Sunday, February 9, 2020

*పతంజలి యోగ సూత్రాలు patanjali sutralu

*పతంజలి యోగ సూత్రాలు
అనగా అనగా, చాలాకాలం క్రితం, మునులు, ఋషులు అంతా కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారు. విష్ణువు ధన్వంతరి అవతారంలో ఆయుర్వేదం అనుగ్రహించి, రోగాలకు చికిత్సలను అందించినప్పటికీ, ప్రజలు ఇంకా అనారోగ్యాల బారిన పడుతూనే ఉన్నారని విష్ణుమూర్తికి తెలిపి, ప్రజలు అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలో తెలుపమని శ్రీహరిని ప్రార్థించారు. కేవలం శారీరకమైన అనారోగ్యమే కాదు. మానసికమైన, భావనాపరమైన అనారోగ్యానికి కూడా చికిత్స అవసరమే కదా. కోపం, కామం, అసూయ, ద్వేషం మొదలైనవి అనారోగ్యాలే. మరి వీటిని పోగొట్టుకోవటం ఎలా? దీనికి చికిత్స ఏమిటి?


శ్రీమహావిష్ణువు వేయి పడగలు కలిగిన ఆదిశేషునిపై పడుకొని ఉన్నాడు. ఋషులు ఆయనను సమీపించగానే ఆయన వారికి ఆదిశేషుని ఇచ్చివేశాడు. ఆదిశేషుడంటే జాగ్రదావస్థ. మెలకువకు సంకేతం. ఆ ఆదిశేషుడే భూమిపై పతంజలిగా జన్మించాడు. ఈ విధంగా పతంజలి జన్మించి మనకోసం యోగ జ్ఞానాన్ని అందించాడు. అవే పతంజలి యోగ సూత్రాలుగా ఖ్యాతి పొందాయి. ఆ యోగ సూత్రాలు తెలుపటానికి కనీసం 1000 మంది ప్రజలు ఒకే చోట కూర్చుని ఉంటేగాని చెప్పను అని షరతు పెట్టడంతో, వెయ్యిమంది ప్రజలు వింధ్యపర్వతాలకు దక్షిణదిశగా సమావేశమైనారు. పతంజలి మరో షరతూ పెట్టాడు- వింటున్న శిష్యులకు, అతనికి మధ్యగా ఒక తెర ఉంచాడు. ఆ తెరను ఎవరూ తొలగించకూడదు. పాఠం మధ్యలో ఎవరూ లేచి వెళ్ళిపోరాదు. పూర్తయ్యేదాకా అందరూ అక్కడే ఉండాలి. ఆ విధంగా పతంజలి మహర్షి అక్కడ కూర్చున్న వేయిమంది శిష్యులకూ జ్ఞానప్రసారం గావించాడు. ప్రతీ ఒక్కరూ జ్ఞానాన్ని అందుకున్నారు. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. తెరవెనుక, కనిపించకుండా గురువు- ఒక్కమాటైనా మాట్లాడకుండా తమకు అందరికీ జ్ఞానం అందటం- గురువు తమలో ప్రతీ ఒక్కరికీ విషయాన్ని అర్థమయ్యేలా ఎలా చేస్తున్నారా అనేది అద్భుతంగా అనిపించింది. అందరూ అశ్చర్చచకితులై ఉండిపోయారు. వారిలో ప్రతీ ఒక్కరిలోనూ అద్వితీయమైన శక్తి, అనిర్వచనీయమైన ఉత్సాహం ఎంత ప్రవేశించిందంటే, దానిని తమలో ఉంచుకోవటమే కష్టమైంది. అయినా వారంతా క్రమశిక్షణను పాటించాల్సిందే కదా! అయితే వారిలో ఒకడు చిన్నపిల్లవాడు. అతనికి హఠాత్తుగా లఘుశంకకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. అతడు బయటకు వెళ్ళిపోయాడు. నిశ్శబ్దంగా వెళ్ళి వచ్చేస్తే సరిపోతుందిలే అనుకున్నాడు. ఇంతలో మరొకరికి ఉత్సుకత పెరిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో చూద్దాం’’ అనుకున్నాడు.


