Monday, February 28, 2022

మర్మకళ - శరీరం నందు ఉండు మర్మస్థానములు

మర్మకళ  - శరీరం నందు ఉండు మర్మస్థానములు  

        మర్మ కళ అనే యుద్ధవిద్య భారతీయ ప్రాచీన రహస్య యుద్ధవిద్యలలో ఒకటి. ఈ యుద్దవిద్య ఎక్కువుగా కేరళలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఈ విద్యకు మూలపురుషుడు పరమశివుడు . దీనికి వర్మ కళ అని మరొక పేరుతో కూడా వ్యవహరిస్తున్నారు.

            మనిషియొక్క శరీరంలో ప్రాణశక్తి అనేది శరీరములో గల పది మార్గాలనుంచి పైనుంచి క్రిందకి , క్రింద నుంచి పైకి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ మార్గాలను "దశ నాడులు " అని పిలుస్తారు . ఈ ప్రాణశక్తి ప్రవహించే మార్గాలలో ఎటువంటి అడ్డు ఏర్పడినపుడు మనుష్యునికి రోగాలు సంభవిస్తాయి. శరీరములో రక్తం ప్రవహించుటకు రక్తనాళాలు ఎలా ఉన్నాయో అదేవిధముగా వాయువు శరీరం అంతా పరిభ్రమించుటకు కొన్ని ప్రత్యేక మార్గాలు కలవు. ఈ మార్గాలనే నాడులు అని పిలుస్తారు . ఈ నాడులు లో వాయవు ఉంటుంది. పైన చెప్పిన ప్రాణశక్తి అనేది వాయవు రూపంలో ఉంటుంది.

            మర్మస్థానం గురించి వివరించాలి అంటే అదొక ట్రాఫిక్ జంక్షన్ లాంటిది. జంక్షన్ లో సమస్య లేనంతవరకు వాహనాలు ఎటు వెళ్ళేవి అటు ప్రశాంతముగా వెళ్తాయి. ఏదన్నా సమస్య వస్తే ఒకదానివెంట ఒకటి ఆగి సమస్య ఎలా వస్తుందో అదేవిధముగా మర్మస్థానము పైన దెబ్బ తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా మార్పు వస్తుంది . అవయవాలు చచ్చుబడుట , కోమాలోకి వెళ్లడం , మరణించడం ఈ మూడు రకాల సమస్యలు సంభంవించును. ఏ సమస్య అనేది మర్మస్థానం మరియు మర్మస్థానం పైన దెబ్బ ఎంత బలంగా తగిలింది అనేదానిని బట్టి ఉంటుంది.

         మనుష్య శరీరములోని సిరలు గురించి చెప్పాలంటే వాత , పిత్త , కఫ , రక్త వాహకాలు అని నాలుగు రకాలుగా ఉంటాయి.ఇవి మొత్తం 700 సిరలు శరీరం నందు ఉండును. ఈ సిరలును ఆశ్రయించి మర్మస్థానాలు ఉంటాయి. ఈ మర్మ స్థానముల యందు దెబ్బ తగిలినప్పుడు లేదా గాయం అయినపుడు ప్రాణానికి ముఖ్యమైన రక్తం అధికంగా స్రవించును . రక్తము వలనే మిగిలిన ధాతువులు అన్నియు వృద్ధిచెందుతూ ఉండును. గాయం వలన రక్తం అధికంగా పోయినచో శరీరం నందలి మిగిలిన ధాతువులు క్షీణించును. ఎప్పుడైతే ధాతుక్షయం జరిగినదో వాతం ఒక్కసారిగా వృద్దిచెంది తేజోరూపమైన పిత్తమును ప్రేరణ చెందించును. దీనివల్ల దెబ్బ లేదా గాయం అయిన మర్మస్థానం నందు మిక్కిలి తీవ్రమైన మంట, పోటు మున్నగు బాధలు కలుగును. తీవ్రమైన దప్పిక , శోష , భ్రమ కలుగును. ఆ తరువాత శరీరం పైన తీవ్రంగా చెమట పట్టి అవయవాలు చచ్చుబడుతూ నరకాన్ని అనుభవిస్తూ మరణిస్తాడు. పైన చెప్పిన లక్షణాలన్నీ మర్మస్థానం పైన దెబ్బ తగిలినప్పుడు సంభంవించును. ఈ అత్యంత ప్రాచీన రహస్యమైన మర్మకళ ని సంపూర్ణంగా అభ్యసించిన వ్యక్తికి మాత్రమే మనుష్య శరీరంలో మర్మ స్థానాలు ఎక్కడ ఉంటాయో చక్కగా తెలుస్తుంది. ఈ మర్మస్థానాలనే మన తెలుగుభాషలో ఆయువుపట్లు అంటాము.

