*🛕🔔భగవద్గీత🔔🛕*
_(సరళమైన తెలుగులో)_
*15. పురుషోత్తమ ప్రాప్తియోగము*
(పదునైదవ అధ్యాయము)
_________________________
*11. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్l* *యతన్తోఽప్యకృతాత్మానోనైనం పశ్యన్త్యచేతసఃll*
చాలా మంది ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నిస్తుంటారు. వేదములు, శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదిస్తారు. యోగులు అవుతారు. కాని కొంత మందికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. చాలా మందికి కలుగదు. దానికి కారణం చిత్తశుద్ధి లేకపోవడమే. వారిలో ఉన్న అహంకారము నశించకపోవడమే.
కొంతమంది యోగులు జ్ఞానమును సంపాదించి, జ్ఞాన నేత్రముతో ఆత్మను చూడగలుగుతున్నారు. వారిలో కొంత మందికి జ్ఞానం ఉంటుంది కానీ వివేకం కలగదు. అటువంటి వారి మనస్సు నిశ్చలంగా ఉండదు. చంచలంగా ఉంటుంది. ఎందుకంటే వారికి వేషభాషల మీద ఉన్న శ్రద్ధ ఆత్మజ్ఞానము మీద ఉండదు. కేవలం సన్యాసుల మాదిరి వేషం వేసుకుంటారు. ధ్యానము, పూజలు చేస్తుంటారు కాని వారి చిత్తము మలినంగా ఉంటుంది. అటువంటి వారికి అత్మసాక్షాత్కారం కలగడం కష్టం. ప్రతి వాడూ ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నించేవారే. కానీ వారిలో కొంత మంది మాత్రమే జ్ఞానము సంపాదించి, ఆత్మసాక్షాత్కారం పొందుతారు. వారిలో కూడా కొంత మందికి మాత్రమే చిత్తము నిశ్చలంగా ఉంటుంది. వారు మాత్రమే ఆత్మసాక్షాత్కారం పొందగలరు. మలినమైన చిత్తము కలవారు. సంస్కారము లేని వారు, అందుకు అనర్హులు. వారికి పాండిత్యము ఉంటుంది కాని చిత్తము మలినంగా ఉంటుంది. కాబట్టి ఆత్మసాక్షాత్కారము కావాలంటే అందుకు తగిన ప్రయత్నం ఉండాలి. చిత్తము శుద్ధంగా ఉండాలి. అచేతసులు అంటే చిత్తము పరిశుద్ధంగా లేనివారు, మూర్ఖంగా ఆలోచించేవారు. ఆత్మసాక్షాత్కారం పొందలేరు. ఎందుకంటే వీరు ఎన్ని ప్రయత్నములు చేసినా వీరి ప్రయత్నములు వక్రమార్గంలో నడుస్తాయి. చిత్తశుద్ధి ఉండదు. ఆ కారణంగా వీరికి అత్మసాక్షాత్కారం కలుగదు. అటువంటి వారికి గురువు గారి మార్గదర్శకత్వము అవసరము.
ఇప్పటి వరకు కృష్ణుడు అర్జునుడికి అత్మ, పరమాత్మ తత్వములను గురించి ఉపదేశించాడు. పరమాత్మ యొక్క అంశయే అంటే ప్రతిబింబమే ఆత్మ అనీ, అది మనోబుద్ధి అహంకారాలతో చేరి జీవాత్మగా రూపొంచి బాహ్యప్రపంచంలో తిరుగుతూ ఉంటుందనీ, ఆ ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడానికి జ్ఞాననేత్రము కావాలనీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ పరమాత్మయే ప్రకృతి రూపంలో బాహ్యంగా ప్రకటితము అవుతున్నాడు. అంటే ఈ దేహంలో జీవుడుగా ఉన్నది ఆ పరమాత్మస్వరూపమే, బయట ప్రకృతిగా ఉన్నదీ ఆ పరమాత్మ స్వరూపమే. అంటే పరమాత్మ సర్వవ్యాపి. ఇక్కడ జీవుడు అంటే మనలో ఉండే చైతన్యము, బయట ఉన్న అఖండ చైతన్యమే శరీరంలో పరిమిత చైతన్యంగా ఉంది. ఈ విషయాన్నే పోతన గారు ప్రహ్లాదుడి నోటి వెంట పలికించాడు. "ఇందుకలడు అందు లేడు అని సందేహము వలదు. చకి సర్వోపగతుండు." అంటే ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహమే అక్కరలేదు. పరమాత్మ నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. అందుకే కళ్లు మూసుకొని నీలో ఉన్న పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపము అయిన ఆత్మను చూడు. కళ్లు తెరిచి బయట ఉన్న ప్రకృతి అంతటా నిండి ఉన్న పరమాత్మను చూడు.
