Sunday, February 9, 2020

భారతదేశపు పురాతన విద్య - రసవాద విద్య . study about chemicals in ayurveda

భారతదేశపు పురాతన విద్య  - రసవాద విద్య .

   మన ప్రాచీన భారతీయుల విఙ్ఞానం అమోఘమైనది . వారు పరిశోధించి కనుగొనిన అనేక అంశాలు అత్యంత రహస్యంగా నిక్షిప్తం చేసి ఉంచారు . మన భారతీయ వేదాలలో ఎంతో విజ్ఞానం నిక్షిప్తం అయ్యి ఉంది. కాని మనం దానిని పట్టించుకోకుండా పాశ్చాత్త్యా సంప్రదాయాల మోజులో పడిపోయి మన పూర్వీకుల విజ్ఞానాన్ని మనం పట్టించుకోవడం లేదు . తాళపత్రాలలో మరియు మన పురాతన గ్రంథాలలో నిక్షిప్తం అయిన అద్బుత విజ్ఞానాన్ని వారు తమ తమ  పరిశోధనలలో ఉపయోగించుకుంటున్నారు. మనం పోగొట్టుకున్న ఒక అద్భుత రహస్య విద్య గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను.

         మనం పోగుట్టుకున్న , మరిచిపోయిన ఆ రహస్య విద్య పేరే "రసవాద విద్య" ఈ విద్య గురించి వివరించాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది.  ఈ విద్యలో ముఖ్యంగా చెట్ల రసాలు , పాదరసం వంటి లోహాలు ఉపయోగించి "బంగారం " తయారుచేయుట . రహస్యంగా ఉండిపోయిన ఈ విద్య గురించి కొంత సమాచారమును నేను సేకరించాను . కొన్ని పురాతన గ్రంథాలను కూడా నేను ఈ విద్య గురించి తెలుసుకోవడానికి చదవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విశేషాలు తెలియచేస్తాను.

          అగస్త్య మహర్షులవారు అగస్త్యప్రోక్తం అను రసాయనిక గ్రంధమును రచించి అందులో పాషాణ , రససమ్మేళణాదులు ఉపయోగించు విధానం పేర్కొనెను. నీచలోహాలను స్వర్ణముగా మార్చు విధానములు సవివరముగా తెలియచేస్తూ రసవాదులకు మార్గదర్శకుడు అయ్యెను . ఈ రసవాదం సంపూర్ణంగా సిద్ధించుటకు అత్యంత ప్రజ్ఞ కలవాడై ఉండవలెను . పురాతన సిద్ధులు మాత్రమే కాకుండా కొంతమంది ఆధునిక రసవాద పరిశోధకులు కూడా స్వర్ణాన్ని తయారుచేశారు. వారిలో కాశీ నివాసి "పండిత్ కృష్ణపాల్ " 1943 సంవత్సరంలో హృషికేష్ లోని ప్రముఖుల సమక్షాన రసవాద విద్య ద్వారా స్వర్ణాన్ని తయారుచేశారు. ఆ బంగారం ఆ కాలంలో 72000 రూపాయలకు విక్రయించబడినది. ఆ మొత్తం పంజాబ్ లోని సనాతన ధర్మ ప్రతినిధి సభకు విరాళంగా ఇవ్వబడినది. బనారస్ హిందూ  విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విశ్వనాధ మందిరం పై అంతస్తులో రసవాద విద్యలో ప్రముఖ ఆచార్యుడు అయిన నాగార్జుని చిత్రంతో పాటు పాలరాతిపై ఈ వివరాలు కూడా చెక్కబడి ఉన్నాయి . 11 వ శతాబ్దంలో "ఆల్బెరుని " అనే విదేశీ యాత్రికుడు మనదేశం సందర్శించి ఇక్కడి సిద్దులు బంగారం తయారుచేసేవారు అని పేర్కొన్నాడు. దేశంలో కరువుకాటకాలు ఏర్పడినపుడు రసాయనాచార్యులు కృత్రిమంగా స్వర్ణాన్ని తయారుచేసెవారు అని అనేక గ్రంథాలలో వివరించబడి ఉంది.

