మానవ శరీరం నందలి వాత,పిత్త , కఫ స్థానాలు - రకాలు .
మానవ దేహము నందలి వాత,పిత్త , శ్లేషం అను మూడు రకాలు కలవు. అవి శరీరముకు వైకల్యము కలిగించుట చేత దోషములు అనియు , శరీరంను ధరించుట చేత ధాతువులు అనియు , రసాధి ధాతువులకు వైకల్యం కలిగించుట చేత మలములు అనియు చెప్పబడును . ఈ వాత,పిత్త , శ్లేష్మములు దేహమును ఆశ్రయించి ఉండుటచేత వాతము 5 రకాలుగా , పిత్తం 5 రకాలుగా , శ్లేష్మం 5 రకాలుగా ఉండును.
ఈ వాత,పిత్త,శ్లేష్మములు దేహమంతయు వ్యాపించి ఉన్నను కొంతమంది వాతం ముఖ్యముగా పాదములకు , నాభికి మధ్యప్రదేశము నందు , పిత్తము నాభికి హృదయమునకు మధ్యప్రదేశము నందు శ్లేష్మం హృదయమునకు శిరస్సుకు మధ్యప్రదేశం నందు ఉండునని చెప్పుదురు. వాత, పిత్త, కఫ స్థానాలను గురించి కొన్ని వేరువేరు సిద్ధాంతాలు కలవు. పక్వాశయము, పిరుదులు , తొడలు , చెవులు , ఎముకలు , త్వగింద్రియము అనునవి వాతమునకు స్థానములు . మరియు వాతం ప్రధానంగా పక్వాశయము నందు ఉండుటబట్టి పక్వాశయమే వాతమునకు ప్రధాన స్థానం . నాభి , ఆమాశయం , చెమట , చొంగ , రక్తం , రసధాతువు , నేత్రములు పిత్తమునకు స్థానములు . నాభి యందు పిత్తము ఎక్కువ ఉండటం వలన నాభియే పిత్తము యొక్క ప్రధానస్థానం . హృదయం , కంఠం , శిరము , మెదడు , కీళ్లు , బొడ్డుకు పైన ఉండు రసం , కొవ్వు , నాశిక , నాలిక అనునవి శ్లేష్మ స్థానాలు అయినను శ్లేష్మం అధికంగా హృదయము నందే ఉండటం వలన హృదయమే శ్లేష్మమునకు ముఖ్యస్థానముగా భావించవలెను.
వార్ధక్యమున వాతం , కౌమారమున పిత్తము , బాల్యమున కఫము శరీరం నందు ప్రకోపించి ఉండును. రాత్రి యందు వాతం అధికముగా ఉండును. మధ్యాహ్నమున పిత్తం అధికంగా ఉండును. ఉదయమున శ్లేష్మం అధికంగా ఉండును. మరియు అన్నం జీర్ణించిన తరువాత వాతం ఎక్కువుగా ఉండును. భోజనం సగం జీర్ణం అయ్యే సమయములో పిత్తం అధికంగా ఉండును. జీర్ణక్రియ ప్రారంభ సమయములో కఫం ఎక్కువగా ఉండును.
వాతం ప్రకోపించినప్పుడు ఆహారం సక్రమముగా అవ్వదు . పిత్తం ప్రకోపించినప్పుడు ఆహారం త్వరగా జీర్ణం అగును. శ్లేష్మం ఎక్కువైనప్పుడు జీర్ణక్రియ పాడగును. బాగుగా జీర్ణం అగుటకు వాత, పిత్త , శ్లేష్మాలు సమాన ప్రమాణంలో ఉండవలెను . ఈ మూడు సమానంగా ఉండటం వలన శరీరపు ఆరోగ్యం బాగుగా ఉండును.
వాతం ప్రకోపించినప్పుడు విరేచనబద్ధకం అగును. పిత్తం ప్రకోపించినప్పుడు విరేచనములు అగును. శ్లేష్మం అధికంగా ఉండటం వలన ఆంత్రములు ఎప్పటిస్థితి ఉండును. రజోగుణ వికారమైన వాతం సూక్ష్మముగా , శీతలంగా , వేగముగా , చులకనగా ఉండి మలాదుల విభజించుట చేత బలిష్ఠమైనది అని చెప్పబడును . ఈ వాయువు 5 రకాలుగా ఉండును. అవి
* ఉదానము .
* ప్రాణము .
* సమానం.
* అపానం .
* వ్యానము .
