శరీరం నందలి 7 రకాల ధాతువులు కలవు.
1 - రసము .
2 - రక్తము .
3 - మాంసము .
4 - మేధస్సు
5 - మజ్జ .
6 - అస్థి .
7 - శుక్రము .
ఇవి శరీరమును పొషించును.
* ఓజస్సు -
శరీరం నందలి రసధాతువు మొదలు శుక్రధాతువు వరకు ఉండు సప్తధాతువుల యొక్క ఉత్క్రుష్టమైన తేజస్సే ఈ ఓజస్సు అని చెప్పబడును. అది స్నిగ్దముగా , నిర్మలంగా కొంచెం రక్తవర్ణము గా ఉండును. ఇది ముఖ్యముగా హృదయము నందు ఉండినను శరీరం అంతా వ్యాపించి ఉండును. ఇది నశించినచో జీవియు నశించును . దీనివలన ప్రాణి బ్రతికి ఉండును.
దీనివల్లనే దేహసంబంధమైన అనేక భావములు కలుగుచున్నవి. ఇది శరీరం యొక్క జీవిత స్థితికి ముఖ్యకారణం అయిఉన్నది. ఇది 10 బిందువుల ప్రమాణంతో
శరీరం నందు ఉండును.
కోపము , ఆకలి, ధ్యానము , దుఃఖము శ్రమ మొదలగు వాటివల్ల మనుజుడు యొక్క శరీరం మిక్కిలి దౌర్బల్యత్వం చెందును . శరీరం కాంతి నశించును.
పైన చెప్పిన కారణాల వలన ఓజస్సు తగ్గినప్పుడు చికిత్సా సమయంలో మధురద్రవ్యములను , పాలు , మాంసరసం , నెయ్యి , దూలగొండి మొదలగు ద్రవ్యములను వాడినచో ఓజస్సు వృద్ధిచెందును.
సప్తధాతువులు శరీరం నందు సంచరించు పద్దతి -
* రసము -
ఇది మిక్కిలి పలచగా ఉండును. చిన్న ప్రేగుకి సంబందించిన రసాయనుల ద్వారా హృదయముకి చేరి అచ్చట వడపోయబడి స్థూలసూక్ష్మ భాగములుగా విభజింపబడును . అందు స్థూలభాగము సర్వశరీరం నందు గల రసాయనుల ద్వారా వ్యాపించుతూ రక్తధాతువుని పోషించుచుండును.
* రక్తము -
ఇది శరీరం నందలి సిరల యందును , మాంసము నందు వ్యాపించి ఉండును. ఇది ధమనీ సహాయమున శరీరం అంతటా ప్రవహించుతూ కాలేయం , మూత్రపిండముల యందు శుద్ది అగును . రసధాతువు నుండి రక్తధాతువు ఏర్పడును .
* మాంసము -
ఇది నాళములలోని రక్తము ద్వారా పోషించబడుచూ ఉండును. ఇది కూడా స్థూలం , సూక్ష్మం , మలం అను విభాగాలు పొందును. సూక్ష్మంగా ఉండు భాగం మేధస్సుని చేరి పోషించబడుతూ ఉండును. ఇది రక్తధాతువు నుండి ఏర్పడును .
* మేథస్సు -
ఇది నెయ్యి వలే తెల్లగా ఉండును. ఇది కడుపులోను మరియు చిన్నచిన్న ఎముకలకు అంటియుండు కొవ్వుపదార్థం . మాంసము నందలి సూక్ష్మ భాగములచే ఇది పోషించబడును. ఇది కూడా స్థూల, సూక్ష్మ , మల భాగములుగా విభజించబడి ఎముకలను పోషించుచుండెను . ఇది మాంసధాతువు నుండి ఏర్పడును .
* అస్థి -
ఇది మేధోధాతువుచే పోషింపబడుచూ శరీరం యొక్క పటుత్వమునకు ప్రధాన హేతువుగా ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఇది మజ్జా ధాతువుని పోషించుతూ ఉండును. ఇది మేధోధాతువు వలన ఏర్పడును .
* మజ్జ -
ఇది బోలు ఎముకలో ఉండు పచ్చని కొవ్వు వంటి పదార్థం . ఇది అస్థిధాతువు చే పెంచబడును. ఇది స్థూలం , సూక్ష్మం , మలం మూడు బాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో స్థూలభాగం మజ్జభాగంలో చేరుచూ ఉండును. సూక్ష్మ భాగం శుక్రధాతువు ని పొషించుచుండును . ఇది అస్థిధాతువు వలన ఏర్పడును .
* శుక్రము -
ఇది శరీరం నందు అంతటా ఉండు మజ్జాధాతువు యొక్క సూక్ష్మభాగం . ఎముకలలో ఉండు అతి సూక్ష్మ రంధ్రముల ద్వారా పైకి వచ్చి రక్తముతో కలిసి సిరల గుండా ప్రవహించుచూ సూక్ష్మ శుక్రద్రవము ను పోషింపుచూ ధమనీ సహాయంతో బీజకోశములలోకి చేర్చబడును . ఇది స్థూల సూక్ష్మ అను రెండు భాగములుగా విభజింపబడును. అందు స్థూలభాగం శుక్రమును , సూక్ష్మ భాగం ఓజస్సు పోషింపబడును. ఇది మజ్జా ధాతువు వలన ఏర్పడును .
ధాతువులకు ఉపధాతువులు -
రసధాతువుకు స్తన్యము , రక్తధాతువు కు స్త్రీల రజస్సు, మాంసధాతువుకు వస అనెడి చమురు , మేధోధాతువుకి చెమట, అస్థిధాతువుకి దంతములు , మజ్జాదాతువుకి వెంట్రుకలు , శుక్రధాతువుకి ఓజస్సు , వీటిని ఉపధాతువులు అనబడును.
No comments:
Post a Comment