‘అబ్బా... కుంకుడుకాయలా... పరమబోర్...’ అంటూ ముఖం చిట్లించకండి. కాసిని కుంకుళ్లు ఉంటే చాలు... రసాయనాల్లేని సహజమైన సబ్బు, షాంపూ, డిటర్జెంట్, క్లీనర్... అన్నీ నిమిషాల్లోనే తయార్. అందుకే పది కాయలు కొట్టండి, పలు రకాలుగా వాడుకోండి... అంటున్నారు సేంద్రియ ప్రియులు. రెండు దశాబ్దాల క్రితం వరకూ తలస్నానం అంటే కుంకుడుకాయలు కొట్టాల్సిందే. రసం తీయాల్సిందే. ఎలా పోయిందోగానీ క్రమంగా కుంకుడుకాయ సైడయిపోయింది. పేదాగొప్పా తేడా లేకుండా అందరి ఇళ్లలోకీ చౌకదో ఖరీదైనదో షాంపూ చొరబడిపోయింది. కారణం కచ్చితంగా అందులోని సౌకర్యమే. కుంకుడుకాయల వాడకంలోని కష్టమే. అవునుమరి, కుంకుడు రసం కళ్లలో పడితే మంట... నోట్లోకి వెళితే చేదు... దాంతో పిల్లలయితే అవంటేనే గగ్గోలు పెట్టేవారు. ఇవన్నీ అలా ఉంచితే వాటిని కొట్టాలి. రసం తీయాలి. ఇంత కష్టం ఎందుకని ప్రతి ఒక్కరూ ఇష్టంగానో కష్టంగానో షాంపూకి అలవాటుపడిపోయారు. ఫలితం... చుండ్రు తగ్గదు. జుట్టు రాలడం ఆగదు. అందుకే రూటు మార్చుకుని మళ్లీ మూలాల్లోకి తొంగి చూస్తున్నారు. దీనికితోడు కొందరు సేంద్రియ యువ వ్యాపారవేత్తలు కుంకుళ్లతో షాంపూలూ సబ్బులూ డిటర్జెంట్‌లూ ఫ్లోర్ క్లీనర్లూ... వంటి ఉత్పత్తులకీ శ్రీకారం చుట్టారు. దాంతో మర్చిపోయిన కుంకుడుకాయ మరోసారి అందర్నీ పలకరిస్తోంది. కుంకుడుకాయనే హిందీలో రీటా, అరిత అని పిలిస్తే; ‘అనర్థాల నుంచి కాపాడే పండు’ అనే అర్థంలో సంస్కృతంలో రక్ష బీజ, అరిష్టక అని అంటారు. ఆసియా, అమెరికా ఖండాల్లో పెరిగే ఈ జాతిలో అనేక రకాలున్నాయి. మనదగ్గర పెరిగే రకాల్లో కాయల తొక్క మందంగా ఉంటే, పాశ్చాత్యదేశాల్లో పెరిగే కాయల్లో గింజ కనిపిస్తూ పారదర్శకంగా ఉంటాయి. వేల సంవత్సరాల నుంచీ మనతోబాటు అమెరికన్లూ దీన్ని వాడిన దాఖలాలు ఉన్నాయి. మనదగ్గర దీంతో తల రుద్దుకోవడాన్నే చంపూ అని పిలిచేవారు. అదే క్రమంగా షాంపూగా పాశ్చాత్య దేశాలకు పరిచయమైంది. అంటే- షాంపూ పుట్టుకకి కుంకుడుకాయలే కారణం అన్నమాట. ప్రయోజనాలెన్నో! కుంకుళ్లలో సహజంగా ఉండే సాపోనిన్ అనే సహజ రసాయనం మంచి క్లెన్సర్ మాత్రమే కాదు, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాల్ని కలిగి ఉంటుంది. : కుంకుళ్లలో సహజంగా ఉండే సాపోనిన్ అనే సహజ రసాయనం మంచి క్లెన్సర్ మాత్రమే కాదు, యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాల్ని కలిగి ఉంటుంది. అందుకే ఇది ఒంటినీ ఇంటినీ శుభ్రపరుస్తుంది. చుండ్రునీ నిర్మూలిస్తుంది. ఈ గుణాల కారణంగానే పాశ్చాత్యులు దీన్ని అద్భుతమైన డిటర్జెంట్‌గానూ వాడుతున్నారు. ముఖ్యంగా ఊలు, సిల్కు వంటివి కుంకుడురసంతో ఉతికితే పాడవకుండా చక్కని మెరుపుని సంతరించుకుంటాయి. పూర్వం నుంచీ పట్టుచీరల్ని కుంకుడురసంతో ఉతకడం మనదగ్గరా వాడుకలో ఉంది. టస్సర్ సిల్కుకి అద్దే రంగుల్లోనూ కుంకుడు రసం కలుపుతుంటారు. విటమిన్-ఎ, డి, కెలు కుంకుడుకాయల్లో సహజంగానే ఉంటాయి. దాంతో జుట్టయినా సిల్కయినా అందంగా మెరుస్తుంది. జుట్టు ఊడిపోవడాన్నీ అరికడుతుంది. పైగా వీటిల్లో సహజంగానే ఉండే తేమ కారణంగా మంచి కండిషనర్‌గానూ పనిచేస్తుంది. కుంకుడురసం మంచి డాగ్ షాంపూ కూడా.కుంకుడుకాయల్ని నానబెట్టి ముద్దలా చేసి అందులో టేబుల్‌స్పూను ఆలివ్ నూనె వేసి షేవింగ్ క్రీమ్‌గానూ వాడుకోవచ్చట. కుంకుళ్ల రసాన్ని మొక్కలమీద చల్లితే ఆ వాసనకి క్రిమికీటకాలు నశిస్తాయి. పండ్లూ కూరగాయల్ని కుంకుడు రసం కలిపిన నీటిలో నానబెడితే వాటికి ఉన్న రసాయనాల అవశేషాలన్నీ పోతాయి. బంగారు, వెండి నగల్ని శుభ్రం చేయడానికి కుంకుడురసాన్ని మించిన లోషన్ లేదు. కార్పెట్లూ బాత్‌టబ్‌లూ టాయ్‌లెట్లూ సింకులూ అద్దాలూ కిటికీలూ టైల్సూ కార్లూ.. ఇలా దేన్ని శుభ్రం చేసేందుకయినా కుంకుడుకాయని మించింది లేదు. అంతేకాదు, కుంకుడుకాయ అద్భుతమైన దోమల మందు అనీ, ఇది దోమ లార్వానీ ప్యూపానీ సమూలంగా నాశనం చేస్తుందనీ మద్రాస్ యూనివర్సిటీ పరిశోధనలోనూ స్పష్టమైంది. కలుషితమైన నేలలోని లోహాలను కుంకుడుకాయలు తొలగిస్తాయని మరికొన్ని పరిశీలనల్లో తేలింది. కుంకుడు చెట్టు మంచి ఔషధ మొక్క కూడా. ఈ చెట్టు గింజల్ని ఆర్థ్రయిటిస్, దంత క్షయ చికిత్సల్లో వాడితే, మరిగించిన ఆకుల రసాన్ని కీళ్లవ్యాధులు, చర్మవ్యాధులు, బొబ్బలు, మానసికవ్యాధుల నివారణలోనూ విష విరుగుడుగానూ వాడుతుంటారు. మరి, మీరెప్పుడు తెస్తున్నారు కుంకుడుకాయలు
No comments:
Post a Comment