Tuesday, February 18, 2020

మహా వ్యాధి chronic disease as per Ayurveda

ఆయుర్వేదం ప్రకారం మహావ్యాధులు వాటి ఉపద్రవాలు  - 

        ఆయుర్వేదం ప్రకారం మహావ్యాధులు మొత్తం ఎనిమిది రకాలు . అవి 

 *  వాతవ్యాధి . 

 *  ప్రమేహము .

 *  కుష్ఠు రోగం .

 *  ఆర్శ రోగం . 

 *  భగంధరం .

 *  అశ్మరి రోగం . 

 *  ఉదరవ్యాధి.

 *  మూఢ గర్భము .

        అను ఈ ఎనిమిది వ్యాధులు అసాధ్యములై చికిత్స చేయుటకు కష్టముగా ఉండునట్టి మహావ్యాధులని పేర్కొనబడినది.

  అసాధ్య రోగ లక్షణాలు - 

      ఇప్పుడు చెప్పబోవు లక్షణాలు అన్నియు ఒకేసారి ఏ వ్యాధినందైనా కనిపించిన ఆ వ్యాధికి చికిత్స చేసినను ప్రయోజనం ఉండదు.   అవి 

 *  శరీరం నందలి మాంసం క్షీణించుట.

 *   శరీరం చచ్చుబడిపోవుట.

 *  దప్పిక.

 *  వాంతులు . 

 *  జ్వరం.

 *  అతిసారం.

 *  సృహ తప్పిపడిపోవుట.

 *  ఎక్కిళ్లు .

 *  ఆయాసం . 

          పైన చెప్పిన ఉపద్రవాలు ఏ మూడైనను ఒకేసారి కలిగి ఉన్న ఆ వ్యాధి చికిత్సకు లొంగదు. కావున ఆ రోగికి చికిత్స చేసినను ప్రయోజనం లేదు . 

 *  వాతవ్యాధి వలన కలుగు ఉపద్రవములు - 

     చర్మముకు స్పర్శజ్ఞానం లేకపోవుట , వణుకు, కడుపుబ్బరం, లోజ్వరం, శరీర భాగముల యందు బాధగా ఉండటం , వాతవ్యాధి గల వాని ఎముకలు విరుగుట  , ఎముకలు చిట్లుట వంటి సమస్యలు కలిగినచో ఆ వ్యాధి ఆ రోగిని నశింపచేయును .

 *  ప్రమేహ వ్యాధి వలన కలుగు ఉపద్రవములు 

      శ్లేష్మం ప్రధానమగు ప్రమేహ రోగి యొక్క శరీరం నందు ఈగలు ముసురుచుండును. పిత్తప్రమేహ రోగికి వృషణాలు వాచి ఉండును. వాత సంబంధమైన ప్రమేహరోగికి అధికంగా , ఎక్కువ సార్లు మూత్రం బయటకి వెడలును.  కొన్నిసార్లు ఈ ప్రమేహం వలన వ్రణాలు కూడా కలుగును. ఇవి ప్రాణానికి హాని చేయును .

 *  కుష్టువ్యాధి వలన కలుగు ఉపద్రవములు - 

       శరీరం చిట్లి నీరుకారుట, కళ్లు ఎర్రబడుట, కంఠస్వరం క్షీణించుట వంటి లక్షణాలు కలిగిన కుష్టురోగిని ఆ వ్యాధి నశింపచేయును.

 *  ఆర్శరోగం వలన కలుగు ఉపద్రవములు - 

        ఈ రోగమునకు సాధారణ బాషలో మొలలు అని మరొకపేరు కలదు.  దీనిలో కలుగు ఉపద్రవములు  దప్పిక, నోరు రుచి లేకుండా పోవటం ,శూల, అధికరక్తస్రావం , ఉబ్బు , అతిసారం వీటితో కూడుకొనియున్న ఆ ఆర్శరోగం రోగిని నశింపచేయును .

 *  భగంధరం వలన కలుగు ఉపద్రవములు - 

         ఈ రోగమును ఆంగ్లము నందు "ఫిస్టులా" అని పిలుస్తారు . దీనిలో కలుగు ఉపద్రవములు మలమూత్రములు, క్రిములు , శుక్రము, భగంధర వ్రణము నుండి స్రవించినచో అట్టిరోగికి చికిత్స చేయకుండా విడవలెను . దీనికి రసాయన ఔషధ సేవనయే శరణ్యం.

