అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .
ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి
* హస్తము .
* పాదము .
* కంఠము .
* నాస 2 వైపులా .
* 2 చేతుల మణి బంధనముల యందు .
* 2 పాదముల చీలమండల యందు .
* ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను .
హస్తనాడి -
శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును .
ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును .
హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే
పరీక్షించెదరు .
పాదనాడి -
పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను
కంఠనాడి -
గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు .
నాసా నాడి -
చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును .
నాడిని పరీక్షించు విధానము -
వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను .
స్త్రీపురుషుల నాడి బేధము -
పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి .
అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది .
No comments:
Post a Comment