Wednesday, July 9, 2025

గురువున్నవాడు భాగ్యశాలి!

*గురువున్నవాడు భాగ్యశాలి!* ✍️

**గురుస్సాక్షాత్ పరబ్రహ్మ!* 
 (సమస్త గురువుల పాదపద్మములకు ఈఅక్షర కుసుమాల మాల అంకితం) 


**మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది...!!!*
ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది..!
ఇది గురువు మాత్రమే చెయ్యగల గమ్మత్తు...!!! 


**ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు...!!!* 
సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు,గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు...!!!


**గురువు చూపుయే ఉపదేశం...!!!* 
గురువు జీవితమే ఓ సందేశం...!
గురువు పలుకులే ఉపనిషత్తుల సారాంశం...!!
గురువు స్పర్శయే ముక్కోటి దేవతల ఆశీర్వాద ఫలం...!!!
శిష్యుడి జీవితం ఓ వాహనం,
గురు కృప అందులోని ఇంధనం...!!! 


**మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం...!!!* 
మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం...!
గురువు సర్వజ్ఞుడు...!!
గురువు దైవజ్ఞుడు...!!!


**మూర్తీభవించిన పరంజ్యోతి యొక్క కరుణయే గురువు...!!!* 
గుండెల్లో గురువు ఉంటే, జీవితంలో కరువు ఉండదు...!
గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని...!!
గరువు యొక్క మనసు, మమతానురాగాల మాగాణి...!!!


**సంకెళ్లతో బంధియైన శిష్యుని జీవాత్మకు ముక్తిని ప్రసాదించగలిగే ఏకైక శక్తిశాలి గురువొక్కడే...!!!* 
అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చేప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే...!!!


**గురువు నిండు మేఘమై వర్షించగలడు...!!!* 
గురువు చల్లటి చినుకై స్పృశించగలడు...!
గురువు తేజోవంతమైన విత్తనమై నాటుకోగలడు...!!
గురువు మహావృక్షమై నీడనీయగలడు. 
గురువు కమ్మటి మెతుకై ఆకలి తీర్చగలడు...!!!


**కాలికి గ్రుచ్చిన ముల్లును తీయుటకు వజ్రాయుధాన్ని ఉపయోగించటం ఎంతటి అజ్ఞానమో,* 
బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయగల గురువును తృచ్ఛమైన కోరికలు కోరడం అంతటి అజ్ఞానమే...!!!


**గురువు శరీరంతో కనిపించగలడు, కాంతి పుంజముల అఖండ ధారగా అనంతాన్ని ఆవరించగలడు...!!!* 
సమస్త గ్రహములు ఉపగ్రహములతో నిండిన కక్ష్యలు గురువు మెడలో రుద్రాక్ష మాలలు...!!!
సమస్త నక్షత్ర మండలాల సమూహంతో నిండిన అంతరిక్ష తళాలు గురువు కిరీటంలో గల వజ్రాల పలకలు...!!!


**గురువున్నవాడు భాగ్యవంతుడు...!* 
గురువున్నవాడు ఐశ్వర్యవంతుడు...!!
గురువున్నవాడు అదృష్టవంతుడు...!!!✍️
. 🙏

No comments:

Post a Comment