Monday, January 20, 2020

సోమలత చెట్టు తో ప్రాచీన రహస్య తంత్రం - వివరణ . somalatha tree kayakalpa

భారతీయ ప్రాచీన తాంత్రిక మరియు ఆయుర్వేద గ్రంధాల ప్రకారం దేవతలు తాగగా మిగిలిన అమృతపు చుక్కలు భూమి మీద పడటం వలన సోమలత ఉద్భవించింది. సోమలత చెట్టు యొక్క రసంని తాగినవారిని
" సోమయాజి " అంటారు. దీనిని కాయకల్ప విదానం అంటారు. కాయకల్ప విధానం అనగా వందల సంవత్సరాలు గడిచినను యవ్వనం కోల్పోక వృద్ధాప్యం అనేది లేక జీవించి ఉండటం .

            పురాణ గ్రంథాల ప్రకారం ఋష్యశ్రుంగి మహర్షి సోమపానం చేసి సోమయాజిగా అవతరించాడు. ఈయన శ్రీరామచంద్రుడి కి బావగారి వరస శ్రీరామ చంద్రుని అక్కగారు అయిన శాంతాదేవి భర్త . ఇది త్రేతాయుగమున జరిగిన సంఘటన.

 సోమలత పానం  చేయడం వలన ఉపయోగాలు -

   నిర్విఘ్నంగా సొమపానం చేసిన వారికి మళ్ళీ యవ్వనం కలుగును. వృద్ధుడైనా సరే పురిటిబిడ్డకు వలే దంతాలు మరలా మొలుచును. పాము కుబుసం వలే ముసలి చర్మం ఊడి ఎర్రని అందమైన చర్మం కలుగును. బుద్ది పెరుగును. జరారోగాలు ఏమి దరిచేరవు. పూర్ణాయుష్షు కలుగును.

 సోమలత వివరణ -

    ఈ సోమలత కృతయుగంలో గరుఖ్మంతునిచే భూమికి తీసుకురాబడినది. దీనికి మరొకపేరు గాయత్రి దీనిని అమృతమూలికగా శుశ్రుతుడు తన శుశ్రుత సంహితలో వివరించాడు.

           కాలక్రమంలో యుగాలు మారి మనుష్యులుచేసే పాపకర్మలు పెరిగి విషవాయువులు వలన కొండలలోనుంచి వనముల నుంచి ఈ సోమలతలు ఉపసంహరించుకొని చివరకు ఒక హిమాలయాలలోని " ముంజవత్ " అనే పర్వతంలో మాత్రమే లభించును. ఇప్పటికి హిమాలయాలలో కొందరు మునీశ్వరులు , లామాలు వందలు సంవత్సరాలుగా జీవిస్తున్నారు.

  సోమలత వర్ణన  -

    ఈ సోమలత 4 జాతులుగా చెప్పబడింది.

  1. బ్రహ్మజాతి.
  2. క్షత్రజాతి.
  3 .వైశ్యజాతి.
  4. శూద్రజాతి.

     బ్రహ్మజాతి సోమలత తెల్లగా సిల్క్ వలే పాలమీద మీగడవలె హిమాలయ సరస్సులలో మొలిచే నాచు వంటిది. ఇది ప్రస్తుతం అలభ్యం . క్షత్రజాతి సోమలత బంగారు రంగు పాలని కలిగి పుల్లజెముడు వలే కాడలు కలిగి ఉంటుంది.

         ద్వాపరయుగంలో సోమలత ఒక తీగవలె చంద్రుడి వలన వృద్ధిపొందె ఔషధిగా వర్ణించబడినది. కలియుగంలో లభించే సోమలత దుంపవలె భూమిలో ఉండి పైకి కాండముతో మొలిచి ప్రతిరోజు ఒక్కో ఆకు చిగురిస్తూ శుక్లపక్షంలో పెరిగి పౌర్ణమి నాడు ( 15) ఆకులు అన్ని విచ్చుకుంటాయి. తిరిగి కృష్ణపక్షంలో అమావాస్య దగ్గర అవుతున్న కొలది రోజుకి ఒక్కో ఆకు రాలిపోతూ అమావాస్య నాటికి వట్టి మొక్క కాండంతో మాత్రమే ఉంటుంది. ఇలా సోముడు అని నామముగల చంద్రునిని అనుసరించి వృద్ధిక్షయాలు కలిగి ఉంటాయి కనుక సోమలత అని పేరు వచ్చింది.

       పైన చెప్పిన మిగతాజాతులకు గాయత్రం , త్రైష్టభం , గరుడా హృతము , సోమలత ( కలియుగం నందు కలది ) పేర్లు కలవు. ఇవి హిమాలయాలలో ముంజావత్ శిఖరం నందు లభించును.

