Sunday, January 26, 2020

వాత కఫ పిత్తం పెరగడానికి కారణాలు(why vata, kapha pitta)

మనుష్య శరీరము నందు త్రిదోషాలు ప్రకోపించుంటకు కారణాలు - ఉపశమనాలు . 1


 *  వాత ప్రకోపమునకు కారణాలు  - 

  అధికంగా వ్యాయామం చేయడం , ఎండలో తిరగడం , అధిక ఉపవాసాలు , ఎముకలు విరుగుట , శరీరం కృశించుట, జాగరణ చేయుట , మలమూత్ర వేగాలు నిరోధించుట , బలవంతంగా బయటకి వదులుట , అతిశీతల పదార్దాలను సేవించుట , గట్టిగా ఉండు పదార్దాలను తినుట , వగరు , చేదు , కారం పదార్దాలను అధికంగా సేవించుట , అన్నం జీర్ణం అయ్యే సమయము నందు వాతం ప్రకోపించును. 

 * వాతం తగ్గుటకు కారణాలు  - 

   స్థిరమైన , ఉష్ణమైన , బలకరమైన ఆహారపదార్థాలను సేవించుట , మధురమైన , లవణ రసములు కలిగిన పదార్దాలను సేవించుట , తైలము , ఎండ తగలకుండా ఉండటం, స్నానము , అభ్యంగనం , ఎనిమా , మాంసము , మద్యము సేవించుట , వాహనం ఎక్కుట , నలుగు పెట్టుకొనుట , ఆవిరి పట్టడం , నిద్రించుట , కాపడం పెట్టుట . 

        పైన చెప్పిన ఉపచారములు పాటించుట వలన శరీరం నందు వాతప్రకోపం తగ్గించుకోవచ్చు. 

       తరవాతి పోస్టులో పిత్తప్రకోప కారణాలు , పిత్తం శమించుటకు ఉపాయాలు తెలియచేస్తాను.

మనుష్య శరీరము నందు త్రిదోషాలు ప్రకోపించుంటకు కారణాలు - ఉపశమనాలు .

 * పిత్తప్రకోపమునకు కారణాలు  - 

   అతిగా కారం తినడం , పులుపు అతిగా తినడం , ఉష్ణ, తీక్షణ , అధికదాహం కలిగిన పదార్దాలు సేవించటం , మనస్సు నందు క్రోధం , అతి ఉపవాసం , ఎండ యందు తిరగటం , అతి సంభోగం , నువ్వులు , మినుములు అతిగా తినడం , పెరుగు , అతి మద్యపానం , భోజనం జీర్ణం అయ్యే సమయం నందు , శరదృతువు నందు , గ్రీష్మకాలం నందు , మధ్యాహ్న సమయం నందు , అర్ధరాత్రి సమయం నందు పైత్యం ప్రకోపించును . 

 *  పైత్యం తగ్గుటకు కారణాలు  - 

       తిక్త , మధుర కషాయ రసములు కలిగిన పదార్ధ సేవనం , చల్లటిగాలి , వెన్నెల , మేడ మొదటి అంతస్థు నందు నీటి కుళాయిల నీరు , తామర  తుండ్లు కలిగిన ప్రదేశము నందు నివసించుట , స్త్రీ ఆలింగనం వలన , నెయ్యి , పాలు సేవించుట , విరేచనాల కొరకు ఔషధాలు సేవించుట , పన్నీరు జల్లుకొనుట , రక్తమోక్షణము , చెమటపట్టునట్లు నలుగుపెట్టుకొనుట మొదలగు ఆహారవిహారాల వలన శరీరం నందు పిత్తం శమించును . 

 *  శ్లేష్మప్రకోపానికి కారణాలు  - 

      గురుమధుర రసములు గల పదార్దాలను సేవించటం వలన , పాలు , చెరుకు వీటితో చేసినట్టి పిండివంటలు సేవించటం వలన , ఎక్కువుగా ద్రవపదార్ధ సేవన వలన , బెల్లం మరియు నేతితో చేసిన ఆహారాలను సేవన వలన , పగటినిద్ర వలన , మంచు విస్తారంగా పడు సమయం నందు , ఉదయం కాలము నందు , భోజనం చేసిన వెంటనే , వసంత ఋతువు నందు శరీరం నందు శ్లేష్మం ప్రకోపించును . 

 *  శ్లేష్మం తగ్గుటకు కారణాలు  - 

       రూక్ష , క్షార గుణముల కషాయ రసములను , తిక్త , కటు రసములు కలిగినట్టి ఆహారపానీయాలు సేవించుట వలన , వ్యాయామం చేయుట , గట్టిగా శ్లేష్మం ఉమ్మివేయుట , స్త్రీసంగమం , ప్రయాణం చేయుట , ముష్టియుద్ధం చేయుట , జాగరణ చేయుట , నీళ్లలో ఈదుట , ధూమపానం , ఎనిమా , నశ్యము చేయుట , వమనము ( వాంతి ) , స్వేదకర్మ ( కాపడం పెట్టటం ) మున్నగు ఆహారపదార్ధాలు మరియు క్రియలను చేయుట వలన శరీరం నందు శ్లేష్మం తగ్గును. 


         శరీరం నందలి త్రిదోషాలు ఉద్రేకం చెందినప్పుడు కొన్నిక్రియలు చేయుట వలన వాటిని శమింపచేయవచ్చు . పైత్యప్రకోపం నందు విశ్రాంతిగా పరుండిన పైత్య ఉద్రేకం తగ్గును.  వాతప్రకోపం నందు శరీరంను మర్దించుట శ్రేష్టమైనది . శ్లేష్మప్రకోపమున వాంతిగావించుట ముఖ్యము . వీటిని పాటించటం వలన క్రమంగా ఆయాదోషాలు నివృత్తి అవుతాయి. 

                             సమాప్తం 

No comments:

Post a Comment