* శరీరముకు బాధ కలుగకుండా శిశువును మెల్లగా ఎత్తుకొనవలెను. శిశువు నిద్రించునప్పుడు ఆకస్మికముగా నిద్ర లేపిన భయపడును . కావున అలా చేయరాదు .
* శిశువును గాలిలోకి ఎగరేస్తూ పట్టుకోవడం వలన శరీరము నందు వాతం వృద్ధిచెంది అంగవైకల్యం ప్రాప్తించును .
* శిశువును ఎల్లప్పుడూ పడుకోపెట్టిన బొక్కిరొమ్ము కలుగును. కావున ఎక్కువసేపు పడుకోపెట్టరాదు.
* క్రీడా సంబంధమైన వస్తువులను ఇచ్చి శిశువును సంతోషపరచవలెను. ఈ విధముగా ఎల్లప్పుడూ చేయడం వలన శిశువుకి అధికమైన బలం , ఆరోగ్యం , సంతోషం కలుగును.
* గాలి , ఎండ , వృక్షములు , తీగలు , పాడిపడిన ఇండ్లు , పల్లమగు ప్రదేశం , ఇంటినీడ , దుష్టగ్రహములకు సంబంధం కలగకుండా శిశువుని రక్షించుచుండవలెను.
* అశుద్ధ ప్రదేశాలు , ఆకాశం అనగా పైన ఆచ్చాదన లేనిచోటు , మిట్టపల్లములు , ఎండ , విపరీతమైన గాలి , వర్షము , దుమ్ము , పొగ , నీరు వంటి స్థలములలో శిశువును ఉంచరాదు.
* తల్లిపాలు లేని శిశువుకు శరీరానికి అణుగుణంగా మేకపాలు గాని , ఆవుపాలుగాని ఒక మోతాదులో ఇవ్వవలెను .
* ఆరొవ మాసములో లఘువుగా , హితకరమైన అన్నమును శిశువునకు పెడుతూ గృహములోపల ఉంచుతూ దుష్టగ్రహ దృష్టి పడకుండా జాగ్రత్తగా కాపాడవలెను.
* బాలురకు దుష్టగ్రహములు సోకినప్పుడు ప్రతిక్షణం ఉలిక్కిపడుట , భయం , ఏడవటం , మూర్చ , గోళ్లు , దంతములచే శరీరం పైన గీచుకొనుట , కొరుక్కోనును , పండ్లు కొరుక్కోనును , వికారంగా అరుచుట , ఆవలించుట , కనుబొమ్మలు విరుచుట , పైకి చూచుట , నోటి నుంచి నురుగుకారుట , పెదవి కోరుకుట , వికారంగా అనిపించుట , అపక్వముగా మలము వెడలుట , హీనస్వరం , రాత్రుల యందు నిద్రపోకుండా ఉండటం , దౌర్బల్యము , శరీరం వాడినట్లు ఉండటం , శరీరం నుంచి దుర్వాసన రావటం , అంతకు ముందువలే పాలు తాగుటకు ఇష్టం లేకుండా ఉండటం , ఇలాంటి లక్షణాలు కలుగును.
* శిశువుకి తల్లి పాలు ఇచ్చు సమయంలో తల్లి యొక్క ఆహారం జాగ్రత్తగా ఉండవలెను . తల్లిపాలు శిశువు తీసుకుంటుంది అంటే పాలరూపంగా తల్లి యొక్క జీవరక్తాన్ని పీలుస్తుంది అని అర్థం . ఈ స్థితిలో తల్లి యొక్క శరీర బలాన్ని జాగ్రత్తగా కాపాడుకోకుండా ఉంటే జీవరక్తం శిశువు పీల్చివేయడం వలన తల్లి జీవితం దుర్భరం అగును. కావున బలకరమైన ఆహారపదార్ధాలను తల్లికి ఇవ్వవలెను. మూలద్రవ్యాలు అన్ని శరీరంలోకి వెళ్లడం వలన తల్లికి పాలు వృద్ది అగును.