 సోమలతని సంగ్రహించే విధానం  -

      ఈ సోమలతని చంద్రుడు రోహిణి నక్షత్రయుతుడై పరిపూర్ణంగా కలిగిన చంద్రుడు వచ్చినప్పుడే దీనిని వేదవిధానంలో పూజించి తీయాలి . పరిపూర్ణంగా చంద్రుడు రావడం అంటే ఒక ప్రత్యేక అర్ధం ఉన్నది. ప్రతినెలా పూర్ణిమ వస్తుంది. కాని అవన్నీ పరిపూర్ణం అగు పూర్ణిమలు కావు. ఎందుకనగా పూర్ణిమ ఘడియలు పగలు మాత్రమే ఉండి రాత్రి అయ్యేసరికి పూర్ణిమ అంతమయిపోయేది. సరైయిన పూర్ణిమ రాత్రి 11 గంటలకు మొదలై అనగా శుక్లచతుర్దశి దాకా వృద్ధిపొందుతూ ఉండే చంద్రుడు సరిగ్గా రాత్రి 12 గంటలకు నడి ఆకాశంలో నెత్తిమీద వెండిబిళ్లలా వెలుగుతూ పాలు వర్షించినట్టు వెన్నెల వర్షించాలి.అట్టి పూర్ణిమ అనే పదహారు కళల పరిపూర్ణ తిధి.

  వివిధ పూర్ణిమలు  -

      పౌర్ణమి ఘడియలు ప్రతినెలలోను ఒకే పొడుగు ఉండవు. ఇటు చతుర్దశి అటు పాడ్యమి తరిగిపోయి మధ్యనే ఉన్న పూర్ణిమ తిథి పెరిగి రోజున్నర నుండి రెండురోజులు వ్యాపించాలి. అప్పుడే ఆ చంద్రునికి పదహారు కళలు ఉంటాయి.

           మిగతా పూర్ణిమలలో ఒక్కో తిధికి ఒక్కో కళ చొప్పున పదిహేను రోజుల పక్షంలో పూర్ణిమకు పదిహేను కళలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇలాంటి పదహారు కళలు గల పూర్ణచంద్రుడు నట్టినడిమి ఆకాశంలో సరిగ్గా అర్ధరాత్రికి పట్టే పూర్ణిమ రొహిణి నక్షత్రములో అది సోమవారం రావలెను.

  సోమలతని ఉపయోగించే విధానం  -

     సొమపానం చేయుటకు సిద్ధపడినవాడు సర్వవిధముల అగు పరికరములు , పరిచారికలు అన్నియు సిద్ధము చేసుకుని ఒక నిర్థిష్టమైన ప్రదేశము నందు మూడు ఆవరణాలతో ఇంటిని ఏర్పాటు చేసుకుని శరీరం నందు గల మలినాలను స్వేదన , పంచకర్మ  పద్ధతులతో  శుద్ది చేసుకుని దోషములు పోగొట్టుకొని ప్రశస్తమైన తిథి , వార, నక్షత్రములను , ముహుర్తములు చూసుకొని ఆ గృహము నందు ప్రవేశించి ఆహారము తీసుకోకుండా " యాంశుమంత"  అను సోమలతని తీసుకుని యజ్ఞవిధానంతో సమంత్రకముతో దానిని తీసుకువచ్చి అందుకొంత నలగగొట్టి రసము తీసి యజ్ఞవిధిని అనుసరించి అగ్ని యందు హోమము చేసి పిమ్మట గృహమధ్యమం నందు ఉండి స్వస్తివాచనములు చేయించుకుని ఆ సోమలత యొక్క దుంపని బంగారు సూదితో గీకి అందునుండి కారుచున్న పాలని సువర్ణపాత్ర యందు ఒక కుడవ ప్రమాణం గ్రహించి ఒక్కసారిగా మింగవలెను పిమ్మట నాచనమును చేసి పాత్రలో మిగిలియున్న పాలని నీళ్లలో పోసివేయవలెను. తరువాత బాహ్యేంద్రియములను , మనస్సుని అరికట్టి ఇతర విషయముల యందు ప్రవర్తించక తనను తాను సిద్ధపరచుకొని నియమముతో ఆ గృహము నందే ఉండవలెను.

