అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 6 .
మూత్రపరీక్షా విధానము -
మూత్రపరీక్ష చేయవలసిన రోగిని 4 ఘడియల తెల్లవారుజామున నిద్రనుంచి మేల్కొలిపి మూత్రము మొదటి ధార ( మొదట కొంత వదిలి) తరవాతి ధార నిర్మలమగు తెల్లని పాత్ర యందు కాని కుండపెంకు నందు గాని విడుచునట్లు చేసి దానిని సూర్యరశ్మి యందు ఉంచి గడ్డిపోచతో బాగుగా కలియబెట్టి దాని యందు తైలము చుక్కలుచుక్కలుగా వేసి దాని మార్పులను బట్టి దోష వ్యాధి బేధములను తెలుసుకొనవలెను .
ఆరోగ్యవంతునకు మూత్రము లఘువుగాను తెల్లగా ఉండును . పిత్త ప్రకృతి గలవానికి పసుపుపచ్చగా వేడిగా ఉండును . శ్లేష్మప్రకృతి గలవానికి నూనె వలే ఉండును . వాత శ్లేష్మ కలగలసిన వాని మూత్రము చిక్కగా , తెల్లగాను , రక్తవాత ప్రకృతి కలవానికి కుసుంబా పుష్పము వలే మూత్రము ఉండును .
వ్యాధి లక్షణము లేవియు లేక కేవలము మూత్రము చెడుగా కనపడినచో రోగమున్నట్లు నిర్ధారణ చేయకూడదు . అనగా ఇతర వ్యాధి లక్షణములు ఉన్నప్పుడే మూత్రము చెడిపోయినచో రోగము ఉన్నదని నిర్ధారణ చేసుకొనవలెను .
వాత దుష్ట మూత్రము -
వాతదోషము వలన చెడిపోయిన మూత్రము నూనె వలె మకమకలాడుచుండును . నలుపు పసుపు కలిసిన కొంచము నల్లని వర్ణము కలదిగా కాని కొంచము ఎర్రగా గాని ఉండును . ఇట్టి మూత్రము పైన ఒక నూనె చుక్కను వేసిన ఆమూత్రము యొక్క పైభాగము అంతటను వ్యాపించి వెంటనే చిన్నచిన్న నూనె కణములు పైన కలిగిన చిన్నచిన్న బుడగలుగా బయలుదేరును . అట్టి దానిని వాత దుష్ట మూత్రముగా తెలుసుకొనవలెను .
మరియు మూత్రము నందు తైలబిందువులు మండలాకారముగా మార్పు చెందిన వాతరోగము అని గుర్తించవలెను . కొందరు వాతరోగుల మూత్రము ఘృతము ( నెయ్యి) వలే ఉండును .
పిత్త దుష్ట మూత్రము -
పిత్త దోషము చేత చెడిన మూత్రము ఎర్రగా ఉండును . దాని పైన నూనె చుక్క వేసినచో బుడగలు పుట్టును . పిత్తవ్యాది నందు మూత్రము నందు తైలము వేసినచో బుద్బుదాకారము చెందును . పిత్తరోగి మూత్రము నురుగులతో కూడి ఉండి పులికడుగు రంగుననైన లేక మాదిఫల రస ( కాఫీ రంగు ) రంగు కలిగి ఉండును .
శ్లేష్మ దుష్ట మూత్రము -
శ్లేష్మ దోషము వలన చెడిన మూత్రము నురుగులతో కూడుకుని ఉండును . చిన్నచిన్న గుంటలలో ఉండు బురద నీటివలె ఉండును . చిన్నచిన్న బిందువుల ఆకారము దాల్చును . శ్లేష్మరోగి మూత్రము శీతలముగా ఉండును .
అపక్వ పిత్తదోషము వలన చెడిన మూత్రము తెల్ల ఆవనూనె వలె ఉండును .
వాతపిత్తములచే దూషితమైన మూత్రము పైన నూనె చుక్క వేసినచో కొంచము నల్లని రంగుగల బుడగ తేలును .
వాతాశ్లేష్మములచే దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును .
పిత్తశ్లేష్మము వలన దూషితమైన మూత్రము నందు నూనె వేసినచో మూత్రము వెంటనే నూనెతో కలిసిపోయి పులిసిన బియ్యపు గంజి వలె అగును .
పిత్తశ్లేష్మముల రెండింటివలన దూషితమైన మూత్రము బూడిద రంగు కలిగి ఉండును . 3 దోషములు ప్రకోపించిన యెడల మూత్రము ఎర్రగా గాని నల్లగా గాని ఉండును . అందు పిత్తము మిగిలిన రెండింటి కంటె ఎక్కువ ప్రకోపించిన పైభాగము పచ్చగాను కింది భాగము ఎర్రగా కనిపించును .
జ్వరము నందు రసము శేషించినచో మూత్రము పాలవలె ఉండును . పక్వ జ్వరము నందు మేకమూత్రము వలె ఉండును . క్షయ యందు మూత్రము నల్లగా ఉండును . క్షయరోగి మూత్రము నందు నూనె బొట్టు వేసినచో చేప , మేడ , వింజామరం , ఏనుగు , గొడుగు , తోరణముల ఆకారము కనిపించినచో వ్యాధి నయం చేయవచ్చు . తీగె , మద్దెల , మనిషి , చక్రము , సింహము వలే నూనె వికసించిన ఆ రోగము కష్టసాధ్యము . తలలేని మనిషి ఆకారము , స్తంభాకారముగా నైనను కనిపించిన రోగి మృతిచెందును .
అతిసార రోగము నందు రోగి యొక్క ముత్ర అడుగు భాగము రక్తవర్ణముగా ఉండును . జలోదరము నందు నేతి కణము వలె ఉండును . ఆమవాతము నందు మూత్రము వస లేక మజ్జిగ వలె ఉండును . వాత జ్వరం నందు కుంకుమ వలె ఎర్రగాను లేక ఎరుపు పసుపు కలిసిన వర్ణముగాను లేక మలినముతో కూడిన పీతవర్ణముగాను అధికంగా వెడలును . పిత్త జ్వరం నందు పసుపు వర్ణముగా స్వచ్ఛముగా ఉండును . సమధాతువు నందు కూప జలము వలె ఉండును . సన్నిపాత జ్వరం నందు కృష్ణవర్ణము ( నల్లని ) కలిగి ఉండును . జ్వరము ఆరంభమయ్యే దశలో రక్తవర్ణము లేక ధూమ్ర వర్ణముగా ఉండును . దీర్ఘరోగము నందు రక్తవర్ణముగా ఉండును . మూత్రము నల్లని రంగులో ఉండిన మరణము చెందును . ప్రమేహరోగము నందు కూడా మూత్రము రక్తవర్ణములో ఉండును .
దీర్ఘాయుష్మంతుని ముత్ర లక్షణము -
మూత్రము నందు వేసిన తైలబిందువు హంస , కన్నె లేడి , పూర్ణతటాకము , కమలం , ఫలములు , సంపూర్ణ శరీరము , చక్రము , తోరణముల ఆకారంగా కనపడిన దీర్ఘాయుష్షు కలిగినవాడగును .
* సమాప్తం *
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
No comments:
Post a Comment