Monday, January 20, 2020

రోగాలు ఎందుకు వస్తాయి ? అవి కర్మ ఫలాలా ? why disease or its karma

రోగాలు ఎందుకు వస్తాయి ? అవి కర్మ ఫలాలా ?

మనకు తెలుసు - పుట్టిన ప్రతి వాడికి, అంటే , ఆడ, మగ అందరికీ - రోగాలు, చావు తప్పవని. ముందుగా పోతే - వార్ధక్యం తప్ప వచ్చు. అంతే కానీ , రోగాలు, చావు తప్పని సరి.

రోగాలు ఎందుకు వస్తాయి ? మనం, మన కర్మ ఫలాన్ని అనుభవించడానికి. అంతే . యిది చాలా సరళమైన వివరణ .

అయితే - అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా రోగాలు వస్తున్నాయి గా! బిడ్డ ఏం కర్మ చేసింది ? పూర్వ జన్మ కర్మ కావొచ్చు. లేదా - పెద్దలు చేసిన కర్మ ఫలాన్ని పిల్లలు అనుభవించ వలసి వుండొచ్చు. పక్కింటి వాడు - తన యింటిలో రొచ్చు రొచ్చు గా పెట్టుకుంటే , అక్కడ- దోమలు, ఈగలు ఎక్కువైతే, అవి మనల్ని వచ్చి కుట్టితే , మనకి ఏ మలేరియానో వస్తే - అది కూడా మన కర్మ ఫలమే .

కర్మ ఫలం - అంటే మనమే చెయ్య నక్కర లేదు . పక్కింటి వాడు చేసినా, ఎదురింటి వాడు చేసినా - మనం, ఆపకుంటే చాలు - వారి కర్మ ఫలం మనకూ వచ్చేస్తుంది . రాజు చేసే తప్పులు -ప్రజలకందరికీ సమస్యలు తెచ్చి పెడతాయి . అవునా, కాదా ?

కాక పొతే - మీకు రావలసిన కర్మ ఫలాలే మీకు వస్తున్నాయి . మీకు రాకూడనివి మీకు రావడం లేదు .

ఈ కర్మ సిద్దాంతం - చాలా శాస్త్రీయమైనది. యింతకీ మించిన సశాస్త్రీయమైన సిద్దాంతం మరొకటి లేదు - అని చెప్ప వచ్చు .

అయితే, యిది పూర్తిగా అర్థం కావడం కష్టం . అర్థం అయినా - దాన్లోని అన్ని అంశాలు - మనం, అన్ని వేళలా, అంగీకరించడానికి మరీ కష్టం .

సీతను రావణుడు ఎత్తుకెళ్ళాడు - అది ఆమె కర్మ ఫలం . అలా అని రాముడు వూరికే కూర్చొని వుండ లేదు కదా. మానవ ప్రయత్నం వుంటే, దేవుడు - మన కర్మ ఫలాన్ని , ప్రస్తుత కర్మకు అనుగుణం గా మార్చ గలడు .

రోగం వచ్చింది - అది మన కర్మ ఫలం. నిజమే. కానీ, డాక్టర్ వద్దకు వెళ్లచ్చు. మందు తీసుకోవచ్చు. రోగం పోగొట్టుకోవచ్చు . కర్మ ఫలం అనేది - మనం భూతకాలంలో చేసిన పనుల ఫలితం. అది యిప్పుడు వచ్చింది . కానీ, వర్తమానంలో మనం వూరికే కూర్చొని ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తూ వుండమని ఎవరూ చెప్ప లేదు . యిప్పుడు మళ్ళీ కర్మ చెయ్యాలి . తప్పదు.

కర్మణ్యేవ అధికారస్తే - అంటే - ప్రస్తుత కర్మ మీరే చేస్తున్నారు. అది చెయ్యడానికి మీరే కర్తలు .

అదేదో - దేవుడు మీ చేత చెయ్యిస్తున్నాడనుకుంటే తప్పు . వొక వేళ - మీరలా అనుకుంటే - ఫలితం కూడా దేవుడే అనుభవిస్తున్నాడని - మీరు అనుకోవాలి . నా హం కర్తా హరిహి కర్తా -అని, చేసేది వాడే, చేయించేది వాడే అనుకుంటే, అనుభవించేది వాడే - అని కూడా అనుకోవాలి . మళ్ళీ చేసింది వాడు , అనుభవించేది నేనా - అని అనుకోవడం తప్పు .

