గలవారిలో, ఎక్కువగా తినేవారిలో ఈ గుణం సాధారణమని క్రీస్తుపూర్వమే వివరించారు. అధర్వణ వేదం కూడా చక్కెరను కోరికతో ముడిపడిన దినుసుగా పేర్కొంది. మన ఆచారాల్లోనూ పంచదార తొలిస్థానంలో నిలుస్తుంది. ఇంటికి కొత్తవాళ్లు వచ్చినా, పాత మిత్రులు, బంధువులు వచ్చినా నోరు తీపి చేయకుండా ఉండలేం. ఇప్పుడంటే మిఠాయిలు ఇస్తున్నాం గానీ ఒకప్పుడు ముందుగా గుప్పెడు పంచదార నోట్లో పోసేవారు. స్వాగతం పలికినా, శుభాకాంక్షలు తెలిపినా, ఆశీర్వదించినా అన్నీ తీపితోనే. పిల్లాడు పరీక్షలకు వెళ్తున్నా, అమ్మాయి ఇంటర్వ్యూకు బయలుదేరుతున్నా తల్లులంతా చేసే మొదటి పని నోరు తీపి చేయటమే. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేయటమే దీనికి కారణం కావొచ్చు. ఉప్పు దుష్ప్రభావాల గురించి తరచూ మాట్లాడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు. కానీ చక్కెర తెచ్చిపెట్టే అనర్థాలను పెద్దగా పట్టించుకోరు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే- చక్కెర తినటమనేది సంపదకు చిహ్నంగా భావించటం. ప్రేమ చూపటమంటే పిల్లలకు తీపి పదార్థాలు ఇవ్వటంగానూ భావిస్తుండటం. కానీ మన శరీరం కొద్ది మోతాదుల్లోనే చక్కెరను అనుమతిస్తుంది. 

 *తక్కువైతే ఏమవుతుంది?* 

చక్కెర తీపీ చేదూ
మన శరీరంలోని అన్ని కణాలకు అవసరమైన శక్తిని అందించేంది గ్లూకోజే. ఇదీ ఒకరకం చక్కెరే. మెదడులో కోట్లాది నాడీ కణాలుంటాయి. అందుకే దీనికి ఇంకాస్త ఎక్కువ శక్తి అవసరం. నిజానికి మన శరీరంలోని మొత్తం గ్లూకోజులో సగం వరకూ మెదడే ఉపయోగించుకుంటుంది. ఆలోచనలు, జ్ఞాపకశక్తి, నేర్చుకోవటం వంటి పనులకు ఇది చక్కెర మీద ఆధారపడుతుంది. అందువల్ల ఇది (గ్లూకోజు) తగ్గితే నాడుల మధ్య సమాచారాన్ని చేరవేసే రసాయనాలు (న్యూరోట్రాన్స్‌మిటర్స్‌) ఉత్పత్తి కావు. నాడుల మధ్య సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది, విషయగ్రహణ సామర్థ్యం మందగిస్తుంది. డొపమిన్‌ హార్మోన్‌ తగ్గటం వల్ల పార్కిన్సన్స్‌ జబ్బుకు దారితీస్తుంది. అసిటీల్‌కొలీన్‌ తగ్గటంతో అల్జీమర్స్, మయస్థీనియా గ్రేవిస్‌ జబ్బుల ముప్పు పెరుగుతుంది. గ్లుటమేట్, గాబా తగ్గటం వల్ల మూర్ఛ రావొచ్చు. సెరటోనిన్‌ తగ్గితే తీవ్ర కుంగుబాటు తలెత్తొచ్చు.
 వదలని రుచి
తీపి పదార్థాలను వదిలిపెట్టటం మహా కష్టం. మత్తు పదార్థాల మాదిరిగానే చక్కెర కూడా మెదడులోని నాడీ మార్గాలను ఉత్తేజితం చేస్తుంది. చక్కెరను తిన్నప్పుడు మత్తు గ్రాహకాలు ప్రేరేపితమవుతాయి. ఇవి హాయి భావనను కలిగించే డొపమిన్‌ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్‌ మోతాదు తగ్గగానే మళ్లీ తీపిని తినేలా పురికొల్పుతాయి. దీంతో మరింత ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది వదల్లేని స్థితికీ చేరొచ్చు. ఎందుకంటే వ్యసనంతో ముడిపడిన మెదడులోని భాగాలనూ చక్కెర ప్రేరేపిస్తుంది. కొకైన్‌ను తీసుకున్నప్పుడు మెదడులో ఉత్తేజితమయ్యే భాగాలే చక్కెర తిన్నప్పుడూ ప్రేరేపితమవుతున్నట్టు ఫంక్షనల్‌ ఎంఆర్‌ఐ స్కాన్‌ అధ్యయనాల్లో బయటపడింది. 

