Monday, January 20, 2020

పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం? rokali at marriage time

రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సద్దలు, రావులు, తైదులు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.
పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో
తెలియడం లేదు. వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.
అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని, పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము.

No comments:

Post a Comment