* తల్లికి పాలు తక్కువుగా ఉన్నచో మధురమైన ఆహారపదార్ధాలు ఇవ్వడం వలన తల్లిపాలు వృద్ది అగును.
* కొంతమంది స్త్రీల యొక్క చనుబాలు పలుచగా ఉండి పిల్లలకి పుష్టిని ఇవ్వవు . దీనికి ప్రధానకారణం తల్లిపాలలో తైలపదార్ధాలు తక్కువమోతాదులో ఉండడమే అటువంటి సమయములో నెయ్యి , వెన్న , బాదంపప్పు , నువ్వుపప్పు మొదలైన తైలద్రవ్యాలను ఇవ్వవలెను. ఆంగ్ల వైద్య శాస్త్రం చెప్పినట్టు ఆలివ్ ఆయిల్ కూడా మంచిది .
* ఆహారం అధికంగా ఇవ్వడం వలన తల్లిపాలు వృద్ది అవడం జరగదు. తల్లిపాలు వృద్ది అవ్వవలెను అనిన ఆవుపాలలో ఉన్నటువంటి మాంసకృత్తులు చాలామంచివి.
* తల్లిపాలు వృద్ది కావలెను అనిన ఆకుకూరలు , ధాన్యాలు , మధురరసం , ఆమ్లరసం , లవణ రసం ఎక్కువగా ఉండి ద్రవముగా ఉన్న ఆహారపదార్ధాలు , క్షీరవృద్ధికర ఔషధాలు , పాలు తాగడం , శరీరానికి తగినంత విశ్రాంతి వంటివి పాటించవలెను.
* తల్లిపాల వంటి బలకరమైన ఆహారం పిల్లలకి మరొకటి లేదు . తల్లిపాలు తాగుతున్న పిల్లలు బలిష్టంగా , సుందరముగా ఉంటారు . చీటికిమాటికి వచ్చే రోగాలు తల్లిపాలు తాగే పిల్లలకు రావు .
* పసిపిల్లల పేగులు చాలా సున్నితముగా ఉంటాయి. తరచుగా రోగగ్రస్తం అవుతుంటాయి. అటువంటి సమస్య తల్లిపాలు తాగే పిల్లలకు రాదు .
* తల్లిపాలు లేనిసమయంలో ఆవుపాలు పట్టవలెను . ఆవుపాలలో మాంసకృత్తులు , లవణాలు ఎక్కువుగా ఉన్నాయి . చక్కర తక్కువుగా ఉండును. కొవ్వుపదార్ధం తల్లిపాలతో సమానంగా ఉండును. ఆవుపాలను తల్లిపాలవలే ఉపయోగించవలెను అనిన ఆవుపాలలో నీరు కలపవలెను కొంత కొవ్వు పదార్థం మరియు చక్కర కూడా చేర్చవలెను .
* 10 ఔన్సుల ఆవుపాలలో రెండు చెంచాల పంచదార , అర ఔన్స్ మీగడ గాని , వెన్నగాని చేర్చి ఇంకొక 10 ఔన్సుల వేడినీరు పోసి మొత్తం 20 ఔన్సుల పాలు చేయవలెను . ఇలా చేయడం వలన చనుబాలు లక్షణాలు వచ్చును. ఇది పిల్లవాడి లక్షణాన్ని బట్టి పైన చెప్పిన పదార్దాలు మార్చుకుంటూ ఉండవచ్చు.
* పైన చెప్పిన మోతాదులో తయారుచేసిన పాలను మొదటినెలలో మూడు ఔన్సుల చొప్పున పోస్తూ నెలాఖరుకి నాలుగు ఔన్సుల చోప్పున పెంచుకుంటూ వెళ్లిన ప్రతినెలలోను ఒకటి రెండు ఔన్సుల పెంచుతూ ఎనిమిదో , తొమ్మిదో ఔన్సులు అగును.
* పాలకి , పాలకి మధ్య సమయం నాలుగు గంటల వ్యవధి ఉండవలెను . అనుకున్న సమయానికి పాలు ఇవ్వవలెను. పడుకున్న శిశువుకు నిద్రలేపి పాలు పట్టరాదు.