అదే సమయంలో, లఘుశంకకు బయటకు వెళ్ళి కుర్రవాడు తిరిగివచ్చాడు. నువ్వెక్కడికి వెళ్లావని
అతడిని పతంజలి అడుగగా, ఆ కుర్రవాడు జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో అతడిని క్షమించి, ఈ ఒక్కడైనా మిగిలాడని అనుకున్నాడు. యోగ సూత్రాలలోని మిగిలిన భాగమంతా పతంజలి ఆ శిష్యునికి బోధించాడు. అక్కడికి విద్య పూర్తి అయింది కాని, ఈ శిష్యుడు నియమాన్ని అతిక్రమించి తప్పు చేశాడనే విషయం పతంజలి మర్చిపోలేదు. దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది. కాబట్టి ‘‘నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ చెట్టుకు వేలాడు’’ అని ఆదేశించాడు. తన జ్ఞానాన్ని మరొక శిష్యునికి బోధించినపుడు అతడికి శాపవిముక్తి కలుగుతుందని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమైనాడు.


ఇక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండి దారిన పోయేవారిని ఒక ప్రశ్న అడిగేవాడు. వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తినివేసి తన ఆకలిని తీర్చుకునేవాడు. అంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇదే కథ సాగింది. అతడి వద్ద విద్య నేర్చుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే చాలా కాలం ఉండిపోవలసి వచ్చింది. ఈ కథనుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? గొప్ప జ్ఞానం కలిగినవారు ఎవరైనా తప్పు చేసినపుడు బ్రహ్మరాక్షసుని వంటి స్థితిని పొందుతారు. తెలివితేటలు బాగా ఉన్నవారు నేరస్తులు కావటం అనేది అమాయకులు నేరం చేయటం కంటే ఎక్కువ ప్రమాదకరం. మరి విజ్ఞానం అంతా తెలుసుకున్న మనిషి నేరాలు చేయటం మొదలుపెడితే అది చాలా చాలా హానికరం కదా.


అలా చాలాకాలం పాటు బ్రహ్మరాక్షసుడు శాపవిమోచనం కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి దయాహృదయుడైన పతంజలి మహర్షి తానే ఒక శిష్యుని రూపంలో వచ్చి అతని వద్ద విద్య నేర్చుకుని దానిని తాళపత్రాలపై రాశాడు. ఒక్కో శిష్యుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ గురువే శిష్యుని రూపంలో వస్తాడని దీని భావం.


బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టుపైనైతే కూర్చొని ఉన్నాడో ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చొని యోగసూత్రాలను లిఖించాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి పాఠం రాత్రిపూటే సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి ఒక్కో ఆకునూ కోసి, తన చేతిపై చిన్న గాటు పెట్టుకుని స్రవించిన రక్తంతో ఆ ఆకుపై రాసేవాడు. ఇలా ఏడురోజుల పాటు విద్య సాగింది. పూర్తయ్యేసరికి పతంజలి అలసిపోయాడు. అప్పటివరకూ రాసిన ఆకులన్నిటిని ఒక గుడ్డలో చుట్టి చెట్టుకింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తినివేస్తూ కనిపించింది. చేసేదేమీ లేక పతంజలి ఆ మిగిలిన ఆకులనే తీసుకుని వెళ్ళాడు.


పతంజలి యోగ శాస్త్రం
యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి పతంజలి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయికి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు.


 పతంజలి  "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయికి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.


పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.
పతంజలి అష్టాంగ యోగము.


1. యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.


2. నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.


3. ఆసనం: ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11).


4. ప్రాణాయామం: శరీర స్పందన లన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.


5. ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.


6. ధారణ: ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత. ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవం లోనికి వచ్చే స్థితి.


7. ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.


8. సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

No comments:

Post a Comment