Friday, July 30, 2021

మరణించు వాని లక్షణములు ముందుగా తెలుసుకొనుట(death identification)

మరణించు వాని లక్షణములు ముందుగా తెలుసుకొనుట  - 


      రోగులకు చికిత్స చేయు క్రమములో కొన్ని రకాల తీవ్రమైన జబ్బులు ఔషధములతో ఎంత ప్రయత్నించినను లొంగవు . అటువంటప్పుడు ఆరోగి మరణమును తప్పక పొందును.  మరణము సమీపించునకు మునుపే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏర్పడి రాబోవు మరణమును సూచించును . వీటిని అయుర్వేదము నందు అరిష్టములు అందురు. ఇటువంటి ప్రత్యేక లక్షణములను ఎంతో అనుభవము కలిగిన వైద్యులు మాత్రమే పసిగట్టగలరు. ఈ లక్షణములు వైద్యులు రహస్యముగానే ఉంచెదరు. 

         నేను మాత్రం వాటిని మీకు సంపూర్ణముగా వివరిస్తాను . 


   మరణ అరిష్టములు  - 


 *  కామెర్ల రోగములో వలే కళ్లు పచ్చగా ఉండి ముఖం , దవడలు మాంసముతో నిండి ఉండి రోగి భయముతో ఉండి శరీరం జ్వరం ఉన్నవాని వలే ఉండిన అరిష్టము. 

 *  మంచము మీద నుంచి లేవనెత్తిన వెంటనే మూర్చపోతాడు. ఎప్పుడు లేపినను ఇదే పరిస్థితి ఉండును. ఇట్టివాడు 7 దినములలో మరణించటం తథ్యం . 

 *  శరీరం నందు కొన్ని రోగాలు పైభాగము నందు , కొన్ని కింద భాగము నందు ప్రభావము చూపించును. అందు గ్రహణి అను రోగం అత్యంత తీవ్రము అయిన ఆ రోగి 15 దినముల కంటే ఎక్కువ బ్రతకడు . 

 *  పురాణరోగం పీడిస్తూ తిండి తక్కువ తింటూ అంతకు మించి మలమూత్రాదులు ఉన్నరోగి బ్రతుకుట దుర్లభం. 

 *  శరీరం కండ లేకుండా దుర్బలముగా ఉండి తిండి అధికంగా తినడం మరికొంత సమయం అవ్వగానే మరలా తినడం అరిష్టం. 

 *  ఇష్టము , బలవర్థకం , సర్వగుణసంపన్నం అయిన ఆహారం తినుచున్ననూ రోజురోజుకి శరీరం క్షీణించువాడు బ్రతకడు. 

 *  మూలగడం , ఆగి ఆగి ఆయసం రావడం , అతిసార రోగం , బలం ఉండదు , తీవ్ర దప్పిక , నోరు ఎండుకొని పోవడం వంటి లక్షణాలు అరిష్టం . 

 *  నేత్రములు పైకి పోవడం , కంఠం ఇరువైపులా ఉండు సిరలు ఆగకుండా కంపించడం , బలహీనత , దప్పిక , శరీరం ఎండుకు పోవడం వంటి లక్షణాలు అరిష్టం. 

 *  శిరస్సు , నాలిక , ముఖం తిరిగిపోవడం , కనుబొమ్మలు వాలిపోవడం , నాలిక మీద రుచిమొగ్గలు ముళ్ళు వలే పైకి తేలి ఉండటం వంటి లక్షణాలు అరిష్టం . 

 *  శిశ్నము పూర్తిగా లోపలికి పోయి వృషణములు కిందకి జారి బయటకి వచ్చినట్టు కనిపించినను లేక వృషణములు లోపలికి వెళ్లి శిశ్నము బయటకి వచ్చినట్టు కనిపించినను అరిష్టము . 

 *  మాంసం పూర్తిగా నశించి చర్మం , ఎముకలు మాత్రమే మిగిలి అస్థిపంజరంలా మారినవాడు 30 దినములలోపు మరణించును. 

