Saturday, August 21, 2021

ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ - alcohol

ఆయుర్వేదం నందు మద్యము గురించి వివరణ -

 *  చరకాచార్యులవారు - బాహ్లీకులు , పల్లవులు , చీనీయులు , శూలికులు , యవనులు , శకులు అను ఆరుదేశములు యందు నివసించేవారు మాంసం , గోధుమలు , మద్యములు , శస్త్రచికిత్స అనునవి ఎల్లప్పుడూ ఉపయోగించుటకు తగినవారని వ్రాసిరి .

 *  కొన్నిరకాల వ్యాధుల వలన కలుగు దుఃఖం , బాధల నుండి కలిగిన శోకము తొలగి విశ్రమింపచేయుటకు మద్యమును యుక్తిగా ఉపయోగించుటను వెల్లడించిరి. వారికి కూడా కొన్ని నిబంధనలు వెల్లడించి వైద్యునికి ఆదేశాన్ని ఇచ్చిరి.

 *  మద్యమును నిత్యముగా ఇచ్చేప్పుడు మనుజుని అన్నపానములు , వయస్సు , వ్యాధి , శరీరబలం , కాలము , ఆరు రుతువులు ,వాత,పిత్త,కఫ  దోషములు , మానసిక స్థితి గమనించిగాని నిత్యం ఇవ్వరాదు అని కొన్ని ప్రత్యేక నియమాలు వైద్యునికి గ్రంథరూపంలో వెల్లడించిరి .

 *  వాత, పిత్త, కఫాలు మూడింటిని ఒకేసారి వృద్ధిని చెందించి శరీరం నందు వ్యాపించుటకు విషముకు ఎలాంటి శక్తి ఉంటుందో మద్యమునకు కూడా అవే గుణములు కలిగియున్నది. కాకుంటే మద్యము కంటే విషమునకు ఎక్కువ బలం ఉండటం వలన ప్రభావం త్వరగా ప్రభావం చూపును. మద్యం కొంచం శరీరాన్ని నాశనం చెందించుటకు కొంచం సమయం తీసుకొనును .

 *  మద్యము శరీరం నందలి రోగనిరోధక శక్తిని నాశనం చేసి శరీరాన్ని రోగాలపాలు చేయును మద్యము ఆమ్లరసం గుణములు కలిగి ఉంటుంది.

 *  మద్యము నందు మోహము , భయం , శోకము , క్రోధము , మృత్యువు ఆశ్రయించి ఉన్నవి. మద్యదోషం వలన పిచ్చి , మదము , మూర్చ , అపస్మారము కలుగును.

 *  అధిక మద్యపానం వలన వాత , పిత్త , కఫాలు వృద్దిచెంది హృదయము నందు బాధ , అరుచి , అధికంగా దప్పిక , జ్వరం , చలిజ్వరం , శిరస్సు నందు , పార్శ్వముల యందు , ఎముకల యందు , సంధుల యందు మెరుపుల వలే అప్పుడప్పుడు కలుగు బాధలు , అధికంగా , బలంగా ఆవలింతలు , శరీరం అదురుట , శరీరం నందు వణుకుట , శ్రమ , వక్షస్థలం నందు పట్టినట్లు ఉండటం , దగ్గు , ఎక్కిళ్లు , ఆయాసం , నిద్రలేకపోడం , చెవి , కళ్లు , ముఖవ్యాధులు కలుగుట , వాంతులు , విరేచనములు , వాంతి వచ్చేలా ఉండటం వంటి సమస్యలు కలుగును.

 *  ఆయుర్వేదం నందు మద్యము అతిగా తీసుకోవడం వలన కలిగే సమస్యను మదాత్యరోగం అని పిలుస్తారు . మద్యము తీసుకోవడం వలన వికారములు కలిగినపుడు వెంటనే మద్యమును మానవలెను అని సూచించడం జరిగింది.

 *  మద్యము వదులుటకు పాలను వాడమని ఆయుర్వేద శాస్త్రవేత్తలు సూచించారు. ఒక్కసారిగా మద్యపాన వ్యసనాన్ని విడవరాదు. చిన్నగా మద్యపాన మోతాదును తగ్గించుకుంటూ రావలెను. ఒక్కసారిగా మద్యాన్ని ఆపడం వలన బలహీన మనస్తతత్వం ఉన్నవారు పిచ్చివారుగా మారే ప్రమాదం ఉన్నది . కావున క్రమంగా మోతాదు తగ్గించుకుంటూ రావలెను .

 *  మద్యము వలన శరీరబలం కోల్పోయినవారికి మద్యము యొక్క మోతాదు తగ్గించుకుంటూ పాల యొక్క మోతాదు పెంచుకుంటూ పోవడం వలన క్రమమముగా శరీరబలం పెరిగి మద్యపాన దుష్ప్రభావం నుంచి మనుష్యుడు బయట పడును.

 *  మద్యమును ఆపి మరలా తిరిగి మద్యపాన సేవన ప్రారంభించిన మరియు అధికంగా సేవించుట చేసినచో శరీర ధ్వంసం , మలక్షయం మొదలయిన సమస్యలు సంభవించి చికిత్సకు లొంగని విధముగా తయారగును.

 *  సమస్త విధములైన మద్యములను విడిచిన మానవుడు జితేంద్రియుడుగా , శారీర , మానసికంగా ధైర్యము కలవాడుగా , వ్యాధుల నుంచి దూరంగా ఉండువానిగా అగును.

          

No comments:

Post a Comment