Wednesday, February 9, 2022

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 .

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 . 

     ఇప్పటివరకు మీకు అష్టస్థాన పరీక్షలలో మొదటిదైన నాడీపరీక్ష గురించి వివరించాను . ఇప్పుడు మిగిలినవాటి గురించి వివరిస్తాను . 

 * స్పర్శము - 

     స్పర్శము అనగా తాకుడు . రోగి యొక్క శరీరాన్ని తాకి చల్లదనము , గరుకుతనము , చమట , ఆవిరి మున్నగు వాటిని గుర్తించుట . 

  వాతము - 

     వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చిన్నగా చల్లదనం పెరుగుచుండును . 

  పిత్తము - 

     పిత్తము నందు శరీరము వేడిగా ఉండును . 

  శ్లేష్మము - 

     శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును . 

     జ్వరము నందు శరీరము పొగలుగా , తాపముగా , ఉష్ణము మరణముగా ఉండును . చనిపోవువానికి శరీరము కొయ్య బారిపోవును . 

 *  రూపము  - 

       వాతము నందు శరీరము నలుపు , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి కనపడును . ఆయా వ్యాదులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును . పాండు వ్యాధి నందు శరీరము తెల్లని రంగు కలిగి పాలిపోయి ఉండును . క్షయ వ్యాధి యందు శరీరము ఆరిపోవును . శరీరము నందు కొవ్వు ఉండదు . కామెర్ల వ్యాధి నందు శరీరము పచ్చగా ఉండును . ఇలా ఆయా వ్యాధులను బట్టి శరీరం రూపము మారుచుండును . 

 *  శబ్దము - 

       శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని వాతము నందు శబ్దము నందు హెచ్చు తగ్గులు కలిగి ఉండి నిలకడ లేకుండా ఉండును . పిత్తము నందు అధికంగా , ఉత్సాహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును . భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధుల యందు రోగి అతిగా ధ్వని కలవాడై ఉండును . అనగా అతిగా మాటలాడువాడై ఉండును . వికృతముగా అరుచును . రహస్యములు అన్నియు పైకి చెప్పును . భయము , సిగ్గు , దుఃఖము మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును . ఇలా అన్నింటికి తెలుసుకొనవలెను . 

 *  నేత్రములు - 

      ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష . వాతము నందు కండ్ల చుట్టూ గుండ్రని నలుపు బయలుదేరును . వీర్యనష్టము నందు కూడా ఇటువంటి లక్షణాలు కనిపించును . వాతము నందు బూడిద వర్ణముగా కొంచం నీరు కూడా చేరుచుండును . పిత్తరోగము నందు నేత్రములు పసుపుగాను , ఎర్రగాను త్వరగా పూసులు కట్టును . శ్లేష్మము నందు బరువుగాను తెల్లని పూసి కలిగి నీరు కారుచుండును . 

 *  మల పరీక్ష  - 

      వాతరోగము నందు మలబద్దకం కలుగును . మరియు పురీషము ( మలం)  నల్లనై మిక్కిలి కఠినంగా ( గట్టిగా ) వెడలుచుండును . పిత్తవ్యాధి యందు పసుపుపచ్చగానైనా ఎర్రగా రక్తముతో కూడినదై ఉండును . మరియు మృదువుగా ధారాళముగా విరేచనమగును . శ్లేష్మ వ్యాధుల యందు మలము తెల్లగనను , అజీర్తిగను , బంకగను , నురుగుతో గట్టిగా వెడలుచుండును . ఏవైనా రెండురకాల దోషముల యందు రెండు రెండు లక్షణములుగా ఉండును. వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తచారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్ధకముగా ఉండును . అనాహము , ఆధ్మానము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్ట ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును . అతిసారం మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతట నిండి బుడబుడమనే ధ్వనితో పలుమారు వెడలుచుండును . 

            పాశ్చాత్య వైద్యులు మలమును నీటి యందు వేసి పరీక్షించెదరు . నీటి యందు మలము వేసినప్పుడు విడిపోయిన , పైకి తేలినను వాతమనియు , కలిసిపోయిన పిత్తమనియు , నీటి అడుగుపోయిన శ్లేష్మము అనియు తెలుసుకొనెదరు . మలము యొక్క వాసన వర్ణము ( రంగు ) పరిమాణము బట్టి కూడా దోషములను వ్యాధులను పరీక్షించెదరు . 

 
                        

No comments:

Post a Comment