షడ్రసముల గురించి సంపూర్ణ వివరణ - 2 .
కటు( కారము ) రసము గుణము -
కటు రసము నాలుకకు తగిలినంత మాత్రమే ముక్కును కార్చును . యావత్ శరీరం కంపించును . దీనిని స్వల్పమోతాదులో ఉపయోగించినచో కొన్ని సద్గుణాలు కలవు . ముఖశుద్ధి చేయును . జఠరాగ్ని పెంపొందించును . ఆహారమును శుష్కిoపచేయును . కన్నీరు వచ్చునట్లు చేయును . కఫ సంబంధ జిగురు పోగొట్టును . శరీరవృద్ధి ( శరీరపు లావు ) తగ్గించును . క్రిములను హరించును . వ్రణములు పగులునట్లు చేయును . శ్రోతో నిరోధము ( శరీరం నుండి బయటకి వ్యర్ధాలు వెడలు మార్గములు ) పొగొట్టి విశాలము చేయును .
అధికంగా సేవించిన శుక్రము నశించును . మైకము కమ్మును . తల తిరుగును . కంఠము నందు , శరీరము నందు మంటలు పుట్టును . దప్పిక పుట్టి బలము నశించును . వాతరోగములు పుట్టుటకు కారణం అగును .
* తిక్త ( చేదు ) రసము గుణము -
తిక్తరసము నాలుకకు తగిలినవెంటనే కంఠము నందు లాగుచున్నట్లు అనిపించును . ముఖము నందలి ( నోటియందలి ) జిగురు పోగొట్టి రోమాంచనం ( వెంట్రుకలు నిక్కబొడుచుకొనునట్లు ) కలుగచేయును . చేదు నాలుకకు రుచిగా అనిపించకున్నను నోటి యందలి అరుచిని పోగొట్టి ద్రవ్యములను రుచిగా ఉండునట్లు చేయును . శారీరక విషాలను హరించును . జ్వరములను హరించును . కుష్ఠు రోగము నందు ఉపయుక్తము . క్రిమి నాశకము , స్తన్యమును శుద్ధిచేయును . మాంసమును దృఢపరచును . జీర్ణకారి . శరీరం నందు ఎచ్చటి నుండి ఐనా జలం వంటి పదార్థము వెడలుచున్న దానిని ఆపును . శరీరపు కొవ్వు , మజ్జి , వ్రణములు నుండి కారు రసి , చీము , మూత్రము వంటి జల సంబంధమైన వాటిని ఎండించును .
దీనిని అతిగా ఉపయోగించిన ధాతువులన్నినింటిని నాశనం చేయును , శరీరం నందు గరుకుతనం కలిగించును . బలం తగ్గును శరీరం కృశించును . వాతరోగములు పెరుగును .
* కషాయ( వగరు ) రసము గుణము -
కషాయ రసము నాలుకకు తగిలింత వెంటనే నోరు ఎండిపోయి నాలిక స్థంభించును . కంఠమును బంధించును . హృదయమును పట్టి లాగి సంకోచింపచేయును . గుండెని ఒత్తునట్టు బాధ కలుగచేయును .
ఈ వగరు రసము స్వల్పప్రమాణములో భుజించిన సద్గుణములు కలవు . కఫ, రక్త , పిత్త వికారముల యందు ఉపయుక్తము . శరీరద్రవాలను ఆర్చును . వ్రణములను పగలగొట్టును .
దీనిని అతిగా సేవించుట వలన నోటి రోగములు కలుగును . హృదయము నందు బాధ కలిగించును . ఉదరము ఉబ్బునట్లు చేయును . మలమూత్రములు వంటి వ్యర్ధాలను బయటకు పంపు మార్గాలను బంధించి శరీరముకు నలుపు తెచ్చును . శుక్రమును నాశనం చేయును ఆర్థిత వాతము , పక్షవాతము వంటి వాతరోగములను కలుగచేయును .
కావున ప్రతి రసమును మన ఆహారములో భాగము అయ్యేలా చూసుకొన్నచో మన శరీరము ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది.
No comments:
Post a Comment