Monday, February 10, 2020

వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి - how to eat

వాగ్బాటాచార్యుల వారు వివరించిన భోజన పధ్ధతి  -

     ఆయుర్వేద చరిత్రలో వాగ్బాటాచార్యుల వారికి చాలా గొప్పస్థానం ఉన్నది. ఆయన రాసినటువంటి "అష్టాంగహృదయం" అనే గ్రంథం చాలా ప్రాచుర్యం  పొందింది. వారు తెలియచేసిన
భోజనపద్ధతి గురించి మీకు వివరిస్తాను.

       మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.

              మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును.  ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి,  ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.

               భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .

                  భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.

          ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .

         పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరు పాటించినచో మంచి ఆరోగ్యవంతులు అవుతారు.
ఆయుర్వేదం నందు ఒక సామెత ఉంది. "ఏకకాల భోజనే మహాయోగి , ద్వికాల భోజనే మహాభోగి , త్రికాల భోజనే మహా రోగి " అని దీనినిబట్టి చూడవచ్చు ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో. ప్రతిఒక్కరు నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు.

No comments:

Post a Comment