* ప్రస్తుత పరిస్థితుల్లో ఆవుపాలు స్వచ్చమైనవి దొరుకుట కష్టముగా ఉన్నది. ప్యాకెట్లలో లభించే పాలల్లో కొవ్వుశాతం ఎక్కువగా ఉండి విటమిన్లు తక్కువుగా ఉన్నాయి . కావున దేశి ఆవుపాలను వాడటం అత్యంత ఆరోగ్యకరం మరియొక్క ముఖ్యవిషయం పిల్లలకు డబ్బా పాలు వాడరాదు. దీనివల్ల పిల్లలకు కఫ సంబంధ దోషాలు వచ్చును.
* పోతపాలు వాడు పిల్లలకు విరేచనం తెల్లగా అగును. ఇది కఫ సంబంధ లక్షణం . ఇలా పోతపాలు ఇవ్వడం వలన మన చేజేతులా మన పిల్లవాని జీర్ణవ్యవస్థని దెబ్బతీసినవారిమి అవుతాం .
* శిశువుకి దంతాలు వచ్చే సమయంలో తప్పకుండా జబ్బుచేయును . ఈ సమయంలో పిల్లవాడు బాగా నీరసం పడును. విరేచనాలు అగును. ఈ సమయంలో జీర్ణకోశం ప్రధానంగా చాలా బలహీనంగా ఉండును. ఈ స్థితిలో పాలు చాలా స్వల్పంగా ఇవ్వవలెను. పోత పాలు ఇచ్చువారు మరింత జాగ్రత్తగా ఉండవలెను . చిక్కనిపాలు అసలు ఇవ్వకూడదు . బాగుగా కాచినపాలు మాత్రమే ఇవ్వవలెను .
* పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో ముఖ్యంగా జ్వరం , అతిసారం , దగ్గు , వాంతి , తలపోటు వంటి సమస్యలు వచ్చును. కోలుకోవడానికి ఒకటి నుంచి రెండు నెలల వరకు పట్టవచ్చు కావున ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను .
శిశువు విషయంలో పాటించవలసిన అతిముఖ్య నియమాలు - 3 .
* బజారులో అనేక రకాల ఆహారాలతో నిండుతున్నాయి. వీటిని సాధ్యమైనంతలో విడిచివేయడం మంచిది . ఆ ఆహారాలలో విటమిన్స్ చాలా తక్కువుగా ఉండును. వీటిలో కొవ్వుపదార్దాలు అధికంగా ఉండును. కొవ్వుపదార్ధాలు అధికంగా ఉన్న పాలు పోయడం వల్లనే చాలమంది పిల్లలకి స్ప్లీన్ సంబంధ సమస్యలు మరియు పేగులజబ్బులు వస్తున్నాయి.
* పోతపాలు పట్టే పిల్లలకు ఆవుపాలతో పాటు మరికొన్ని బలకరాలైన ఆహారాలు కూడా ఇవ్వడం మంచిది . నాలుగు మాసాలు మొదలు ప్రతిదినం రెండుపూటలా 2 గ్రాముల చవనప్రాశ్య లేహ్యం ఆవుపాలతో కలిపి ఇవ్వడం మంచిది . ఆంగ్ల వైద్య శాస్త్ర ప్రకారం చేపనూనె ( cod liver oil ) అయిదుచుక్కలు మొదలు ఇరవై చుక్కలు దాకా రోజులో రెండుసార్లు ఇవ్వవచ్చు. పాలలో కలిపి ఈ ప్రకారంగా లేహ్యం అయినా చేపనూనె అయినా పద్దెనిమిది మాసాల వయస్సు వచ్చేదాకా వాడటం మంచిది .
* ప్రతిదినం అర ఔన్స్ తక్కువ కాకుండా పండ్లరసం ఇస్తూ క్రమంగా రెండు నుండి మూడు ఔన్సుల వరకు పెంచి ఇవ్వొచ్చు.