 *వాడకంలో మనమే ముందు* 
గత శతాబ్దం నుంచీ ప్రపంచవ్యాప్తంగా పంచదార వినియోగం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రెండో స్థానం మనదే. వినియోగంలోనైతే మొదటిస్థానంలో ఉంటున్నాం. కాకపోతే సగటు వాడకంలో అమెరికాదే పైచేయి. సగటున రోజుకు 24-36 గ్రాముల చక్కెర తీసుకోవచ్చన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు. అమెరికాలో సగటున 126.4 గ్రాములు తీసుకుంటుండగా.. ఉగాండాలో అతి తక్కువగా 2 గ్రాములే తింటారు. మనదేశంలో సగటుకన్నా తక్కువగా రోజుకు 20.5 గ్రాములు తీసుకుంటారు. మనదేశం మధుమేహ రాజధానిగా మారింది. సుమారు 11% మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మరో 15% మంది ముందస్తు మధుమేహం (ప్రిడయాబిటిస్‌) గలవారే. ఇందుకు జీవనశైలి, ఆహార మార్పులే ప్రధానంగా దోహదం చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌-ఇండియాబ్‌ అధ్యయనం పేర్కొంటోంది. మధుమేహం గలవారిలో పట్టణాల్లో 16% మందికి, పల్లెల్లో 9% మందికి ఇవే ముప్పు కారకాలుగా పరిణమిస్తున్నట్టు వెల్లడించింది. మదుమేహం మూలంగా పక్షవాతం, గుండెజబ్బు, అధిక రక్తపోటు జబ్బులెన్నో ముంచుకొస్తుండటం ఆందోళనకరం. 

 *ఎక్కువైతే ప్రమాదమే* 
చక్కెర మరీ ఎక్కువగా తింటే మెదడులో అనుసంధాన వ్యవస్థ క్షీణిస్తుంది. నాడీకణాలను అదుపులో పెట్టే రసాయనాలు అస్తవ్యస్తం కావటం వల్ల ప్రవర్తన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సన్నగిల్లుతాయి. జ్ఞాపకశక్తికి కీలక కేంద్రమైన హిప్పోక్యాంపస్‌ కూడా అస్తవ్యస్తమవుతుంది. దీంతో మతిమరుపు తలెత్తుతుంది. మెదడు పరిమాణమూ కుంచించుకుపోవచ్చు. సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. మెదడులో రక్త ప్రసరణ తగ్గుతుంది. విషయగ్రహణ సమస్యలు, మెదడుకు త్వరగా వృద్ధాప్యం రావటం, కుంగుబాటు, ఆందోళన, మెదడులో వాపు తలెత్తుతాయి. మెదడు ప్రొటీన్‌ (బ్రెయిన్‌ డిరైవ్డ్‌న్యూట్రోఫిక్‌ ఫ్యాక్టర్‌) తగ్గుతుంది. నాడీ కణాల వృద్ధి, మనుగడకు తోడ్పడే దీని మోతాదులు తగ్గితే మెదడు త్వరగా వృద్ధాప్యంలోకి జారుకుంటుంది. చక్కెర ఎక్కువైతే భయం, ఒత్తిడి, ఆందోళన ప్రతిచర్యలు సైతం ఎక్కువవుతాయి. టైప్‌-2 మధుమేహం గలవారికి అల్జీమర్స్‌ వచ్చే అవకాశం ఎక్కువ. దీన్ని టైప్‌-3 మధుమేహమనీ అనటం గమనార్హం.

మితం మీద దృష్టి
శతాబ్దాలు, దశాబ్దాలుగా చక్కెర మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చేసింది. ఈ ధోరణిని మళ్లించటానికి కఠినమైన నియమాలు అవసరం. ప్రస్తుతం తీపి, శక్తి కలిగించే పదార్థాలు ఎక్కడంటే అక్కడ అందుబాటులో ఉంటున్నాయి. ఆదిమ మానవుల మాదిరిగా ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బిస్కట్లు, చాక్లెట్లు, కేక్‌లు, మిఠాయిలు, కూల్‌డ్రింకుల రూపంలో అన్నిచోట్లా దొరుకుతోంది. దురదృష్టవశాత్తూ ఇప్పటికీ మన మెదళ్లు మన పూర్వీకుల మెదళ్ల మాదిరిగానే పనిచేస్తున్నాయి. దీంతో అవసరం లేకపోయినా ఎక్కువెక్కుగా తీసుకుంటూ వస్తున్నాం. చక్కెర విషయంలో పరిమితి పాటించటం మనందరి కర్తవ్యం. జంక్‌ఫుడ్‌ లేబుళ్ల మీద హెచ్చరికలు ముద్రించటం, ప్రకటనలను నిషేధించటం వంటి చర్యలతో చిలీ, ఇజ్రాయెల్, సింగపూర్‌ దేశాలు మంచి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అక్కడ చక్కెర వినియోగం 18 నెలల్లోనే 25% వరకూ తగ్గటం గమనార్హం.

No comments:

Post a Comment