          ఈ రసవాద విద్యను "స్వర్ణకరణి" పగారవిద్య అని అంటారు. ఈ విద్యను ఉర్దూలో కీమియా అని ఇంగ్లిష్ భాషలో ఆల్కెమీ అని పిలుస్తారు . ఈ రసవాదవిద్యలో నీచ వస్తువుని స్వర్ణంగా మార్చడానికి ఉపయోగించు ఒక వస్తువును "పరుసవేది " అని పిలుస్తారు . ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ రసవాద విద్య సిద్దించక భ్రష్టుడు , పిచ్చివాడు కావొచ్చేమోకాని ఒక గొప్ప వైద్యుడు మాత్రం తప్పక అవుతాడు. అందుకనే మన పూర్వీకులు                                " వాదభ్రష్టో వైద్య శ్రేష్ఠ"  అని అన్నారు.  ఆధునిక శాస్త్రవేత్తలు స్వర్ణం తయారుచేయడాన్ని ఒక పిచ్చిపనిగా , చెప్పినవాడ్ని పిచ్చివానిగా చూస్తారు. వారు చెప్పినట్లు స్వర్ణం ఒక ఎలిమెంట్ అణుసంఖ్య పట్టికలో దీని సంఖ్య 79 . AU కాంతి లోహ సంబంధమైనది . ప్రకృతిసిద్ధంగా లభించే బంగారుస్పటికముల అవయవ రూపత్వం ఇసొమెట్రిక్ భూమి యొక్క ఉష్ణోగ్రతకు కరిగి కిందికి దిగి పేరుకుని పొందే అవయవాకృతిని "నగ్గెట్స్" అంటారు. బంగారం యొక్క కాఠిన్యం      2 .5 to 3 .రష్యా వంటి దేశాలలో ప్రయోగశాలలలో కృత్రిమంగా తయారుచేశారు. బయట ఉన్న బంగారం ఖరీదు కంటే తయారు చేయుటకు అయ్యే వ్యయం ఎక్కువ ఆగుతుంది. అందువల్ల పరిశోధనలు ఆగిపోయాయి.

       భారతీయ పురాణాల్లో చెప్పినదాని ప్రకారం ఈ రసవాద విద్యలో ప్రముఖులు ఆదిమ చంద్రసేనుడు , లంకేశ్వరుడు, మత్తమాండవ్య ఇంద్రదత్త , కలంబి, నాగార్జునుడు, ఋషిశృంగ, రసేంద్రాతిలక , భాలుకి , మైధిలి , హరీశ్వర మొదలగు 27 మహామహులు చేత సింహగుప్తుని కుమారుడు అయిన వాగ్భాటాచార్యుడు , వేమనయోగి వంటి ఎందరో మహాత్ములు , సిద్దులు మొదలయిన వారు ఎందరొ ఉన్నారు.

       మనకు తెలిసిన వేమన గొప్ప రసవాది ఆయన ఒక చోట ఇలా చెప్పాడు . " వెన్నెల నిలుచుండి , వేపాకు పడవేసి అడ్డసరం రసమందు నదియు పిండి రాగి కరుగవేయ రమణ బంగారమౌ విశ్వదాభిరామ " అని చెప్పాడు . మరియొక చోట " పుట్టమీద కాయ , పుట్టమీద మన్ను  పుట్టలోనివాని పుట్టుతుదను గట్టియవచనము కాంచనాంబగయ" అని చెప్పాడు. నేపాల్ దేశంలో పరుశువేది లింగం ఉన్నట్టు శ్రీశైల క్షేత్రంలో కూడా శివలింగానికి కింద ఉన్న సప్తమ లింగం కూడా పరశువేది లింగం అంటూ కొన్ని ప్రాచీన రహస్య గ్రంధాలలో ఉన్నది.

