అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 3 .
నాడి చూడకూడని వారు -
అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు .
నాడుల పేర్లు - వాటి స్థానములు .
నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి .
ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు .
ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము .
సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును .
ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి .
No comments:
Post a Comment