కర్మ ఫలాలు - మనం మూడు రకాలుగా తీసుకోవచ్చు . కొన్ని సుఖంగా వుంటాయి . ఏదో లాటరీ వచ్చింది ; ప్రమోషన్ వచ్చింది; మంచి భార్య/భర్త దొరికారు. యివి సుఖం గా అనిపిస్తాయి. యేవో రోగాలు వచ్చాయి . ఆక్సిడెంట్ అయ్యింది -కాలో, చెయ్యో విరిగింది ; ఇలాంటివి దుహ్ఖాన్ని కలిగిస్తాయి .

సుఖ, దుహ్ఖాలను - సమానంగా తీసుకునే మనస్తత్వం వుంటే - జీవితంలో, ఇవేవీ బాధించదు . అంటే - మనం జడుని లా వుండి పోతామని కాదు . నిజానికి, అన్నిటినీ మించిన ఆనందం మనలోనే వుంది . అది బయటి నుండి మనకు రావడం లేదు. బయటికి పోవడమూ లేదు అది అనుభవం లోకి వచ్చేస్తే - కర్మలకు, కర్మ ఫలాలకు, పెద్ద ప్రాముఖ్యత వుండదు . అవి బయట జరిగేవి . ఆనందం ఎప్పుడూ లోపల వుండేది .

అది వచ్చేస్తే - మళ్ళీ, సుఖ దుహ్ఖాలు మనల్ని బాధించవు. అబ్బే. సుఖాలు మనలను ఎందుకు బాధ పెడ తాయండీ - అని సందేహం వస్తుంది ! అవి సుఖ పెడతాయి కదా ? నిజమే. సుఖాలు సుఖంగా కొంత సమయం వుంటుంది. మళ్ళీ , అవే, దుహ్ఖంగా మారిపోతాయి ; లేదా, ఏదో, వొక దుహ్ఖానికి దారి తీస్తాయి. సుఖ దుహ్ఖాలు వొక తిరుగుతున్న వృత్తం కొన లో మనం చేసే ప్రయాణం లాంటివి. యిది పొతే అది, అది పొతే యిది వస్తూనే వుంటాయి.

అందుకే ప్రతి వొక్కరి జీవితంలో -సుఖాలూ వుంటాయి . దుహ్ఖాలూ వుంటాయి .

వీటిలో - చాలా తమాషాలూ వున్నాయి. మీకు 95 మార్కులు వచ్చాయి . చాలా సంతోష పడ్డారు . తరువాత తెలిసింది, పక్కింటి వాడికి 100 మార్కులు వచ్చాయని . ఎదురింటి వాడికి 99 వచ్చాయని . వెనకింటి వాడికి, 98 వచ్చాయని. యిప్పుడేమయ్యింది? మీ 95 మార్కులు ఎక్కడికీ పోలేదు. కానీ, మీ సంతోషం పారిపొయ్యింది !

మీ ఇల్లు బాగానే వుంది . చిన్నగా, ముచ్చటగా వుంది . కానీ, ఎదురింటి వాడు ఫస్ట్ ఫ్లోర్ కట్టాడు . మంచి డిజైన్ తో కట్టాడు . కానీ మీ ఇల్లు అలాగే వుందిగా ? మరి , మీ సంతోషం ఏమయ్యింది ? ఎక్కడో వెళ్లి పొయ్యింది .

ఆనందం అంటూ - అనుభవం లోకి వచ్చేస్తే - మరి ఎవరు ఎలా వున్నా , మీరు ఆనందం గానే వుంటారు .

మీకు కూడా, ఏ నష్టం వచ్చినా, కష్టం వచ్చినా - మీ అనందం మాత్రం పోదు.

యిది సాధ్యమా? సాధ్యమే - అని మాత్రం - నాకు తెలుసు. ఏది సాధ్యమో - దాన్ని మనం సాధించాల్సి వుంటుంది. సాధిస్తే - ఆ తరువాత , ఆ సాధించిన దాన్ని, సిద్ధం (లేదా, సిద్ధి ) అంటారు . సాధించే సమయంలో - మనల్ని సాధకుడు అనీ; సాధించిన తరువాత, సిద్ధుడు - అనీ అంటారు .