* అవసరాన్ని బట్టి ఆహారాన్ని మారుస్తూ ఉండాలి. పిల్లల విషయంలో కడుపుబ్బరం , కడుపునొప్పి తరచుగా వస్తుంది. పోతపాలు తాగే పిల్లలకి పాలు అధికంగా పోయడం , పాలు ఇచ్చే మధ్య సమయం తక్కువుగా ఉండటం పిల్లలకు కడుపునొప్పి రావడానికి ప్రధానకారణం . అందువలన క్రమక్రమంగా ఆహారాన్ని మధ్యలో మర్పు చేసుకోవాలి.
* పోతపాలు తాగే పిల్లలకు విరేచనం తోడుకున్న పెరుగు మాదిరి ఉంటుంది. పోతపాలు పిల్లలకు ఇది జబ్బులక్షణం . అనగా ఆహారం సరిపడటం లేదని అర్థంచేసుకొనవలెను. లేదా పిల్లవాని జీర్ణశక్తి చాలా తక్కువ అయిపోయిందని అనుకోవలెను. ఈ స్థితిలో పాలు బాగా కాచడం , నీళ్లు అధికంగా కలపడం అవసరం .
* పదహారో సంవత్సరం పూర్వపు వయస్సు కలిగినవాడికి బాల శబ్దం వర్తిస్తుంది. ఈ బాలలు కూడా మూడురకాలుగా ఉంటారు .
1 - క్షీరపాయి బాలుడు .
2 - క్షీరాన్నద బాలుడు .
3 - అన్నాద దాలుడు .
* ఒక సంవత్సరం నిండేదాకా క్షీరపాయి అని పిలుస్తారు . రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేంతవరకు క్షీరాన్నాదుడు అని అంటారు. అనగా అన్నం తినువాడు , పాలు తాగువాడు ఆపై అన్నాదుడు అనగా కేవలం అన్నం తినేవాడు అని అంటారు.
* చిన్నపిల్లలకు ఆవకాయ , మాగాయ వంటి ఊరగాయలు కలిపి అన్నం పెట్టడం ప్రారంభిస్తారు. ఇది చాలా తప్పు ఊరగాయలు చురుకైన ఆహారం కిందికి వచ్చును. ఇవి శిశువుకి ఇవ్వడం వలన పిల్లాడి జీర్ణకోశం దెబ్బతినును .
* పిల్లలకు పెట్టే అన్నం మట్టిపాత్రలో వండాలి. దంపుడు బియ్యమే గాని మరబియ్యం వాడరాదు. మంచి ఆవునెయ్యి గాని లేకపోతే బర్రెనెయ్యి గాని కాచి కలిపి అందులో మెత్తగా ఉడికించిన పొట్ల , బీర , వంగ ముక్కలుగాని , ఉడికిన కందిపప్పుగాని వేసి బాగా కలిపిపెట్టాలి. ఇలా కలిపిన అన్నం పులుసు తక్కువుగా ఉన్న చారులో ముంచికూడా పెట్టవచ్చు. చారు తగలడం వలన విరేచనం శుద్దముగా అగును.
* పైన చెప్పిన విధముగా తయారుచేసిన ఆహారం ప్రారంభంలో రోజుకి ఒక్కసారి మాత్రమే పెట్టవలెను. క్రమంగా రెండోసారి ఇవ్వడం ప్రారంభించాలి. పోతపాలు తాగే పిల్లలకు అన్నం పెట్టడం ప్రారంభించాక పాలు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలి. పాలు పలచగా ఉండవలెను . తక్కువ మోతాదులో మాత్రమే ఇవ్వవలెను . లేనిచో అజీర్ణవ్యాది కలుగును. విరేచనాలు ప్రారంభం అగును.
* సాధారణముగా రెండో సంవత్సరంలో పిల్లలకు అజీర్ణం ఉంటుంది. ఆహారదోషం కూడా ఉంటే అది మరింత ఎక్కువ అగును. ఇలా అజీర్ణదోషం ఉన్నప్పుడు బియ్యం వేయించి వండిపెట్టడం , పలచగా చేసి బాగా ఉడికించి పెట్టడం మంచిది . అజీర్ణం ఉన్నవాళ్ళ పేగులలో మలదోషం అధికంగా పెరుగుతూ ఉండును. అటువంటి వారికి వారానికి ఒకసారి ఆముదం ఇవ్వడం మంచిది .
