ఉసిరికాయను సంస్కృతంలో ఆమలకి , శ్రీఫలా , ధాత్రికా , అమృతా అని అంటారు.
ఉసిరిచెట్టు పెద్ద వృక్షం , ఆకులు సన్నగా చింతాకు వలే ఉండును. పువ్వులు సన్నగా కాడల వెంట పచ్చగా పూయును. కాయలు గుండ్రముగా సన్నని ఆరురేఖలు కలిగి ఉండును. ఈ కాయలు ఫాల్గుణ మాసాంతం మొదలు పండుట ఆరంభించును. చైత్రమాసంలో పండి పరిపూర్ణంగా ఉండును. అప్పుడు తెచ్చి ఎండించి దాచి సంవత్సరం వాడవచ్చు . కాయపైన బెరడు ఔషధాల్లో ఉపయోగిస్తారు . ఇవి సర్వత్రా తోటల్లో అరణ్యాలలో ఉండును.
ఉసిరికాయ ఉపయోగాలు -
* ఉసిరికాయ వగరుగా, పులుపుగా , మధురంగా ఉండును. శీతలతత్వం కలిగి ఉండును.
* ఉసిరికాయ ఆయువు మరియు ఆరోగ్యాలను ఇచ్చును.
* శరీరంలోని వేడిని , వాంతిని , ప్రమేహాన్ని , నంజును హరించును .
* కఫాన్ని హరించును . రుచికరంగా ఉండును.
* రక్తములో దోషాన్ని హరించును . శరీర శ్రమని పోగొట్టును .
* మలబద్ధకాన్ని పోగొట్టును . కడుపుబ్బరాన్ని తగ్గించును . అమృతంతో సమానం అయినది.
* ఉసిరికాయ కరక్కాయతో సమానమైన గుణం కలిగినది . రక్తపిత్త రోగాన్ని పోగొట్టును .
* ధాతువృద్ధిని కలిగించును. వాతం, పిత్తం, కఫం మూడింటిని హరించును . త్రిదోష హరమైనది.
* వెంట్రుకలకు మేలు చేయును . మంచి విరేచనకారి.
* నోరు అరుచి రోగమును పోగొట్టును . తొందరగా ముసలితనం రానివ్వదు.
* శరీరంలోని విషపదార్ధాలను హరించును . జ్వరాన్ని తగ్గించును .
* ఎండించిన ఉసిరికాయలను తీసుకొవడం వలన విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోనును.
* నేత్ర సంబంధ సమస్యలు ఉన్నవారు ఎండించిన ఉసిరికాయలు తీసుకోవడం వలన చాలా మంచి మేలు జరుగును.
* ఎండించిన ఉసిరికాయలను అరగదీసి శరీరముకు గంధం వలే పూయుట వలన శరీరం యొక్క కాంతి పెరుగును .
* శరీరము నందు కొవ్వు ఉన్న సమస్యతో ఇబ్బంది పడువారు ఎండించి ఉసిరికాయలను సేవించుట వలన కొవ్వు కరుగును.
* ఉసిరికాయలు నుంచి తీసిన ద్రవము త్రిదోషములను , రక్తదోషమును , పిత్తమును , మోహమును నాశనం చేయును .
* ఉసిరికాయ పచ్చడి అన్నం మొదటిముద్దలో తినడం వలన జీర్ణరసాలు సరిగ్గా ఊరతాయి.
* ముత్ర విసర్జన సమయంలో మంట , నొప్పి ఉంటే ఉసిరి కషాయం బెల్లంతో కలిపి తీసుకుంటే మంచి ఉపశనం ఉంటుంది.
* రాచ (పెద్ద ) ఉసిరి గింజలను బూడిదగా మార్చి కొబ్బరినూనెలో కలిపి చిక్కగా చేసి రాస్తుంటే శరీరం పైన వచ్చు చిడుము నివారణ అగును.
* ఉసిరికాయల కషాయం అరకప్పు తాగుతుంటే జ్వరం తగ్గును.
* ఆవనూనెలో రాచ ఉసిరికాయలు వేసి ఉసిరికాయలు మునిగేంత వరకు నూనె పోసి వారం రోజులు నానబెట్టి పైన తేరుకున్న నూనెని తలకు రాయుచున్న తలతిప్పు రోగం నయం అగును.
* ఉసిరికలో "సి" విటమిన్ పుష్కలంగా ఉంది. కావున "సి" విటమిన్ లోపం వలన వచ్చు వ్యాధులకు అద్భుత ఔషధం .
* "స్కర్వి" అనే ఈ వ్యాధిలో ఉసిరి అత్యద్భుత ఔషధం . ఈ వ్యాధి సముద్రప్రయాణం ఎక్కువుగా చేసే వారికి వచ్చును.
* ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఉసిరికాయలు తినుచున్నచో ఎక్కిళ్లు వెంటనే తగ్గును.
* ఉసిరికాయల రసంలో పసుపుకొమ్ము చూర్ణం కలిపి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి ఉదయం , సాయంత్రం రెండు పూటలా తీసుకుంటూ చప్పిడి పథ్యం పాటిస్తే కామెర్ల వ్యాధిని తగ్గును.
* పేగుల్లో పురుగులు ఉన్నప్పుడు పెద్ద ఉసిరికాయలు తింటూ ఉంటే కడుపులో పురుగులు నశించును.
* పెద్ద ఉసిరికాయలను ఎండబెట్టి చూర్ణం చేసి దానికి సమానంగా పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం , సాయంత్రం రెండుపూటలా అరచెంచా చొప్పున తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* కళ్లు ఎరుపెక్కి మంట పుడుతుంటే ఎండిన పెద్ద ఉసిరికాయలను గ్లాసెడు మంచినీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన ఆ నీటితో కంటిని కడుగుచున్న కంటి ఎరుపు తగ్గును.
* ఉసిరికాయల రసం తీసి అందులో కొంచం పంచదార కలిపి చేతి వ్రేలితో యోని రంధ్రంలో ఆ రసం వ్రాస్తే యోనిమంట తగ్గును.
ఉసిరికాయలు దొరికినప్పుడు వాటిని ముక్కలుగా కోసి ఎండించి దాచుకొనవలెను. ఉసిరికాయలు దొరకనప్పుడు వాటిని వాడుకోవచ్చు . అలా ఎండిన వాటిని "ఉసిరిక వొరుగు " అని పిలుస్తారు .
No comments:
Post a Comment