                 పైన చెప్పిన విధముగా సోమరస పానము చేసినవాడు గాలితగలని అంతర్గత గృహము నందే ఉండవలెను . అనగా సోమరసపానం చేసిన వ్యక్తి శరీరముకు సూర్యరశ్మి , గాలి తగలరాదు. ఆ గృహమునందే తదేక ధ్యానముతో కూర్చుండుట కాని , నిలబడుటకాని , అటుఇటు పచారీ చేయుటకాని చేయవలెను . ఎట్టిపరిస్థితులలో పడుకోకూడదు .

   
         సాయాంకాలం అయిన తరువాత హితమైన మరియు మితమైన భోజనం తీసుకుని దర్భచాపపైన లేడిచర్మం పరచుకొని మిత్రులతో సంభాషిస్తూ  పరుండవలెను. దప్పిక కలిగినచో కొంచం చల్లటినీరు తాగవలెను.

          మరునాడు ఉదయం లేచి శాంతిమంత్రములు వినుచూ స్వస్తివాచనం చేయించుకుని గోవుని స్మృశించి మొదటిరోజువలె కూర్చుండవలెను. ఇలా కూర్చున్న కొంతసమయం తరువాత తొలిరోజు తీసుకున్నటువంటి సోమరసము జీర్ణం అవ్వగా మిగిలినది వాంతి అవ్వడం ప్రారంభించును. అట్లు వమనం ( వాంతి ) లు అయ్యి తుదకు రక్తముతో కూడి పురుగులతో వాంతి అగును. సాయంకాలం అయినతరువాత కాగి చల్లారిన పాలని త్రాగుటకు ఇవ్వవలెను. తరువాత పురుగులతో కూడిన విరేచనం అగును. దానివలన ఇప్పటివరకు యోగి తీసుకున్న ఆహారం వలన కలిగిన దోషాలన్నీ పోయి శరీరం పూర్తిగా శుద్ది అగును. పిమ్మట సాయంకాల స్నానం చేయించి పాలని త్రాగుటకు ఇవ్వవలెను. మెత్తటి పట్టుబట్ట పరవబడిన పడకయందు యోగిని పడుకోబెట్టవలెను. తరువాత నాల్గొవ దినమున అతని శరీరం వాచిపోవును. ఆ పైన అన్ని అవయవములు నుండి కురుపులు  బయలుదేరును. ఆ రోజున పగలే పడక యందు మెత్తటి మట్టి చెల్లించుకొని పడుకోవలెను లేనిచో వస్త్రములు శరీరముకు అంటిపోవును.

        పిమ్మట సాయంకాలం వెనుకటి వలెనే పాలు త్రాగవలెను. ఇలా అయిదు నుంచి ఆరు దినములు పాలని మాత్రమే ఆహారముగా ఇచ్చుచుండవలెను . ఎడొవ దినమును యోగి మాంసం అంతయు క్షీణించి చర్మము , ఎముక మాత్రమే మిగిలినట్లు జీవించి  ఉండును. ఆ రోజున వెచ్చవెచ్చని పాలతో దేహమును తడిపి నువ్వులు , యష్టిమధూకం , చందనము కలిపి నూరిన ముద్దని బూసి పాలని త్రాగించి మంచి స్వచ్ఛమైన పట్టుబట్ట పరిచిన పడక యందు పరుండబెట్టవలెను. అందువలన అతని శరీరం నందు మాంసం కోలుకొనుట ఆరంభించును. చర్మం మాత్రం రాలిపోవును. పండ్లు , గోళ్లు , రోమములు రాలిపోవును . అతనికి తొమ్మిదొవ దినం నుండి అణుతైలం శరీరముకు పూయవలేను . తెల్లచండ్ర చెక్క కషాయముతో శరీరముని తడుపుచూ ఉండవలెను . 

                పదోవదినము కూడా ఈ విధమైన ఆహారమునే ఇవ్వవలెను. అందువల్ల అతని శరీరం ధృడపడును. ఇలా పదుకొండు , పన్నెండోవ దినము నందు కూడా ఉండవలెను . పదమూడోవ దినం నుండి తెల్ల చండ్ర చెక్క కషాయాముతో స్నానం చేయించుచుండవలెను. ఇలా పదహారోవా దినము వరకు చేయించవలెను. తరువాత పదిహేడో దినం మరియు పద్దెనిమోదో దినముల యందు మంచి అందముతో  వజ్రసమానం అయిన స్పటికం వంటి తెల్లని రంగుతో చాలా గట్టి దంతములు కొత్తగా ఏర్పడును. అప్పుడు మొదలుకొని పాత సన్నని వరిబియ్యము పాలల్లో ఉడికించి పలుచని జావలా చేసి ఇరవ్వైఅయిదో దినం వరకు త్రాగించుచుండవలెను .