*12. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్l*
*యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ది మామకమ్ll*
ఏ తేజస్సుతో అయితే సూర్యుడు ఈ సమస్తజగత్తును ప్రకాశింపజేస్తున్నాడో, ఆ సూర్యుని కాంతి పడిన చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశిస్తున్నాడో, అగ్ని ఏ తేజస్సు, వెలుగు, వేడి కలిగిఉన్నదో, అదిఅంతా నేనే.
ఈ శ్లోకంలో కృష్ణుడు సూర్యచంద్రుల, అగ్ని యొక్క విభూతుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ మనకు తేజస్సును ఇచ్చే మూడు మూల పదార్థాలు ఉన్నాయి. మొదటిది సూర్యుడు. ఆయనకు స్వయంప్రకాశకుడు. తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి స్వయం ప్రకాశము లేదు. సూర్యుడి వెలుగు పడితేనే ప్రకాశిస్తాడు. అగ్ని ఏదో ఒక చర్య వలన మాత్రమే వెలుగుతుంది. అంటే రెండు వస్తువుల రాపిడి వలన అగ్ని పుడుతుంది కానీ తనకు తానుగా అగ్ని పుట్టదు. అందుకే మనకు ప్రకాశమును ఇచ్చే విభిన్నమైన మూడు మూల పదార్థాలను ఉపమానాలుగా తీసుకున్నాడు కృష్ణుడు.
సూర్యుడు, సూర్యుని వలన చంద్రుడు ప్రకాశిస్తున్నారు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు. ఈ సూర్యుని తేజస్సు "అఖిలమ్" అంటే ఖిలము కానిది. కోట్ల సంవత్సరాల వరకు తరిగిపోనిది, నిరంతరం ప్రకాశిస్తూ మనకు వేడిని వెలుతురును అందిస్తూ ఉంటుంది. నూర్యుడి తేజస్సు ఉన్నంత వరకు చంద్రుడు కూడా ప్రకాశిస్తూ మనకు వెలుగును ఇస్తుంటాడు. అందుకే ఆచంద్రార్కం అంటే సూర్యుడు, చంద్రుడు ఉన్నంతవరకు అని అర్థం. సూర్యచంద్రుల వెలుగు పడితేనే గానీ ఏ వస్తువు మనకు కనపడదు. ఇది అందరికీ తెలుసు. అలాగే అగ్ని కూడా మండుతూ తన కాంతులను విరజిమ్ముతుంది. సూర్యుడు, చంద్రుడు లేని వేళల్లో మనం అగ్ని సాయంతోనే అగ్ని యొక్క వెలుగులోనే వస్తువులను చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రిళ్లు చంద్రుడు, అన్నివేళల్లో అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంటారు. ఈ సూర్య చంద్రులకు, అగ్నికి వెలుగును ఇచ్చి ప్రకాశింపజేసేది నేనే అని తెలుసుకో అంటున్నాడు. పరమాత్మ తరువాతి శ్లోకాలలో ఈ సూర్య తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని శక్తి ఈ ప్రకృతిలో ఏమేమి పనులు చేస్తున్నాయో, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరంగా తెలియజేసాడు పరమాత్మ.
(సశేషం)
(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
P793
No comments:
Post a Comment