ఈ సాధకత్వం - మన జీవితంలో - అన్ని విషయాల లోకీ , తీసుకు రావాలి .

చిన్న జలుబు చేసినా , మనం ఎంతో కష్ట పడి పోతూ వుంటాము. జలుబైనా, దగ్గైనా, అంతకు మించిన వ్యాధి లేదు, అని అనుకుంటూ వుంటాము . కానీ, ఎంత పెద్ద వ్యాధైనా , కడపటి క్షణం వరకు సంతోషం గా వుండ గలిగిన వారు కూడా ఎంతో మంది వున్నారు.

దాదాపు 40 ఏళ్ళ క్రితం , యిటువంటి వారిని గురించిన వొక పుస్తకం చదివాను. వొకాయనకు కాన్సర్ వచ్చింది . మరో 2 నెలల కంటే ఎక్కువ బ్రదకడని డాక్టర్లు చెప్పేశారు . ఆయన రెండు రోజులు ఏడ్చారు . తరువాత ఏదో అయ్యింది ఆయనలో . ఆయన మనసులో, ఏదో వొక మార్పు; వొక నిశ్చయం . అంతే . మరుసటి రోజు వున్న ఆస్తంతా వదిలేసి , వున్న డబ్బంతా మూట కట్టుకుని , ప్రపంచ యాత్ర చేస్తున్న వొక లక్జరీ నౌక లో ఎక్కి ప్రపంచ యాత్రకై బయల్దేరాడు ఆయన .

ఆయనకు వున్న ఆయుర్దాయం 2 నెలలు. ప్రపంచ యాత్ర 3 నెలలు. సరే . పొతే, ఆ నౌకలోనే పోదాం - అని అనుకుని బయల్దేరాడు. నౌకలో అడుగుపెట్టిన మరు క్షణం నుండి ఆనందం గా వుండాలని నిశ్చయించుకున్నాడు. అలాగే వున్నాడు కూడా. ఆయన్ను చూసి , ఆ నౌక లో వున్న వారంతా కూడా, ప్రభావితులై , ఆ మూడు నెలలు సంతోషంగా గడుపుతూ వచ్చారు . మూడు నెలలు గడిచి పోయాయి . అందరూ, బయలు దేరిన స్థలానికి తిరిగి వచ్చేసారు; ఆయన కూడా .

ఆయన తన యింటికి వెళ్ళాడు .యింట్లోని వాళ్ళు ఆయన్ని చూసి ఆశ్చర్య పొయ్యారు . అప్పటికి ఆయన తన కాన్సర్ గురించి పూర్తిగా మర్చి పొయ్యాడు. తన వాళ్ళ బలవంతం పైన - మళ్ళీ టెస్ట్ చేయించు కున్నాడు . యిప్పుడు, ఆశ్చర్య పోవడం, డాక్టర్ల వంతైంది . కాన్సర్ ఛాయలు అసలు లేవు ఆయనలో-యిప్పుడు. ఏదో కారణంగా ఆయన శరీరమే తనలో, కాన్సర్ ను సృష్టించింది. ఆ కారణం ఎలాగో, పూర్తిగా పొయ్యింది . దానితో బాటు, కాన్సర్ కూడా, పూర్తిగా పొయ్యింది.

కాన్సర్ లాంటి చాలా, చాలా వ్యాధులకు , మనం అనుభవించే - స్ట్రెస్ , మానసిక ఆందోళన, భయం - ముఖ్య కారణాలుగా తెలుస్తూ వుంది . అవి లేకుండా చేసుకుంటే - కాన్సర్ లాంటి వ్యాధులు రావు . వచ్చినవి కూడా త్వరగా తగ్గి పోతుంది . మనం చేసే కర్మ - స్ట్రెస్ , మానసిక ఆందోళన, భయం. వాటి కర్మ ఫలం మనం అనుభవించే వ్యాధులు . ఆ కర్మ లేకుంటే, ఈ కర్మ ఫలం కూడా లేదు .

అంటే - ఏ వ్యాధి వచ్చినా, డాక్టర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పడం లేదు . వెళ్ళండి. కాక పొతే - మీ మానసిక స్థైర్యాన్ని - మీతో బాటే వుంచుకోండి . మీ ఆనందాన్ని ఎప్పుడూ విడనాడకండి.