            అటు పిమ్మట మృదువైన సన్నని వరిబియ్యముని పాలతో ఉడికించి రెండు పూటలా భోజనం ఇవ్వవలెను. ఆ తరువాత అతనికి లీత సూర్యుడి కాంతితో సమానం అయిన కాంతితో క్రొత్తగా గోళ్ళు మొలచును. దానితో పాటు మెత్తని ఒత్తైన జుట్టు కూడా మొలచును. నెలదినములు అయిన తరువాత కేశములుని క్షౌరము చేయించి వట్టి వ్రేళ్ళు , చందనం , నల్లనువ్వులు వీనిని కలిపి నూరిన ముద్దని శిరస్సుకి పట్టించి పాలతో స్నానం చేయించవలెను . అటు పిమ్మట ఏడు దినములలో అతనికి తుమ్మెదలతో సమానమైన నల్లటి వర్ణం కలిగిన అందమయిన జుట్టు ఒత్తుగా వచ్చును. అటు పిమ్మట మూడు రోజులు అయిన తరువాత మూడోవ గది నుండి రెండొవ గదిలోకి వచ్చి ఒక ముహూర్తకాలం ఉండి వెంటనే మూడోవ గదిలొకి వెళ్లవలెను. అప్పటికి సోమరస జీవన మొదలుపెట్టి 45 దినములు అయ్యిఉంటుంది. అనగా సూర్యరశ్మి శరీరానికి తగలకూడదు.

             అటు తరువాత బలా తైలముతో అభ్యంగనం , యావల పిండితో నాలుగుబెట్టుట చేయవలెను . వట్టి వ్రేళ్ళతో కూడిన నూతినీటి స్నానం వెచ్చవెచ్చటి నీరు శరీరంపైన పోయుచూ మద్దిపట్ట కషాయం నాలుగు పిండిలో కలిపి స్నానం చేయించవలెను .

         ఇలా పది దినములు వరకు నడపవలెను.అప్పటి సోమరస పానం మొదలుపెట్టి 50 దినములు అగును. మరొక పదిదినములు తరువాత రెండొవ గదిలోకి వచ్చి నివసించుచుండవలెను. తరువాత మూడొవ గదిలొకి వచ్చి పదిదినములు ఉండవలెను . దీనివల్ల శరీరముకు గాలి కొంచం ఎండ తగలడం వలన శరీరం దృఢపడును. మరలా కొంచం సేపు ఉండి లొపలికి పోవుచుండవలెను. ఈ సమయం నందు క్రోధము కోపము కలగనియ్యకూడదు.

          ఇలా మూడు మాసములు సవినయముగా ఉండి నాలుగోవ మాసము నందు పరిశుద్ధం అయిన ప్రదేశము నందు బ్రాహ్మణ పరిషత్ ని సమావేశపరిచి విధిగా చర్చించి వారిచే ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి పైకి తిరుగుట ఆరంభించవలెను. అనగా శరీరానికి సూర్యరశ్మి తగిలేలా ఇంటి ఆవరణలో సంచరించుట అని అర్థం . విధింపబడిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించవలెను.

  సోమరస సేవన వలన ఫలితములు -

      ఔషధములు అన్నింటిలో గల రాజు అగు సోమలత సేవనం చేయడం వలన పదివేల సంవత్సరములు యవ్వనంతో కూడిన శరీరంతో ఉండును. అగ్ని , నీరు , విషము , శస్త్రములు ఏవి కూడా అతనిని చంపలేవు .

          రోగం అన్నది లేకుండా వేయి ఏనుగులు బలము పొంది క్షీరసముద్రమునకు గాని , స్వర్గలోకమునకు గాని ఏ లోకమునకు అయినా పోవాలి అనుకున్నచోటుకి తలచినవెంటనే క్షణకాలంలో పోగలడు. మన్మధరూపం పొంది చంద్రుని వంటి కాంతిని పొంది సర్వభూతములుని రంజింపచేసే శక్తిని కలిగి ఉండును. వేదములు , సకల గ్రంధాలు అతని మెదడు నందు నిక్షిప్తం అయ్యి ఉండును.

                  *   సమాప్తం *

       మీకు పైన వివరించిన సోమలత ఈ కలియుగం నందు అత్యంత అరుదుగా దొరుకును. కాని సోమలతకి సమానం అయిన ఫలితాలు ఇవ్వగల శక్తిమంతం అయిన ఔషధాలు ఇంకో 18 రకాలు కలవు.  వాటి గురించి మరెప్పుడు అయినా మీకు వివరిస్తాను.

      ఆంధ్రదేశము నందు శ్రీశైల కొండలలో దట్టమైన అటవీప్రాంతములో సోమలత కలదు.

No comments:

Post a Comment