 *  మూత్రాశ్మరీ రోగం వలన కలుగు ఉపద్రవములు  - 

            మూత్రము రాకపోవుట, బాధ కలుగుట,బొడ్డు మరియు వృషణాల యందు వాపు , పంచదార వలే , ఇసుక వలే మూత్రం రావటం వంటి లక్షణాలు ఉన్న మూత్రాశ్మరీ రోగం ఆ రోగిని తప్పక చంపును.

 *  ఉదరరోగం వలన కలుగు ఉపద్రవములు - 

          పార్శ్వములు పగిలిపోవునంత బాధ , అన్నద్వేషము , ఉబ్బు , అతిసార విరేచనాలు , విరేచన మార్గము ద్వారా నీరు తొలగించినను మరలా ఉదరం నీటితో నిండినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపించిన ఆ రోగికి చికిత్స చేయుట వ్యర్థం .

 *  అతిసార రోగం వలన కలుగు ఉపద్రవములు  - 

         ఆయాసం , శూల, దప్పిక కలిసి శరీరం క్షీణించిన వారికి , జ్వరముచే ఎల్లప్పుడూ పీడింపబడువానికి , దోషములు అధికంగా కలుగువానికి అతిసారవ్యాధి రోగిని నశింపచేయును .

 *  రాజయక్ష్మ రోగం వలన కలుగు ఉపద్రవములు - 

         కళ్లు తెల్లబడుట, అన్నద్వేషము , ఊర్ద్వశ్వాసతో భాధపడుట, మలము అతికష్టముగా వెడలుట, మలము అధికంగా వెడలుట అను లక్షణాలు ఈ క్షయ వ్యాధి కలిగిన రోగిలో కనిపించిన ఆ వ్యాధి ఆ రోగిని చంపును.

 *  గుల్మ రోగం వలన కలుగు ఉపద్రవములు - 

          ఆయాసం , శూల, దప్పిక, అన్నద్వేషం,  శరీరం పైన గడ్డలు కదలకుండా గట్టిగా ఉండటం వంటి లక్షణాలు కలిగిన గుల్మ రోగం ఆ రోగిని చంపును.

 *  విద్రది ఉపద్రవములు - 

         కడుపుబ్బరం, వాంతులు , ఎక్కిళ్లు , దప్పిక, ఆయాసం , కలిగిన విద్రది రోగి నశించును .

 *  పాండురోగ ఉపద్రవములు - 

         తెల్లని దంతములు, గోళ్లు కలిగి పూర్తిగా తెల్లగా పాలిపోయి తెల్లని వస్తు సమూహంగా కనిపించుచుంటాడో ఆ పాండురోగగ్రస్తునికి మరణం తప్పదు.

 *  రక్తపిత్త వ్యాధి వలన కలుగు ఉపద్రవములు 

         తరచుగా రక్తం వాంతి చేసుకోవడం , కళ్లు ఎర్రగా ఉండి చూసే వస్తువు ఎర్రగా కనపడునట్టి రోగి బ్రతుకుట అసాధ్యం . 

 *  ఉన్మాదం వలన కలుగు ఉపద్రవములు - 

         శరీరం నందలి మాంసం , బలం తగ్గి నిద్రపోకుండా ఉండటం , ముఖమును క్రిందికిగాని , పైకిగాని పెట్టి మంచిచెడులు తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఉన్మాదరోగి నశించును.

 *  అపస్మార రోగం వలన కలుగు ఉపద్రవములు - 

        తరచుగా సృహతప్పుట, శరీరం మిక్కిలి క్షీణించి కనుబొమ్మలు కదిలించుచూ కళ్లు వికృతిని పొందిన అపస్మార రోగి మరణించును.

 *  జ్వరం వలన కలుగు ఉపద్రవములు  - 

        మాటిమాటికి మూర్ఛపోవుట, సృహలేకుండా ఉండటం, శరీరం చల్లబడుట,లోజ్వరం కలుగుట,అటుఇటు కదలకుండా మొద్దులా పడి ఉన్న జ్వరరోగి మరణించును. అదేవిధంగా ఎక్కిళ్లు , ఆయాసం , ఎల్లప్పుడూ నిట్టూర్పూ విడుచుట, శరీరం క్షీణించుట వంటి లక్షణాలు కలిగి ఉన్ననూ ఆ జ్వరరోగి మరణించును.

      

No comments:

Post a Comment