* పిల్లవాడికి అత్యంత జాగ్రత్తగా రెండొ సంవత్సరాన్ని దాటిస్తే మూడో సంవత్సరం నుంచి పిల్లవాడి శరీరతత్వం మారి శరీరం గట్టిపడును. ఆలస్యముగా వచ్చినా , త్వరగా వచ్చినను కిందాపైన దంతాలు వచ్చేదాక అన్నం మాత్రం పిల్లలకు పెట్టకూడదు. దంతాలు వచ్చి అన్నం తినటం ప్రారంభించిన వెంటనే తల్లిపాలు మాన్పించవలెను. ఈ సమయంలో తల్లిపాల బలం పిల్లవానికి సరిపోదు మరియు తల్లిపాలు తాగడం వలన తల్లికి కూడా నీరసం వచ్చును.
* వరిపేలాలు , గోధుమ అప్పడం , ఇంట్లో తయారుచేసిన నేతి మిఠాయి మంచివి . పాతబెల్లం ముక్క కూడా అప్పుడప్పుడు పెట్టవచ్చు. పంచదార కంటే పాతబెల్లం మంచిది . పండ్లరసాలు కూడా మంచిది . బాగుగా మగ్గిన అరటిపండు త్వరగా జీర్ణం అగును. ఇలా మగ్గిన అరటిపండు ఇవ్వడం వలన మలబద్దకం తగ్గించి సరైన సమయానికి విరేచనం అవ్వడంలో సహాయపడును. మంచి బలాన్ని కలుగచేయును .
* గర్భిణితో ఉన్న తల్లిపాలు పిల్లవాడు తాగకూడదు . అజీర్ణం కలుగును. పిల్లవానికి కాకులను , గద్దలను చూపిస్తూ అన్నం పెట్టకూడదు. అలా చూపిస్తూ పెట్టడం వలన ఆకలి లేనపుడు కూడా తినడం జరుగును. అధికముగా తింటాడు. దానివల్ల రోగం వచ్చును. బాగా ఆకలిగా ఉండటం చూసి ఆహారాన్ని ఇవ్వవలెను. అన్నం వద్దని తలతిప్పినప్పుడు వెంటనే ఆహారాన్ని ఇవ్వడం ఆపివేయాలి .
* మూడో సంవత్సరం వచ్చిన నాటినుండి మధుర రసం , చమురు గల ఆహారం , పెరుగు , పాలు , మజ్జిగ వంటివాటిని పిల్లలకు ఎక్కువుగా పెట్టవలెను . పిల్లలకు నూనెవేపుళ్లూ అలవాటుచేయకూడదు. కారాలు , పులుసులు అతిగా ఇవ్వడం వలన బుద్దిమాంధ్యం వచ్చును.
పెరిగే పిల్లలకు ఇప్పుడు నేను చెప్పబోయే ఆహారం తప్పనిసరిగా ఇస్తూ ఉండాలి.
ధాన్యాలు -
గోధుమ రొట్టె లేక దంపిన బియ్యపు అన్నం .
కూరలు -
ఆకుకూరలు మరియు కాయగూరలు .
పండ్లు -
నారింజ , బత్తాయి , సీమరేగు , అరటిపండు , సపోట .
మధురద్రవ్యాలు -
పరిశుద్ధమైన తేనె , పాతబెల్లం .
మాంసాహారం -
కోడిమాంసం , మేకమాంసం , లివరు , పప్పులు .
స్నేహద్రవ్యాలు -
నెయ్యి, వెన్న , జున్ను మెదలైనవి .
పైన చెప్పిన ఆహారపదార్దాలు తగుమోతాదులో వయస్సును దృష్టిలో ఉంచుకుని తగుమోతాదులో ఇవ్వవలెను.
సమాప్తం
No comments:
Post a Comment