Friday, November 17, 2023

ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -

ఒబేసిటీని తగ్గించుటకు ఆయుర్వేద ఔషధాలు -

     అంతకు ముందు పోస్టులో ఒబేసిటీ గురించి మీకు వివరించాను. ఇప్పుడు అది తగ్గించుకొనుటకు కొన్ని సులభ యోగాలు మీకు వివరిస్తాను.

 సులభ యోగాలు -

 * దేహశ్రమ అధికంగా చేయుట , మైధున ప్రక్రియ ఎక్కువ చేయుట .

 * అధిక దూరం నడవడం , జాగరణ చేయుట అనగా తక్కువ సమయం నిద్రించుట .

 * యావలు , చామలు వంటి సిరిధాన్యాలు వాడవలెను. నీరు ఎక్కువుగా ఉన్న అన్నము భుజించటం.

 * ఉదయాన్నే తేనెతో గోరువెచ్చని నీటిని తాగవలెను.

 * ఉదయాన్నే వేడి అన్నంగాని గంజి గాని తాగవలెను.

 * చవ్యము , జీలకర్ర, శొంటి, మిరియాలు , పిప్పిళ్లు , ఇంగువ, సౌవర్చ లవణం , చిత్రమూలం వీటిని సత్తుపిండి, నీరు, మజ్జిగ యందు కలిపి తీసికొనవలెను.

 * వాయువిడంగములు, శొంటి, యవాక్షారం , ఎర్రచిత్రమూలం, యావలు , ఉసిరిక రసం వీటి చూర్ణాలను మజ్జిగతో కలిపి సేవించినను శరీరం నందు కొవ్వు కరుగును.

 * త్రికటు చూర్ణం అనగా శొంటి, పిప్పళ్లు, మిరియాలు సమాన బాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఆహారం తీసుకున్న తరువాత ఒక పావు స్పూన్ మజ్జిగ లో కలిపి ఉదయం , రాత్రి సమయాలలో తీసికొనవలెను.

 * మారేడు లేత ఆకులను తీసుకుని నూరి ఉదయం , సాయంకాల సమయాలలో శరీరానికి బాగా పట్టించి ముఖ్యంగా చంకలు , గజ్జలు వంటి బాగాలలో పట్టించి గంట సమయం తరువాత స్నానం చేయుచున్న శరీరంలోని కొవ్వు పేరుకొని పోవడం వలన శరీరం నుంచి వచ్చు దుర్గంధం హరించును .

 * గోమూత్రం ప్రతినిత్యం 10ml నుంచి 15ml వరకు ఒక కప్పు నీటిలో ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న శరీరం సన్నబడును.

       ఒబేసిటీ తగ్గించుకొనుటకు ఔషధ సేవన ఒక్కటే సరిపోదు . మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోనవలెను . 

       
  పాటించవలసినవి -

      పాతబియ్యం , వెదురు బియ్యం, చామలు , కొర్రలు , ఆళ్ళు , జొన్నలు , యావలు , ఉలవలు, పెసలు , కందులు, మాసూరపప్పు, తేనె , పేలాలు, ఎక్కువ కారం, చేదు గల పదార్దాలు, వగరు కలిగిన పదార్దాలు, మజ్జిగ, వేయించిన వంకాయ (నూనె తక్కువ) , ఆవనూనె ఆహరంలో ఉపయోగించటం , పాయసం, ఆకుకూరలు , వేడినీరు తాగుట, ఎండ యందు తిరుగుట, ఏనుగు , గుర్రపు స్వారీ చేయుట , అధిక శ్రమ చేయుట , స్త్రీ సంగమం , నలుగు పెట్టుకొనుట , శనగలు, చిరు శనగలు , త్రికటుకములు, వాము తినటం, 

 పాటించకూడనివి - 

     చన్నీటి స్నానం, శాలి బియ్యం, గొధుమలు, అతిగా సుఖపడటం , పాలు , మీగడ , పెరుగు , పన్నీరు , మినుములు , కడుపు నిండా భోజనం , చెమట పట్టని ప్రదేశాలలో పని, చేపలు , మాంస పదార్దాలు , ఎక్కువసేపు నిద్రించడం , సుగంధ పదార్దాలు అతిగా వాడటం , తియ్యటి పదార్దాలు అతిగా తినటం , చద్ది అన్నం , చెరుకు రసంతో చేయబడిన అన్నం . 

       పైన చెప్పబడిన నియమాలు తప్పక పాటించినచో శరీరం నందు కొవ్వు తగ్గి శరీరం నాజూకుగా అవ్వును.

    

No comments:

Post a Comment