  రసవాద విద్య గురించి సంపూర్ణంగా వివరించే అత్యంత ప్రాచీన గ్రంథాలు  -

 గ్రంధాల పేర్లు  -

 *  అగస్త్య రసాయనిక తంత్రం.
 *  కక్షపూట తంత్రం.
 *  కూపిపక్వ రస నిర్మాణ్ విజ్ఞాన్.
 *  ద్వాదశ లోహ భస్మ విధానము.
 *  పారద విజ్ఞానం.
 *  పారద సంహిత.   
 *  రస చింతామణి.
 *  రసరత్నాకరము .
 *  రసాయన ఖండం.
 *  రసార్ణవము.
 *  రసేంద్ర చూడామణి.
 *  రసేంద్ర కల్పద్రుమ.
 *  సనారి విశ్వేశ్వర సంవాదం.
 *  రస కంకాలియ.
 *  రస కౌముది.
 *  రస పారిజాత.
 *  రసరత్న మణిమాల.
 *  రస ప్రదీప.
 *  రసేంద్ర మంగళం .
 *  సూత ప్రదీపిక.
 *  రస సాగరః.
 *  రస రాజలక్ష్మి.
 *  రస ముక్తావళి.
 *  రసరాజ శిరోమణి.
 *  రస సంగ్రహ సిద్ధాంత .
 *  రస కిన్నెర .
 *  స్వర్ణ తంత్రం.
 *  కనకమంజరి.
 *  కళాయి శాస్త్రం.

          పైన చెప్పిన గ్రంథాలు అత్యంత ప్రాచీనం అయినవి . ఇంకా కొన్నిచోట్ల అరుదుగా లభ్యం అగుచున్నవి.

  రసవాదం నందు వివరించిన కొన్ని ప్రయోగాలు -

 *  తెల్ల వాకుడు రసం తో పాదరసాన్ని నూరిన మైనం . ఆ మైనంలో ఆ పిప్పిలో పొదిగి , ఆరబెట్టి చిన్న పుటం పుట్టిన భస్మం అగును. రాగిని కరిగించి అందులో ఈ భస్మం వేసిన హేమించును

 *  ఒక శేరు ఇంగిలీకమును 5 శేరుల పచ్చిపసుపు రసమున 4 జాములు చురకా ఇచ్చి తరువాత 15 శేరుల తంగేడుపువ్వుల రసముతో చురకా ఇచ్చిన కట్టును . ఇది నిశ్చయం. అది వెండి మీద పదోవంతు వేసిన బంగారం అగును.

 *  అడవి మెంతి ఆకు పాదరసమున వేసి నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం వేసిన వెండి అగును ఇది నిశ్చయం .

 * శంఖు పాషాణం వంకాయలో పెట్టి మట్టిరాసి ఆరబెట్టి 21 పుటములు పెట్టవలెను . 10 పుటముల వరకు 4 నుంచి 5 వేసినను కట్టును . తరువాత 4 కి 1 పిడక చొప్పున పుటములు పెట్టవలెను. దీనిని రసంలో వేసి రాగికి జోడించి కరిగించిన స్వర్ణం అగును.

 *  నల్ల ఉమ్మెత్త సమూలం నూరి శుద్ద రాగి బిళ్లకు పట్టించి గజపుటం పెట్టిన భస్మం అగును. ఆ భస్మమును రాగి కరుగుచుండగా వేసిన స్వర్ణం అగును. శుద్ధ రాగి కొరకు నైజామ్ అర్ధరూపాయి వెడల్పాటిది శ్రేష్టం.

 *  రెండు నేరేడు పండ్లు తెచ్చి ఒక్కోటి సగం వరకు కోసి కొంచం గుజ్జు తీసి రెండు తులముల రాగి రజను అందులో పోసి తీసిన గుజ్జు మీద వేసి రెండు డిప్పలు కలిపి గుడ్డ చుట్టి 7 సార్లు శీలమన్ను ఇవ్వవలెను . పిమ్మట ఏరు పిడకలతో  పుఠం  పెట్టి సాంగశీతలమున బలి ఇచ్చి తీసి చూచిన 6 వన్నె బంగారం అగును .కరిగించి దూచిన సరిపోవును .

        పైన చెప్పిన యోగాలు కొన్ని ప్రాచీన అత్యంత అరుదయిన గ్రంథాల నుంచి నేను సేకరించినవి . ఇవి కేవలం మీ విజ్ఞానం కోసం మాత్రమే వివరిస్తున్నాను. అత్యాశకు పోయి మీకుటుంబాలను , మీ మీద ఆధారపడ్డ వారిని ఇబ్బందులపాలు చేయొద్దని నా మనవి. ఆ సర్వేశ్వరుడు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు . కావున ఇచ్చినదానితో తృప్తిగా కుటుంబంతో సంతోషంగా ఉందాం.

No comments:

Post a Comment