Monday, January 20, 2020

• నానబెట్టి తిని చూడండి! soaked food benefits

కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలుంటాయి. అవేంటీ...  ఏ పదార్థాలు అలా తీసుకోవచ్చో చూద్దామా...!

* మెంతులు: రెండు చెంచాల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటినీ తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పులూ తగ్గుతాయి.

* అవిసె గింజలు: వీటిలో పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌-బి, ఇనుము, మాంసకృత్తులు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ చెంచా నానబెట్టిన గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది.

* అంజీరా: ఇది పోషకాల గని. దీంట్లో ఎ, బి విటమిన్లు, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్‌, సోడియం, పొటాషియం, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరును చురుగ్గా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి.

* బాదం : రోజూ నానబెట్టిన అయిదారు బాదంపప్పులను తింటే మెదడు చురుకుగా ఉంటుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ సమస్య తగ్గడంతోపాటు బరువూ నియంత్రణలో ఉంటుంది.

* ఎండుద్రాక్ష: వీటిలో ఇనుము, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కిస్‌మిస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారడంతోపాటు కాంతులీనుతుంది. రోజూ రాత్రిపూట పది, పన్నెండు ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇనుము సమృద్ధిగా అందుతుంది.

No comments:

Post a Comment