* ఉదనము -
ఇది ఉరోస్థి ( sternum ) కి పైగా కంఠము నందు ఉండును. ఈ వాయువు వలనే మనం మాట్లాడగలుగుతున్నాము. పాట పాడగలుగుచున్నాము అలాగే ధ్వనులను ఉచ్చరించగలుగుచున్నాము . దానికి లోపము కలిగినపుడు బోర ఎముకల ( Clavicles ) కు ఎగువ నుండు భాగములలో వ్యాధులు తటస్థించుచుండును.
* ప్రాణము -
ఇది హృదయమున నెలకొని నోటి నుండియు నాశిక నుండియు వెడలుచుండును. దీనివలన మనం ఉచ్ఛ్వాస నిశ్చ్వాసములు చేయగలుగుదుము . గుటక వేయుదుము . అది చెడినప్పుడు హిక్కా , కాస మొదలైన బాధలు సంభంవించును.
* సమానము -
ఇది అన్నాశయము (Stomach ) నందు జఠరాగ్నికి సమీపమున ఉండును. ఇది జీర్ణ పధమును చేరిన ఆహారము నుండి దేహమునకు పుష్టినిచ్చు రసమును తయారుచేసి , దాని సారమును మరియు వ్యర్ధమును విడగొట్టును. అది చెడినప్పుడు అజీర్ణం , నీళ్ళవిరేచనములు కలుగును.
* అపానము -
ఇది పొత్తికడుపు దిగువు భాగమున (Hypogastrinum ) ఉండును. ఇది మలమూత్రములను , శుక్రమును , ఋతురక్తమును , పిండమును బయటకి పంపుటకు సహాయపడును. ఇది చెడినప్పుడు మలబద్దకం ఏర్పడును . పురీషనాళం , మూత్రమార్గం , మూత్రకోశము వ్యాధులు , శుక్లదోషములును తటస్థించును.
* వ్యానము -
ఇది శరీరం అంతటను వ్యాపించియుండి ఆయా దేహభాగములకు కావలసిన ద్రవపదార్ధములను చేర్చి , పుష్టిని కలిగించుచుండును. ఇది చెమటను , రక్తమును స్రవింపచేయును. దేహము నందు కలుగు పలువిధ చలనములు దీనిని అనుసరించియే ఉండును. దీనికి చెరుపు కలిగినపుడు సమస్తమగు రుగ్మతలు కలుగును. అన్ని వాయువులు చెడినప్పుడు మరణము సంభంవించును.
వీటికి తోడుగా మరో 5 రకాల ఉపవాయువులు కలవు. వాటి గురించి కూడ వివరిస్తాను .
* నాగము -
ఇది వాక్కు నందు ఉండును. దీనివలన తేపులు కలుగును.
* కూర్మము -
ఇది కంటిరెప్పల యందు ఉండును. ఇది రెప్పలను కదులునట్లు చేయును .
* కృకరము -
ఇది నేత్రముల యందు ఉండును. ఇది తుమ్మునటుల చేయును .
* దేవదత్తము -
ఇది కంఠద్వారం నందు ఉండును. ఇది ఆవలింతలు పుట్టించును .
* ధనుంజయము -
ఇది హృదయ మధ్యమము నందు ఉండును. ఇది శరీరంను వాయువుచే సంపూర్ణంగా ఉంచును. మనిషి మరణించిన తరువాత కూడా శరీరం నందే ఉండి శరీరం ఉబ్బునట్లు చేయును .
తరవాతి పోస్టులో పిత్తములోని రకాల గురించి వివరిస్తాను.
అంతకు ముందు పోస్టు నందు వాతం మరియు దానిలోని రకాల గురించి మీకు తెలియచేశాను . ఇప్పుడు పిత్తము మరియు అందులోని రకాల గురించి వివరిస్తాను.
పిత్తము స్వతస్సిద్ధముగా వేడిగా , ద్రవముగా , పీత నీల వర్ణముగా ఉండును. చేదుగా , చెడినప్పుడు పులుసుగా , వేడిగా , తేలికగా సత్వగుణ ప్రధానంగా జిడ్డుగా ఉండును. ఇది దేహమునకు వేడి పుట్టించును .
ఈ పిత్తము 5 రకాలుగా ఉండును.
* పాచకము .
* రంజకము .
* సాధకము .
* ఆలోచకము .
* భ్రాజకము.
