Monday, January 20, 2020

అష్టదిక్పాలకులు. astadikpalakulu

.           🕉  అష్ట దిక్పాలకులు 🕉              .
            *************************

*తూర్పు:* తూర్పు దిక్కును "ఇంద్రుడు" పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
 
*పడమర:* పడమర దిక్కునకు అధిష్టాన దేవత "వరుణడు." గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కుకంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.
 
*ఉత్తరం:* ఈ దిక్కుకు అధిష్టాన దేవత "కుబేరుడు." దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
 
*దక్షిణం:* దక్షిణం దిశకు అధిష్టాన దేవత "యముడు." ఉత్తరదిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
 
*ఈశాన్యం:* ఈ దిక్కుకు అధిదేవత "ఈశ్వరుడు." అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
 
*ఆగ్నేయం:* ఈ దిక్కుకు అధి దేవత "అగ్నిదేవుడు." అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.
 
*వాయవ్యం:* వాయువ్యానికి అధిదేవత "వాయువు." ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
 
*నైరుతి:* ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉడడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

No comments:

Post a Comment