వీటితో బాటు - అనులోమ-విలోమ ప్రాణాయామము ; కపాల భాతి ప్రాణాయామము, బాహ్య ప్రాణాయామము ; ధ్యానము - యివి తప్పకుండా చెయ్యండి . యివి సులభంగా నేర్చుకోవచ్చు . సులభంగా చెయ్య వచ్చు . ధ్యానం, మనలోని ఆనందాన్ని, ప్రశాంతతను , బయటకు తెస్తుంది. యివే, ఎన్నో రోగాలకు మందులుగా పని చేస్తుంది .

నిజానికి - కాన్సర్ లాంటి వ్యాధులకు కూడా , అలోపతీ వైద్యం తో బాటు , ప్రాణాయామాలతో బాటు , ధ్యానం తో బాటు , మనం తప్పక తీసుకో వలసిన ఆయుర్వేద మందులు ఎన్నో వున్నాయి . ఉదాహరణకు - గోధుమ పైరు యొక్క రసం , గోమూత్రం , బొప్పాయి ఆకుల రసం , యిలా ఎన్నో మందులు , ఎన్నో వ్యాధులు కరిగించేవిగా తెలుస్తున్నాయి.

ముఖ్యంగా , ప్రాణాయామాలు , ధ్యానం , వొత్తిడి తగ్గించుకుని కాస్త తేలిక జీవితాన్ని గడపడం - యివి, రోగాలు రాకుండా వుండడానికి, వచ్చిన రోగాలు పోవడానికి - చాలా ముఖ్యమైన ఔషదాలు.

రోగాలు - వొత్తిడి వల్ల , సరికాని ఆహార విహారాల వల్ల , నిద్ర లేమి వల్ల - సరి కాని పరిసరాల వల్ల వచ్చేవి; అయితే , యివి సరి చేసుకుంటే - రోగాలు పోతాయనడం కూడా కరెక్టే . శ్రీకృష్ణుడు భగవద్గీతలో - ఈ విషయం, రక రకాలుగా చెప్పాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట స్య కర్మణి -అంటాడు శ్రీకృష్ణుడు. సరైన ఆహారము, విహారము , నిద్ర - వున్న వాడే యోగానికి అర్హుడు ; ఆనందానికి అర్హుడు. ఆరోగ్యానికి అర్హుడు. ఆ ఆహారము ఎలాంటి ఆహారం కావాలో, మరో చాప్టర్ లో చెబుతాడు. సాత్వికాహారం ఏదో, దాని గుణాలేమిటో, రాజసిక, తామసిక ఆహారాలేవో, వాటి గుణాలేమిటో - అన్నీ చెబుతాడు. సాత్వాకాహారం తినే వాడికి రోగాలు (చాలా వరకు) రావు. ఆనందంగానూ వుంటాడు .

నిజానికి ఏ కర్మకు ఏది ఫలమో కూడా - భగవద్ గీత లో చాలా చోట్ల వుంది . గీతను మించిన సైన్సు లేదు .

వొత్తిడికి, చెత్త ఆహారానికి, నిద్ర లేమికి ... ఇలాంటి వాటికి ఫలం కాన్సర్ లాంటి వ్యాధులు. మనలో వుండే భయం అన్నింటి కన్నా పెద్ద వ్యాధి . భయం విడిచేసి, వొత్తిడి తగ్గించుకుని , ఆనందంగా వుండి , యుక్తాహార, విహారాలతో వుంటే - కాన్సర్ కూడా తప్పకుండా పోతుంది. చర్మ వ్యాధులూ పోతాయి . ఏ వ్యాధి అయినా పోతుంది. ఆ నమ్మకం ముఖ్యం .

మీ దగ్గరలో - అలాంటి వ్యాధిగ్రస్తులు వుంటే - వారిలో ఈ నమ్మకం కలుగ జేయండి. భయం పూర్తిగా విడి చేయమని చెప్పండి . ఆనందం గా వుండమని , ఆనందంతో బాటు , మందులు - అలోపతీ, ఆయుర్వేదా రెండూ - తీసుకోమనండి . ప్రతి రోజూ , పై చెప్పిన ప్రాణాయామాలు , ధ్యానం చేయమనండి వారు బాగవడం ఖాయం .

సర్వే జనాః సుఖినోభవంతు .

No comments:

Post a Comment