 *  రెప్పలు వాచిపోయి దగ్గరకు రావు . శరీరం కృశించి , కండ్లు మకిలి , మాలిన్యము నిండి ఉండటం అరిష్టం . 

 *  రోగము సంభవించినను , సంభవించకున్నను ఎవ్వరి తలవెంట్రుకలు పట్టి లాగినను వానికి ఎంత మాత్రం నొప్పి తెలియకుండా ఉండునో వాడు 6 దినములలో తప్పక చచ్చును. 

 *  తలవెంట్రుకలుకు చమురు రాయకున్నను రాసినట్టుగా చమురుతో తడిచిన విధముగా ఉండునో వాడు జీవించడు . 

 *  శరీరం చిక్కిపోతున్ననూ ముక్కు దూలం మాత్రం కండతో బలంగా ఉండి శరీరం ఉబ్బురోగం లేకున్ననూ ఉబ్బినట్టుగా ఉన్నను అరిష్టం . 

 *  నాసారంధ్రములు పూర్తిగా మూసుకొని పోయినను , విశేషముగా తెరచుకొని ఉన్నను , వంకర పోయినను , ఎండిపోయినను ఆ రోగి బ్రతకడు. 

 *  దీర్ఘముగా ఊపిరి విడుస్తూ మరలా వెంటవెంటనే వాయువును లోపలికి తీసుకుంటూ మిగుల వేదనను అనుభవించువాడు జీవించడు. 

 *  మోకాలుతో మోకాలును చేర్చి వాయించుతూ రెండు పాదములను పైకి ఎత్తి గభాలున మంచం మీద వదులువాడు , సర్వదా ముఖమును అటుఇటు కదిలించుట అరిష్టం . 

 * గోళ్లను దంతాలతో కొరుక్కోవడం , తలవెంట్రుకలును  గోళ్లతో పట్టి తెంచుకొనుట , కర్రపట్టి నేలమీద గీయుట అరిష్టం. 

 *  మేల్కొన్న సమయములో దంతాలు కోరుకుట , బిగ్గరగా ఏడవడం మరలా అంతలోనే నవ్వడం వంటి లక్షణాలు కలిగి ఉన్నవాడికి వాడి శరీరంలో బాధలు వాడికే తెలియవు . ఇది అరిష్టం . 

 *  అతిగా నవ్వడం , కటకట మని శబ్దం చేయుట సకిలిస్తాడు , పాదాలతో మంచాన్ని కొట్టువాడు , ముక్కులు , చెవులు , కండ్లు వంటి రంధ్రములలో వ్రేళ్లు దూర్చుట అరిష్టం. 

 *  శిరస్సు బరువైపోయి మోయలేక కంఠం ఒకవైపుకు వాలిపోవడం , శరీరం బరువు మోయలేక నడుము వంగిపోవడం , అన్నం నోట్లో పెట్టిన దౌడలు వ్రేలాడిపోయి అన్నం జారిపోవడం అరిష్టం. 

 *  తెల్లవారుజామున ముఖం పైన చెమట పడుతూ ఉండును. ఇట్టి జ్వర పీడితుడు జీవించడు. 

 *  శ్లేష్మరూపం అయిన కళ్లే , మలము , శుక్రము ఇవి తేలిక పదార్దాలు అగుట చేత నీటిలో తేలును . కాని ఏ రోగి సంబంధం అయిన ఈ మూడు నీటిలో వేసిన మునిగిపోవునో ఆ రోగి జీవించడు. 

            పైన చెప్పిన లక్షణాలు ఒక్కో రోగిలో ఒక్కోలా ఉంటాయి. ఎంతో అనుభవం ఉన్న వైద్యుడు మాత్రమే ఆయా లక్షణాలను సరిగ్గా అంచనా వేయగలడు. 


     

No comments:

Post a Comment