                          ఇప్పుడు మీకు మర్మస్థానముల గురించి  వివరిస్తాను. మనుష్య శరీరం మొత్తం మీద 107 మర్మస్థానాలు ఉండును. నాకున్న పరిధినిబట్టి కొంత సమాచారం మాత్రం మీకు వివరిస్తాను. తొడలు ,చేతులు ఈ నాలుగు అంగముల యందు ఒక్కోదానియందు 11 మొత్తము 44 . ఉదర భాగము నందు 3 , రొమ్ము భాగము నందు 9 , వీపున 14 , కంఠము పై భాగము నందు 37 ఉండును. ఇవ్వన్ని కలిపి మొత్తం 107 మర్మములు ఉండును.

          ఆయా భాగములలోని మర్మస్థానాలలో దెబ్బలు గాని గాయాలు గాని సంభవించినపుడు కలుగు విపరీత పరిస్థితుల గురించి మీకు వివరిస్తాను. కాలు యందు ఉండు పదకొండు మర్మస్థానములలో ఒకటి నడిమివేలికి అభిముఖంగా , పాదమధ్య భాగము నందు తల హృదయమును మర్మస్థానం ఉండును. ఈ స్థానము నందు దెబ్బ తగిలినచో తీవ్రమైన నొప్పి కలిగి వెంటనే మరణం సంభంవించును. బొటనవేలికి మరియు మిగిలిన వేళ్ళకి మధ్య క్షిప్రం అను మర్మస్థానం ఉండును. ఈ ప్రదేశము నందు దెబ్బ తగిలినచో అవయవాలు చచ్చుబడి మరణం సంభంవించును. క్షిప్ర మర్మస్థానము నకు రెండు అంగుళాల పైభాగము నందు కూర్చమ్ అను మర్మస్థానం ఉండును. దీనిపైన దెబ్బ తగిలినచో పాదము నందు వణుకు పుట్టును .

           కీలు భాగము నందు ఉండు మర్మలో దెబ్బ తగిలినచో నొప్పి కలిగి కీలు యొక్క గమనం మందగించును. పిక్క మధ్యభాగము నందలి దెబ్బ తగిలి రక్తం వెడలి ఎక్కువ మోతాదులో బయటకి పొయినచో ఆ వ్యక్తికి మరణం తప్పదు. కావున గాయం అయిన వెంటనే రక్తం బయటకి పోకుండా జాగ్రత్త పడవలెను. పిక్కకి మరియు తొడ మధ్యభాగము నందు ఉండు కీలు నందు జాను అను మర్మస్థానం ఉండును. అక్కడ దెబ్బ తగిలినచో మరణించును. ఒకవేళ చికిత్స ద్వారా కాపాడబడినను కుంటితనం సంప్రాప్తిస్తుంది.

        పైన చెప్పిన విధముగా అనేక మర్మస్థానములు మన యొక్క శరీరం నందు ఉండును. వాటిలో కొన్నిస్థానాల పైన దెబ్బలు తగిలితే వెంటనే మరణం సంభంవించును. మరికొన్ని స్థానాలలో దెబ్బలు తగిలితే కొన్నిరోజుల సమయంలో హఠాత్తుగా మరణించటం జరుగును. మరికొన్నిసార్లు శాశ్వత అంగవైకల్యం లేదా తాత్కాలిక అంగవైకల్యం సంప్రాప్తినిచ్చును . ఈ మర్మస్థానం ల యందు దెబ్బలు తగలడం వలన వచ్చు జబ్బులకు 
అత్యంత కష్టసాధ్యముతో నయం చేసినప్పటికీ దానిప్రభావం మాత్రం పోదు .

            మర్మకళ ని నేర్చుకోవాలి అనుకునే వ్యక్తికి చాలా అత్యంత కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. ఈ విద్య అందరికి లభించదు. మనస్సుపైన , తన యొక్క భావావేశాలును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి మాత్రమే ఈ విద్య నేర్చుకోగలుగుతాడు .

      చివరగా చిన్న విషయం చిన్నపిల్లల తలపైన మొట్టికాయలు వేయడం ప్రమాదకరం ఆ స్థలములో కూడా మర్మస్థానాలు ఉంటాయి. ఒక్కోసారి ఆ స్థానాల్లో దెబ్బ తగలడం వలన విపరీత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

     

No comments:

Post a Comment