* పాచకము -
అన్నాశయము ( Stomach ) , పక్వాశయము ( Small Intestines ) మధ్యనుండును. అది జీర్ణశక్తికి తోడ్పడి దేహమంతటా ఉష్ణం కలిగించి సారమును మరియు వ్యర్ధపదార్థమును విడకొట్టును. జఠరాగ్నిని గూర్చి అనేకులు అనేక అభిప్రాయములు కలిగి ఉన్నారు . కొందరు పిత్తమునే జఠరాగ్ని అనిరి. మరికొందరు మరికొన్ని విధములుగా రాసిరి. రసప్రదీపిక గ్రంధకర్త జఠరాగ్ని నాభిమధ్యమున బహుసూక్ష్మ రూపమున ఉండునని రాసినారు. అతి పిత్తరసమునకి ఉష్ణమును కలిగించి అన్నాశయమున చేరిన పదార్ధములను జీర్ణం చేయును . అది మిక్కిలి పెద్ద జంతువుల యందు నువ్వుగింజ అంత ప్రమాణముగా కీటకాదుల యందు వెంట్రుక కొనంత చిన్నదిగా ఉండును.
* రంజకము -
యాకృత్ ( Liver ) నందును , ప్లీహము ( Spleen ) నందున ఉండును. ఇది పిత్తరసమునకు ఎరుపుదనం ఇచ్చి రక్తముగా చేయుచుండును .
* సాధకము -
హృదయమందు ఉండును. మేధ , ప్రజ్ఞ వీటిని కలుగజేయును .
* ఆలోచకము -
నేత్రములను ఆశ్రయించి ఉండును. అయ్యది నీల , పీత , స్థూల , సూక్ష్మాది రూపజ్ఞానం కలుగచేయును .
* భ్రాజకము -
తగ్విన్ద్రియము ( Skin ) ని ఆశ్రహించి ఉండును. మనుజులు కావించెడి అభ్యంగన లేపనాదులను పరిపాకము చేయుచూ దేహమునకు కాంతిని కలుగచేయును.
కావున పిత్తము అయిదు స్థానముల యందు అయిదు నామములచేత విలసిల్లుతూ ఐదురకాల కార్యక్రమములు నిర్వర్తించును.
తరవాతి పోస్టులో శ్లేష్మ సంబంధ రకాలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.
మానవ శరీరం నందలి వాత , పిత్త , కఫ స్థానాలు - రకాలు . 3 .
అంతకు ముందు పోస్టులో పిత్తం యొక్క స్థానం మరియు రకాల గురించి వివరించాను .ఇప్పుడు మీకు కఫం మరియు దానిలోని రకాల గురించి వివరిస్తాను.
శ్లేష్మం మృదువుగా , బరువుగా , శ్వేతవర్ణం కలదిగా , జిగటగా , శీతలంగా , మధురంగా , తమోగుణ ప్రధానంగా ఉండును. కాని విరుద్ద వస్తుసంయోగం చేత వికారం చెందినపుడు లవణ రసముగా ఉండును. మరియు ఆ శ్లేష్మధాతువు ఉండు స్థానములను బట్టి 5 విధములుగా పిలవబడును. అవి
* ఖ్లేదనం .
* ఆవలంబనము .
* రసనము .
* స్నేహనము .
* శ్లేష్మణము .
* ఖ్లేదనం -
ఆమాశయం నందు ఉండును. భుజించిన పదార్దాలను తడిపి అవయవాలకు పుష్టి కలిగించును.
* అవలంబనము -
హృదయమందున , భుజ సంధుల యందు త్రిక్కు ( Sterno clavicular joints ) యందును ఉండును.
* రసము -
గొంతు నందున , నాలుక యందును ఉండి వానిని తడిగా ఉండునట్లు చేయును . అందువలన మనము ఆహారాదుల రుచిని పొందగలము .
* స్నేహనము -
శిరము నందు ఉండి జ్ఞానేంద్రియములను తడిగా ఉండునట్లు చేయుట వలన సుఖమును ఇచ్చును.
* శ్లేష్మణము -
సంధుల యందు ఉండి వానివాని పనులను నిర్వర్తించుటకు సంసిద్ధముగా చేయును .
కొన్ని చిహ్నములను బట్టి మనుజుని యందు ఏ పదార్థం ప్రధానంగా ఉన్నదో తెలుసుకొనవలెను. వాత, పిత్త, శ్లేష్మములు తమ స్థానముల యందు వృద్ధిచెందుటను "చయావస్థ" అనియు వృద్ధిచెందిన స్థానం విడనాడి నాడుల యందు పైకి నడుచుచుండిన "ప్రకోపవస్థ" అనియు తమతమ స్థానముల యందు సమముగా ఉండిన "శమావస్థ" అనియు , తమతమ స్థానముల యందు హీనదశను చెందిన "క్షయావస్థ" అనియు చెప్పబడును .
Be a light unto yourself
ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.
– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే...
🙏😊.
No comments:
Post a Comment